Share News

ఇరాన్‌పై మరో 10 రోజులపాటు దాడులకు బ్రేక్‌: ట్రంప్

ABN , Publish Date - Mar 27 , 2026 | 07:36 AM

'వాళ్లు.. 7 రోజులు అడిగితే, నేను 10 రోజులు ఇచ్చా' ఇరాన్‌పై దాడుల నిలిపివేతపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై దాడులు మరో 10 రోజులపాటు ఉండవని చెప్పారు. ఇరాన్‌ ప్రభుత్వ కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పుకొచ్చారు.

ఇరాన్‌పై మరో 10 రోజులపాటు దాడులకు బ్రేక్‌: ట్రంప్
Donald Trump Iran strikes delay

వాషింగ్టన్ DC, మార్చి 27: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దౌత్యపరమైన వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. ఇరాన్ ఇంధన, విద్యుత్ కేంద్రాలపై జరుపుతామన్న క్షిపణి దాడులను మరో 10 రోజుల పాటు (ఏప్రిల్ 6 వరకు) నిలిపివేస్తున్నట్లు ఆయన తాజాగా ప్రకటించారు.

ఇరాన్ ప్రభుత్వం తమ ప్రతినిధుల ద్వారా దాడుల నిలిపివేతకు మరికొంత సమయం కావాలని కోరినట్లు ట్రంప్ వెల్లడించారు. 'వారు నన్ను చాలా మర్యాదగా 7 రోజులు సమయం అడిగారు, కానీ నేను వారికి 10 రోజులు ఇచ్చాను' అని ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ పేర్కొన్నారు.

ఇరాన్ ప్రభుత్వం చర్చలకు సానుకూలంగా స్పందిస్తూ, అంతకుముందు నిలిపివేసిన 8 చమురు ట్యాంకర్లను స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ (Strait of Hormuz) గుండా ప్రయాణించేందుకు అనుమతించిందని, దానిని గౌరవిస్తూనే ఈ అదనపు సమయాన్ని ఇచ్చినట్లు ట్రంప్ వివరించారు.


ప్రస్తుతం ఇరాన్‌తో జరుగుతున్న చర్చలు 'చాలా బాగున్నాయని, ఉత్పాదకతతో కూడి ఉన్నాయని' ట్రంప్ తన ట్రూత్ సోషల్ (Truth Social) వేదికగా తెలిపారు. తప్పుడు వార్తలు ప్రచారం చేసే మీడియా మాటలను నమ్మవద్దని ఆయన ప్రజలను కోరారు.

డెడ్ లైన్ పొడిగింపు

నిజానికి గత శనివారం ఇరాన్‌కు 48 గంటల గడువు ఇచ్చిన ట్రంప్, మొదట దానిని సోమవారం నాడు 5 రోజులకు (శుక్రవారం వరకు) పొడిగించారు. ఇప్పుడు తాజాగా ఆ గడువును ఏప్రిల్ 6, రాత్రి 8 గంటల వరకు (అమెరికా కాలమానం ప్రకారం) పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ ఈ లోపు ఇరాన్ శాంతి చర్చలకు పూర్తిగా అంగీకరించకపోతే, వారి అతిపెద్ద విద్యుత్ కేంద్రాలను నేలమట్టం చేస్తానని ఆయన హెచ్చరించారు. ఇదిలాఉంటే, అమెరికా కేవలం ఇంధన వనరులపై దాడులను మాత్రమే నిలిపివేసింది.. సైనిక స్థావరాలు, క్షిపణి కేంద్రాలపై ఇతర దాడులు కొనసాగుతాయని పెంటగాన్ వర్గాలు సూచిస్తున్నాయి.


ఇవి కూడా చదవండి:

ప్రీతి జింటా నాకు సారీ చెప్పింది: ఆర్సీబీ ప్లేయర్

PL 2026 : రెండో ద‌శ‌ షెడ్యూల్ వ‌చ్చేసింది..

Updated Date - Mar 27 , 2026 | 08:32 AM