టీవీ షో వ్యాఖ్యాతను ఎత్తి చెత్తబుట్టలో వేసి.. ట్రంప్ మరో వీడియో వైరల్
ABN , Publish Date - May 23 , 2026 | 08:42 AM
అమెరికాలో తనను విమర్శించే ప్రముఖ టీవీ షో ది లేట్ షోకు శాశ్వతంగా ముగింపుపడ్డ నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో ఏఐ వీడియోను షేర్ చేశారు. ఇది ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
ఇంటర్న్ డెస్క్: అమెరికాలో ప్రముఖ టీవీ షో ‘ది లేట్ షో’ చివరి ఎపిసోడ్ ఇటీవలే ప్రసారమైంది. షో వ్యాఖ్యాత స్టీఫెన్ కోల్బేర్, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య వివాదం నేపథ్యంలో గతేడాదే సీబీఎస్ నెట్‌వర్క్ ఈ షోను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ట్రంప్ మరోసారి ఎక్స్ వేదికగా ఒక ఏఐ వీడియోను షేర్ చేశారు. వీడియోలో ట్రంప్ స్టీఫెన్ కోల్బేర్‌ను ఎత్తి చెత్తబుట్టలో పడేసినట్టు, ఆపై డ్యాన్స్ చేసినట్టు కనిపించింది. దీంతో, ఈ వీడియోకు నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వచ్చింది.
ట్రంప్ మద్దతుదారులు ఈ వీడియోకు బ్రహ్మరథం పట్టారు. ట్రంప్ తన ప్రత్యర్థులపై ప్రతీకారం తీర్చుకునే తీరు విలక్షణంగా ఉంటుందని అన్నారు. ట్రంప్ వ్యతిరేకులు మాత్రం మండిపడుతున్నారు. ప్రజస్వామ్యంలో విమర్శకుల నోళ్లు నొక్కడం, సంబరాలు చేసుకోవడం పద్ధతి కాదని మండిపడుతున్నారు. గతేడాది స్టీఫెన్ కోల్బేర్ తొలగింపు ప్రకటన వెలువడిన తరువాత ట్రంప్ ఇదే స్థాయిలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘అతడి జాబ్ పోవడం నాకు నచ్చింది. అతడికి అసలు టాలెంటే లేదు’ అంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.
ట్రంప్ విధానాలను తీవ్ర స్థాయిలో విమర్శించే టీవీ షో వ్యాఖ్యాతల్లో కోల్బేర్ ముందువరుసలో ఉండేవారు. అయితే, మునుపటి యూఎస్ ఎన్నికల ముందు సీబీఎస్‌లో ప్రసారమైన కమలా హ్యారిస్ ఇంటర్వ్యూపై ట్రంప్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టుకెక్కారు. ఇంటర్వ్యూ ప్రజలను పక్కదారి పట్టించేదిగా ఉందని ఆరోపించారు. ఆ సమయంలో సీబీఎస్ మాతృసంస్థ పారామౌంట్ మరో మీడియా సంస్థ స్కైడ్యాన్స్‌తో విలీనంపై చర్చలు జరుపుతోంది. ఈ క్రమంలో చివరకు సీబీఎస్ ఛానల్ ట్రంప్‌తో రాజీ కుదుర్చుకుంది. స్టీఫెన్ షోను క్యాన్సిల్ చేస్తున్నట్టు పారామౌంట్ ప్రకటించింది. 2026లో చివరి ఎపిసోడ్‌తో షోకు ఫుల్ స్టాప్ పెడతామని అప్పట్లో ప్రకటించింది. ఇది అమెరికాలో పెను కలకలానికి దారితీసింది. ట్రంప్‌తో రాజీ ఒప్పందంలో భాగంగా షో రద్దైనట్టు స్వీఫెన్ మద్దతుదారులు అప్పట్లో ఆరోపణలు గుప్పించారు.
ఈ వార్తలనూ చదవండి:
గ్రీన్‌కార్డు కోసం వేచి చూస్తున్నారా?..అమెరికాను వీడండి
యూఎస్, ఇరాన్ మధ్య కుదిరిన సంధి.. ముగిసిన యుద్ధం?