Share News

ఆ టైమ్ వచ్చింది.. ఇరాన్‌కు ట్రంప్ మరో హెచ్చరిక

ABN , Publish Date - Apr 19 , 2026 | 07:35 PM

తాము ప్రతిపాదించిన డీల్‌కు ఇరాన్‌కు ఒప్పుకోకపోతే బాంబుల వర్షం కురిపిస్తామని ట్రంప్ మరోసారి ఇరాన్‌ను హెచ్చరించారు. రేపు ఇరాన్, యూఎస్‌ల మధ్య మరోసారి చర్చలు జరగనున్న నేపథ్యంలో ఆయన నెట్టింట ఈ మేరకు పోస్టు పెట్టారు.

ఆ టైమ్ వచ్చింది.. ఇరాన్‌కు ట్రంప్ మరో హెచ్చరిక
Trump Warns Iran

ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్‌తో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం త్వరలో ముగియనున్న నేపథ్యంలో యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో హెచ్చరిక చేశారు. ఇప్పటివరకూ తాము మంచితనంతో వ్యవహరించామని చెప్పుకొచ్చారు. ఇక తాము ప్రతిపాదించిన ఒప్పందానికి ఇరాన్ అంగీకరించాలని స్పష్టం చేశారు. లేకపోతే పరిస్థితి మరోలా ఉంటుందని హెచ్చరించారు. పాకిస్థాన్ వేదికగా రేపు ఇరాన్, అమెరికా ప్రతినిధులు మరోసారి సమావేశం కానున్న నేపథ్యంలో ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో ఈ హెచ్చరికలు చేశారు.

‘ఇరాన్ నిన్న హోర్ముజ్‌లో కాల్పులకు దిగింది. ఇది కాల్పుల విరమణ ఒప్పందానికి పూర్తి విరుద్ధం. వాళ్లు ఫ్రెంచ్ నౌక వైపు, మరో బ్రిటన్ నౌక వైపు గురిపెట్టారు. ఇది పద్ధతిగా లేదు’ అని ట్రంప్ అన్నారు. ఈ పరిస్థితుల్లో తమ ప్రతినిధులు ఇరాన్‌ బృందంతో ఇస్లామాబాద్‌లో రేపు చర్చలు జరుపుతారని తెలిపారు.


హోర్ముజ్‌ను మూసివేస్తున్నట్టు ఇరాన్ ప్రకటించడం విడ్డూరంగా ఉందని కూడా ట్రంప్ అన్నారు. తాము అంతకుముందే హోర్ముజ్ దిగ్బంధించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇరాన్ తనకు తెలియకుండానే అమెరికాకు మేలు కలిగేలా చేస్తోందని అన్నారు. హోర్ముజ్ మూసివేత కారణంగా రోజుకు 500 మిలియన్ డాలర్లను ఇరాన్ నష్టపోతోందని అన్నారు. నౌకలన్నీ ప్రస్తుతం టెక్సాస్, లూసియానా, అలాస్కా వైపు చమురు కోసం వస్తున్నాయని చెప్పారు. ఇందుకు ఇరాన్ సైన్యాన్ని అభినందించాల్సిందేనని ఎద్దేవా చేశారు. తమకు తిరుగేలేదన్నట్టు వారు బిల్డప్ ఇస్తుంటారని వ్యాఖ్యానించారు.

ఇరాన్‌కు తాము సముచిత డీల్‌ను ప్రతిపాదించామని కూడా ట్రంప్ చెప్పారు. ‘వాళ్లు ఈ డీల్‌కు ఒప్పుకుంటారనే అనుకుంటున్నా. ఒక వేళ వాళ్లు డీల్‌కు అంగీకరించకపోతే మేము ఇరాన్‌లోని ప్రతి విద్యుత్ ప్లాంట్, ప్రతి వంతెనపై బాంబులు కురిపిస్తాము. నేను పని ముగించాల్సి వస్తే నాకు దక్కిన గౌరవంగా భావిస్తాను. అసలు ఈ పనిని గత అమెరికా అధ్యక్షులు ఎప్పుడో చేసుండాల్సింది. ఇరాన్‌కు చెక్ పెట్టాల్సిన టైమ్ వచ్చింది’ అంటూ సోషల్ మీడియాలో సుదీర్ఘ పోస్టు పెట్టారు.


ఈ వార్తలనూ చదవండి:

శ్రీలంక ప్రధాని హరిణి అమరసూర్యతో ఉప రాష్ట్రపతి సీ.పీ. రాధాకృష్ణన్ భేటీ

భారత నౌకలపై ఇరాన్ కాల్పులు.. వైరల్‌గా మారిన ఆడియో

Updated Date - Apr 19 , 2026 | 08:16 PM