ఇక డాలర్ నోట్లపై ట్రంప్ సంతకం.. ప్రకటించిన యూఎస్ ట్రెజరీ సెక్రటరీ
ABN , Publish Date - Mar 27 , 2026 | 08:22 AM
ఇకపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకంతో డాలర్ నోట్లను ముద్రించనున్నారు. ట్రంప్ సంతకంతో తొలి 100 డాలర్ల నోటును జూన్‌లో విడుదల చేస్తామని యూఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ తాజాగా తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా చరిత్రలో మునుపెన్నడూ చూడని అధ్యాయానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాంది పలికారు. త్వరలో ఆయన సంతకం ఉన్న డాలర్ నోట్లను విడుదల చేస్తామని అమెరికా ట్రెజరీ సెక్రటరీ (ఆర్థిక శాఖ మంత్రి) స్కాట్ బెసెంట్ పేర్కొన్నారు. అధ్యక్షుడు పదవిలో కొనసాగుతున్న తరుణంలోనే ఆయన సంతకంతో కరెన్సీ నోట్ల ముద్రణకు ప్రభుత్వం సిద్ధం కావడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి (Trump Signature on US Currency Notes).
ప్రస్తుతం ట్రెజరీ సెక్రటరీ, ట్రెజరర్‌ల సంతకాలతో కరెన్సీ నోట్లను ముద్రిస్తున్నారు. 1861 నుంచి ఇదే విధానం కొనసాగుతోంది. మాజీ ట్రెజరీ సెక్రటరీ జానెట్ యెలెన్, ట్రెజరర్ లిన్ మాలెర్బాల సంతకాలు ఉన్న డాలర్ నోట్లు ప్రస్తుతం అమెరికాలో చెలామణిలో ఉన్నాయి. ఈ విధానానికి ట్రంప్ చెక్ పెట్టారు. ఇకపై అధ్యక్షుడు, ట్రెజరీ సెక్రటరీ సంతకాలతో నోట్లు విడుదల కానున్నాయి.
ట్రంప్ సంతకంతో పాటు అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ సంతకంతో ఇకపై డాలర్ నోట్లను ముద్రించనున్నారు. ఈ మార్పులతో జూన్‌లో మొదటగా 100 డాలర్ల నోటును విడుదల చేయనున్నట్టు స్కాట్ బెసెంట్ తెలిపారు. అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.
‘ట్రంప్ సంతకంతో డాలర్ నోట్లను విడుదల చేస్తాము. ఈ ఏడాది అమెరికా జరుపుకోనున్న 250వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ చరిత్రాత్మక విజయాలను స్మరించుకునేందుకు ఇదో అద్భుత మార్గం’ అని స్కాట్ బెసెంట్ చెప్పారు. అమెరికా ట్రెజరర్ బ్రాండెన్ బీచ్ కూడా ఈ కొత్త విధానానికి మద్దతు పలికారు. ట్రంప్ ఈ గౌరవానికి పూర్తిగా అర్హులని పేర్కొన్నారు.
ఇక అమెరికా స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని త్వరలో ట్రంప్ చిత్రం ఉన్న 24 క్యారెట్ల బంగారు నాణేన్ని కూడా విడుదల చేయనున్నారు. ఈ ప్రతిపాదనకు గత నెలలోనే ఫెడరల్ ఆర్ట్స్ కమిషన్ ఆమోదముద్ర వేసింది.
ఇవి కూడా చదవండి:
ఇరాన్‌పై మరో 10 రోజులపాటు దాడులకు బ్రేక్: ట్రంప్
ప్రీతి జింటా నాకు సారీ చెప్పింది: ఆర్సీబీ ప్లేయర్