Share News

కుదిరిన సంధి.. ముగిసిన యుద్ధం?

ABN , Publish Date - May 23 , 2026 | 04:29 AM

ప్రపంచాన్ని సంక్షోభం అంచున నిలిపిన అమెరికా-ఇరాన్‌ యుద్ధానికి ఎట్టకేలకు ముగింపు లభించినట్లు తెలుస్తోంది. సుదీర్ఘకాలంపాటు కొనసాగిన చర్చల అనంతరం రెండు దేశాలు శాశ్వత శాంతి ఒప్పందానికి వచ్చినట్లు సౌదీ అరేబియా ....

కుదిరిన సంధి.. ముగిసిన యుద్ధం?

  • అమెరికా- ఇరాన్‌ మధ్య కుదిరిన శాంతి ఒప్పందం

  • మిలిటరీ దాడులను పూర్తిగా నిలిపివేసేందుకు అంగీకారం

  • డీల్‌లో లేని ఇరాన్‌ యురేనియం, అమెరికా ఆంక్షల ప్రస్తావన

  • సౌదీ మీడియా వెల్లడి.. అధికారికంగా వెలువడని ప్రకటన

  • శుక్రవారం హుటాహుటిన టెహ్రాన్‌కు పాక్‌ ఆర్మీ చీఫ్‌ మునీర్‌

వాషింగ్టన్‌ /టెహ్రాన్‌, మే 22: ప్రపంచాన్ని సంక్షోభం అంచున నిలిపిన అమెరికా-ఇరాన్‌ యుద్ధానికి ఎట్టకేలకు ముగింపు లభించినట్లు తెలుస్తోంది. సుదీర్ఘకాలంపాటు కొనసాగిన చర్చల అనంతరం రెండు దేశాలు శాశ్వత శాంతి ఒప్పందానికి వచ్చినట్లు సౌదీ అరేబియా మీడియా సంస్థ అల్‌ హదత్‌ శుక్రవారం వెల్లడించింది. అయితే, శాంతి సంధిపై అటు అమెరికా నుంచి కానీ, ఇటు ఇరాన్‌ నుంచి కానీ.. మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్థాన్‌ నుంచి కానీ అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇంతకాలం చర్చల్లో ప్రతిష్ఠంభనకు కారణమైన ఇరాన్‌ అణుకార్యక్రమం, అమెరికా ఆంక్షల ప్రస్తావన లేకుండానే తుది ఒప్పందం కుదిరినట్లు అల్‌ హదత్‌ పేర్కొంది. శాంతి ఒప్పంద తుది ముసాయిదా ఖరారైందన్న వార్తల నేపథ్యంలో పాకిస్థాన్‌ సైన్యాధ్యక్షుడు అసిమ్‌ మునీర్‌ శుక్రవారం రాత్రి హుటాహుటిన ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌ చేరుకున్నారు. పాక్‌ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి మొహసిన్‌ నఖ్వీ కొద్దిరోజులుగా ఇరాన్‌లోనే మకాం వేశారు. వీరు ఇరాన్‌ అగ్రనాయకులతో పలు దఫాలుగా చర్చలు జరిపారు. ఇరాన్‌ అణ్వాయుధాలు తయారుచేస్తోందని ఆరోపిస్తూ అమెరికా, ఇజ్రాయెల్‌లు సంయుక్తంగా ఫిబ్రవరి 28న ఇరాన్‌పై సైనిక చర్య ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆ రెండు దేశాలు ఇరాన్‌పై భీకర వైమానిక దాడులు చేశాయి. ఇరాన్‌ కూడా తీవ్రంగా ఎదురుదాడి చేసింది. పశ్చిమాసియాలోని అమెరికా మిత్రదేశాలైన సౌదీ అరేబియా, ఖతర్‌, యూఏఈలతోపాటు ఇజ్రాయెల్‌పై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఏప్రిల్‌ 8న అమెరికా-ఇరాన్‌ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదరటంతో యుద్ధం తాత్కాలికంగా ఆగిపోయింది. అప్పటి నుంచి పాక్‌ మధ్యవర్తిత్వంలో చర్చలు జరుగుతున్నాయి. ఇస్లామాబాద్‌లో ముఖాముఖి జరిగిన చర్చలు విఫలమైన తర్వాత.. పలు దఫాలుగా పరోక్ష చర్చలు జరిగాయి.


ఒప్పందంలోని అంశాలు

  • ఇరు దేశాలపై మిలిటరీలపై, పౌరులపై, ఆర్థిక మౌలిక వసతులపై దాడులు చేసుకోకూడదు.

  • అన్నిరకాల సైనిక చర్యలను వెంటనే నిలిపివేయాలి. మీడియా దుష్ప్రచారానికి కూడా అడ్డుకట్ట వేయాలి.

  • ఇరు దేశాలు ఎదుటి దేశ సార్వభౌమాధికారం, అంతర్గత సమగ్రతను గౌరవించాలి. ఒకదేశం మరో దేశ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోకూడదు.

  • పర్షియన్‌ గల్ఫ్‌, హోర్ముజ్‌ జలసంధి, ఒమన్‌ గల్ఫ్‌లో స్వేచ్ఛాయుత నౌకారవాణాకు హామీ ఇవ్వాలి.

  • వివాదాల పరిష్కారానికి సంయుక్త వ్యవస్థను ఏర్పాటు చేయాలి.

  • అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ఏడురోజుల్లో చర్చలు ప్రారంభించాలి.

  • ఈ ఒప్పందంలోని అంశాలకు ఇరాన్‌ ఏమేరకు కట్టుబడి ఉంటుందన్నదానిపై ఆధారపడి.. ఆ దేశంపై అమెరికా క్రమంగా ఆర్థిక ఆంక్షలను ఎత్తివేస్తుంది.

Updated Date - May 23 , 2026 | 04:29 AM