12.5 శాతం సుంకం తప్పదన్న ట్రంప్.. స్పందించిన భారత్
ABN , Publish Date - Jun 03 , 2026 | 04:44 PM
కొన్ని దేశాల ఉత్పత్తులపై మరోసారి 12.5 సుంకం విధించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రతిపాదనపై భారత్ స్పందించింది. అమెరికాతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని చెప్పింది. ప్రతిపాదిత సుంకాల పరిధిలోకి కొన్ని వస్తువులు రావని కూడా చెప్పింది.
ఇంటర్నెట్ డెస్క్: సుంకాల విధింపుపై వెనక్కు తగ్గని డొనాల్డ్ ట్రంప్ మరో కొత్త అస్త్రాన్ని తెరపైకి తెచ్చారు. ఈసారి యూఎస్ ట్రేడ్ యాక్ట్ -1974 సెక్షన్ 301ను ప్రయోగించారు. కార్మికుల వెట్టి చాకిరీతో ఉత్పత్తి చేసే వస్తువుల దిగుమతులను అడ్డుకునే నిబంధనలను సరిగా అమలు చేయని దేశాలపై 12.5 శాతం సుంకాన్ని విధించాలని ప్రతిపాదించారు. ఈ నిబంధనలు సరిగా లేని 60 దేశాల (భారత్ సహా) నుంచి అమెరికాకు దిగుమతయ్యే వస్తువులపై 12.5 శాతం సుంకం విధిస్తామని చెప్పారు. ఈ పరిణామంపై భారత్ తాజాగా స్పందించింది. అమెరికాతో చర్చలు జరుపుతున్నామని చెప్పింది.
సుంకాలతో పాటు ఇతర అంశాలపై చర్చలు కొనసాగుతున్నాయని భారత్ పేర్కొంది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందానికి సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నాయని చెప్పింది. ఈ మేరకు వాణిజ్య శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఫిబ్రవరి 7 నాటి సంయుక్త ప్రకటన ప్రకారం ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయని చెప్పింది.
ప్రభుత్వ వర్గాల ప్రకారం, సెక్షన్ 301 సుంకానికి సంబంధించి అమెరికా వాణిజ్య ప్రతినిధి ఇప్పటికే పలు దేశాల పరిస్థితులను పరిశీలించారు. అయితే, ఈ సెక్షన్ పరిధిలోని కొన్ని భారత ఉత్పత్తులపై ఇప్పటికే అమెరికా మరో చట్టంలోని సెక్షన్ 232 కింద సుంకం విధిస్తోంది. దీంతో, వీటిపై మరోసారి సుంకం విధించే అవకాశం ఉండదు.
ఇక వస్త్ర పరిశ్రమకు సంబంధించి మినహాయింపుల కోసం మరో వ్యవస్థ ఏర్పాటుపై కూడా చర్చలు జరుగుతున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రతిపాదన ప్రకారం, అమెరికా దిగుమతి చేసుకునే వస్త్రాల్లో కొన్నింటిపై తక్కువ సుంకం విధించే అవకాశం ఉంది. అయితే, ఈ ప్రతిపాదనపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని కూడా ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఈ అంశాలపై సంబంధిత వ్యక్తులు, సంస్థలు తమ అభిప్రాయాలను జూన్ 22 వరకూ అమెరికాతో పంచుకునే అవకాశం ఉంది. అనంతరం అమెరికా వాణిజ్య ప్రతినిధి మరోసారి ఈ అంశాలను పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటారు.
ఈ వార్తలనూ చదవండి:
పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు.. చమురు ధరలకు రెక్కలు!
ఇరాన్‌తో చర్చలు కొనసాగుతున్నాయి: ట్రంప్