అమెరికాలో ఓపీటీ దుర్వినియోగం..
ABN , Publish Date - May 14 , 2026 | 05:17 AM
ఉన్నత చదువుల కోసం అమెరికాకు వచ్చే విదేశీ విద్యార్థులపై ట్రంప్ ప్రభుత్వం నిఘాను మరింత పెంచింది. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) విధానాన్ని దుర్వినియోగం చేస్తున్న...
10 వేల మంది విదేశీ విద్యార్థుల గుర్తింపు
వారిలో అనేక మంది భారతీయులు
వాషింగ్టన్, మే 13: ఉన్నత చదువుల కోసం అమెరికాకు వచ్చే విదేశీ విద్యార్థులపై ట్రంప్ ప్రభుత్వం నిఘాను మరింత పెంచింది. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) విధానాన్ని దుర్వినియోగం చేస్తున్న 10 వేల మంది విదేశీ విద్యార్థులను గుర్తించినట్లు ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసీఈ) వెల్లడించింది. వీరిలో అనేకమంది భారతీయులు కూడా ఉన్నట్లు తెలిపింది. స్టూడెంట్ వీసాపై వచ్చే విదేశీ విద్యార్థులకు ఓపీటీ కింద ఏడాది లేదా రెండేళ్ల పాటు అమెరికాలో పనిచేసే అవకాశం ఉంటుంది. ఏదైనా సంస్థ ద్వారా హెచ్1బీ వీసా పొందే వెసులుబాటు కూడా ఉంది. అయితే ఓటీపీ దుర్వినియోగం జరుగుతోందని, ఇది అక్రమాలకు కేంద్ర బిందువుగా మారిందని ఐసీఈ డైరెక్టర్ టాడ్ లైయాన్స్ పేర్కొన్నారు. ఈ కేసుల్లో హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం దర్యాప్తు చేపట్టిందని చెప్పారు. ‘ఓపీటీ నిబంధనల ప్రకారం విదేశీ విద్యార్థులు అమెరికాలోని సంస్థల నుంచే శిక్షణ పొందాలి. కానీ, చాలామంది భారత్‌లోని ఉద్యోగుల పర్యవేక్షణలో పనిచేస్తున్నట్లు గుర్తించామ’ని తెలిపారు. అలాగే తప్పుడు పత్రాలతో అమెరికాలో ఉండేందుకు గడువు పొడిగించుకుంటున్నట్లు కూడా విచారణలో తేలిందన్నారు. అంతేకాదు... గూఢచర్యం, వీసా, ఉద్యోగాల్లో దగా, మేధో చౌర్యం, వృద్ధ అమెరికన్లను మోసగించడం వంటి కేసుల్లో విద్యార్థులుగా వచ్చి అక్రమంగా తిష్ట వేసినవారే నిందితులుగా తేలుతున్నారని పేర్కొన్నారు. ఓపీటీ కింద అమెరికాలో పనిచేసే విద్యార్థుల సంఖ్య అంచనాలకు మించి లక్షల్లోకి చేరిందని, అలాగే మోసాలు పెరిగాయన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఎయిర్ ఇండియా సంస్థ కీలక నిర్ణయం.. ఆ మార్గాల్లో విమానాల రద్దు..
నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో సీబీఐ దూకుడు.. ఐదుగురి అరెస్ట్