నెతన్యాహు తీరుతో ట్రంప్‌కు షాక్! నీకేమైనా మెంటలా అంటూ..
ABN , Publish Date - Jun 03 , 2026 | 08:49 PM
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో ఫోన్ కాల్ సందర్భంగా కాస్త ఆందోళన చెంది, మాట తూలానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంగీకరించారు. అయితే, నెతన్యాహు తనకు మంచి మిత్రుడని కూడా అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో ఫోన్ సంభాషణ సందర్భంగా కాస్త ఆందోళనకు గురై మాట తూలానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం పేర్కొన్నారు. నీకేమైనా మెంటలా అని నెతన్యాహుతో కాస్త గట్టిగా మాట్లాడినట్టు చెప్పారు. ఒక అంతర్జాతీయ మీడియా సంస్థ పాడ్‌కాస్ట్‌లో ఈ వివరాలను వెల్లడించారు.
‘అవును నిజమే.. కానీ అది కోపంతో మాత్రం కాదు. నెతన్యాహు నిత్యం లెబనాన్‌పై దాడులను చేయడం నాలో కాస్త ఆందోళనను పెంచింది. దీంతో..బీబీ (నెతన్యాహు) నువ్వు ఇక ఆగాలి. మనం దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి’ అని అన్నా’ అని ట్రంప్ చెప్పుకొచ్చారు. తామిద్దరం ఐకమత్యంగా ఎంతో సాధించామని, బీబీ అంటే తనకు ఎంతో ఇష్టమని కూడా ట్రంప్ చెప్పుకొచ్చారు. అయితే, ఇజ్రాయెలీ మీడియా మాత్రం ఈ కథనాన్ని కొట్టిపారేసింది.
ఇక యాక్సియోస్ మీడియా కథనం ప్రకారం, ‘నువ్వు జైలు పాలు కాకుండా కాపాడింది నేనే’ అని కూడా ట్రంప్ నెతన్యాహుతో అన్నారు. ‘నీకు మతి చెలించినట్టు ఉంది. నేను జోక్యం చేసుకోకపోయి ఉంటే నువ్వు ఈపాటికి జైలు పాలై ఉండేవాడివేమో. నిన్ను కాపాడింది నేనే. నిన్ను అందరూ ద్వేషిస్తున్నారు. నీ వల్ల ఇజ్రాయెల్ అంటే జనాలకు కోపం పెరిగింది’ అని ట్రంప్ అన్నట్టు యాక్సియోస్ పేర్కొంది. ఇరాన్ మద్దతున్న మిలిటెంట్ సంస్థ హెజ్‌బొల్లాను టార్గెట్ చేస్తున్న నెతన్యాహు పరిస్థితిని అంతకంతకూ దిగజారుస్తున్నారని ట్రంప్ భావిస్తున్నట్టు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వెలువడ్డాయి.
ఇక నెతన్యాహుతో పాటు తాను హెజ్‌బొల్లా ప్రతినిధులతో కూడా మాట్లాడానని ట్రంప్ తెలిపారు. ఇజ్రాయెల్, వారి సైన్యంపై కాల్పులను కట్టిపెడతామని వారు తనతో అన్నారని ట్రంప్ చెప్పారు.
ఈ వార్తలనూ చదవండి:
12.5 శాతం సుంకం తప్పదన్న ట్రంప్.. స్పందించిన భారత్
పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు.. చమురు ధరలకు రెక్కలు!