ఇరాన్‌యే పరిహారం చెల్లించాలి.. డొనాల్డ్ ట్రంప్
ABN , Publish Date - Aug 11 , 2026 | 09:15 AM
యుద్ధంతో నష్టం జరిగినందుకు తమకు పరిహారం చెల్లించాలన్న ఇరాన్ డిమాండ్‌ను యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తోసిపుచ్చారు
ఇంటర్నెట్ డెస్క్: యుద్ధంతో నష్టం జరిగినందుకు తమకు పరిహారం చెల్లించాలన్న ఇరాన్ డిమాండ్‌ను యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తోసిపుచ్చారు. ఇరాన్‌యే పరిహారం చెల్లించాలని అన్నారు. ఇరాన్ దాడుల్లో వేల మంది మరణించారని ఆయన అన్నారు.
‘ఇరాన్ ఐడియా ఆసక్తికరంగా ఉంది. కాబట్టి, ఇరాన్ కూడా పరిహారం చెల్లించాల్సిందే. వాళ్ల దాడుల్లో ఎంతో మంది చనిపోయారు. తీవ్రగాయాలపాలయ్యారు. రోడ్ సైడ్ బాంబులు, ఇతర వివాదాలకు ఇరాన్ వాళ్లు చాలా ఫేమస్. జనరల్ సులేమానీ నాయకత్వంలో అనేక దారుణాలు జరిగాయి. యూఎస్ఎస్ కోల్ యుద్ధనౌకపై దాడి సహా పలు సందర్భాల్లో అనేక మంది చనిపోయారు. మరణాలు వేల సంఖ్యలోనే ఉన్నాయి. గత 50 ఏళ్లుగా ఇరాన్ దాడులు చేస్తూనే ఉంది. గత ఐదు నెలల్లోనే 52 వేల మంది కన్నుమూశారు. కాబట్టి, భవిష్యత్తులో జరిగే చర్చల్లో ఇరాన్ చెల్లించాల్సిన పరిహారం కూడా ఒక భాగం కావాలి’ అని ట్రంప్ అన్నారు.
ఇక హోర్ముజ్‌ను తెరిచేందుకు ఇరాన్ ఇప్పటికే పలు డిమాండ్ యూఎస్ ముందుంచిన విషయం తెలిసిందే. యుద్ధం వల్ల తమకు జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకు 300 బిలియన్ డాలర్లు కోరినట్టు సమాచారం. దీంతో, పాటు విదేశాల్లోని 100 బిలియన్ డాలర్ల నిధులను కూడా విడుదల చేయాలని ఇరాన్ కోరింది. అమెరికా తమ డిమాండ్స్‌ను అంగీకరించే వరకూ హోర్ముజ్ మూసే ఉంటుందని ఇరాన్ సైనిక దళం ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ ఆదివారం ఒక ప్రటకనలో తెలిపింది. లేని పక్షంలో హోర్ముజ్ యుద్ధ క్షేత్రంగా కొనసాగుతుందని స్పష్టం చేసింది. అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైన విషయం తెలిసిందే.
ఈ వార్తలనూ చదవండి:
హెచ్1బీ, ఎల్1 వీసా పొడిగింపు దరఖాస్తులకూ 9-11 ఫీజు బాదుడు