శ్రీలంక ప్రధాని హరిణి అమరసూర్యతో ఉప రాష్ట్రపతి సీ.పీ. రాధాకృష్ణన్ భేటీ
ABN , Publish Date - Apr 19 , 2026 | 06:35 PM
భారత ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ తన రెండు రోజుల అధికారిక శ్రీలంక పర్యటనలో భాగంగా నేడు (ఆదివారం) ఆ దేశ ప్రధాని హరిణి అమరసూర్యతో సమావేశమయ్యారు.
కొలంబో, ఏప్రిల్ 19: భారత ఉప రాష్ట్రపతి సీ.పీ. రాధాకృష్ణన్ తన రెండు రోజుల అధికారిక శ్రీలంక పర్యటనలో భాగంగా ఇవాళ (ఆదివారం) ఆ దేశ ప్రధాని హరిణి అమరసూర్యతో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడం, ప్రజల మధ్య సంబంధాలను మెరుగుపరచడంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించారు.
ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిస్సానాయకేతో కూడా సమావేశమయ్యారు. భారత్ అనుసరిస్తున్న 'నేబర్‌హుడ్ ఫస్ట్' (పొరుగు దేశమే మొదటి ప్రాధాన్యత) విధానానికి తాము కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా ఆయన పునరుద్ఘాటించారు. శ్రీలంకలోని భారత సంతతి తమిళుల కోసం భారత్ చేపట్టిన గృహ నిర్మాణ ప్రాజెక్టు పురోగతిపై చర్చించారు. మూడో దశలో భాగంగా నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు వర్చువల్ పద్ధతిలో అందజేశారు. ఇప్పటివరకు 50,000 ఇళ్లు పూర్తి కాగా, మరో 10,000 ఇళ్ల నిర్మాణం నాలుగో దశలో కొనసాగుతోంది.
ఇటీవల శ్రీలంకను వణికించిన 'దిత్వా' తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పునర్నిర్మాణ పనుల కోసం భారత్ ప్రకటించిన 450 మిలియన్ డాలర్ల ప్యాకేజీ అమలుపై కూడా నేతలు సమీక్షించారు. శ్రీలంక ప్రతిపక్ష నేత సజిత్ ప్రేమదాస కూడా ఉప రాష్ట్రపతిని కలిసి ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు.
భారత ఉప రాష్ట్రపతి శ్రీలంకలో ద్వైపాక్షిక పర్యటన చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. రేపు (ఏప్రిల్ 20) ఆయన నువారా ఎలియా ప్రాంతంలో పర్యటించి, అక్కడ నివసిస్తున్న భారత సంతతి తమిళులతో నేరుగా మాట్లాడనున్నారు. అలాగే అక్కడి ప్రసిద్ధ సీతా ఆలయాన్ని కూడా సందర్శించనున్నారు. శతాబ్దాల నాటి సాంస్కృతిక, నాగరికత సంబంధాలను కలిగి ఉన్న భారత్ - శ్రీలంకల మధ్య ఈ పర్యటన కొత్త ఉత్తేజాన్ని నింపుతుందని దౌత్య వర్గాలు భావిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
మా హక్కులను హరించే అధికారం ఎవరికీ లేదు: ఇరాన్ అధ్యక్షుడు
నేనేమీ జ్యోతిష్యుడిని కాదు.. కానీ సీఎస్కేకి సంజు కెప్టెన్ అవుతాడు: అశ్విన్