హెచ్1బీ, ఎల్1 వీసా పొడిగింపు దరఖాస్తులకూ 9-11 ఫీజు బాదుడు
ABN , Publish Date - Aug 11 , 2026 | 05:14 AM
హెచ్-1బీ, ఎల్-1 వీసాలపై మరో బాదుడుకు ట్రంప్ సర్కారు సిద్ధమైంది. ప్రస్తుతం ఆ రెండు రకాల వీసాలకూ మొదటిసారి దరఖాస్తు చేసుకున్నప్పుడు లేదా దరఖాస్తుదారులు...
హెచ్-1బీ పొడిగింపు దరఖాస్తుకు 4 వేల డాలర్లు
ఎల్-1 వీసా పొడిగింపు దరఖాస్తుకు 4500 డాలర్లు
ప్రస్తుత నిబంధనల ప్రకారం తొలిసారి దరఖాస్తు
చేసుకున్నప్పుడు, ఉద్యోగం మారినప్పుడే 9-11 ఫీజు
ఇకపై పొడిగింపునకు దరఖాస్తు చేసిన ప్రతిసారీ..
ఉద్యోగుల తరఫున సంస్థలు ఆ ఫీజు కట్టాల్సిందే
వాషింగ్టన్, ఆగస్టు 10: హెచ్-1బీ, ఎల్-1 వీసాలపై మరో బాదుడుకు ట్రంప్ సర్కారు సిద్ధమైంది. ప్రస్తుతం ఆ రెండు రకాల వీసాలకూ మొదటిసారి దరఖాస్తు చేసుకున్నప్పుడు లేదా దరఖాస్తుదారులు ఉద్యోగం మారినప్పుడు మాత్రమే విధిస్తున్న ‘9-11 రెస్పాన్స్ అండ్ బయోమెట్రిక్ ఎంట్రీ-ఎగ్జిట్ ఫీజు’ను.. ఆ వీసాల పొడిగింపు సమయంలో కూడా చెల్లించడాన్ని తప్పనిసరి చేస్తూ నిబంధనలను మార్చింది. కొత్త నిబంధనలు 2026 సెప్టెంబరు 9 నుంచి అమల్లోకి రానున్నాయి. వాటి ప్రకారం.. ‘హెచ్-1బీ పొడిగింపు పిటిషన్‌కు 4వేల డాలర్లు (దాదాపు రూ.3.81 లక్షలు), ఎల్-1 పొడిగింపు పిటిషన్‌కు 4500 డాలర్లు (దాదాపు రూ.4.3 లక్షలు) చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫీజును ఆయా దరఖాస్తుదారుల తరఫున.. వారికి ఉద్యోగాలిచ్చిన సంస్థల యాజమాన్యాలే చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఈ పీజు అన్ని కంపెనీలకూ వర్తించదు. 50 లేదా అంతకంటే ఎక్కువమంది ఉద్యోగులు ఉండి.. అందులోని ఉద్యోగుల్లో 50ు లేదా అంతకంటే ఎక్కువ మంది హెచ్-1బీ (లేదా) ఎల్-1 వీసాలపై పనిచేస్తుండాలి. అలాంటి పెద్ద కంపెనీలకు మాత్రమే ఈ కొత్త నిబంధన వర్తిస్తుంది. దీంతో.. టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ వంటి భారతీయ ఐటీ దిగ్గజాలపై ఏటా మిలియన్ డాలర్ల అదనపు భారం పడనుంది. ఈ నిబంధన ద్వారా ప్రభుత్వ ఖజానాకు ఏటా 157.3 మిలియన్ డాలర్ల ఆదాయం సమకూరుతుందని అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ తెలిపింది. అంటే మన కరెన్సీలో దాదాపుగా రూ.1500 కోట్లకు పైమాటే. ఈ మొత్తాన్ని.. అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ నిర్వహించే ‘ఎయిర్ అండ్ సీ బయోమెట్రిక్ ఎంట్రీ-ఎగ్జిట్ సిస్టమ్’ కోసం వినియోగిస్తారు.
ఇవి కూడా చదవండి:
ఫిట్‌నెస్ కోసం 17 కిలోలు తగ్గాడు.. సర్ఫరాజ్ ఖాన్ ఈసారైనా నిరూపించుకుంటాడా?
2027 వన్డే ప్రపంచకప్.. జట్టులో చేరేందుకు సిద్ధంగా ఉన్నా: భువనేశ్వర్ కుమార్