మాకు ఎవరితోనూ అవసరం లేదు.. ట్రంప్ ఫైర్
ABN , Publish Date - Mar 17 , 2026 | 12:13 PM
ఇరాన్ విషయంలో నాటో దేశాలు స్పందించకపోవడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అమెరికాకు ఎవరితోనూ అవసరం లేదని అన్నారు. తమ మిలిటరీ చాలా శక్తిమంతమైనదని అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: హోర్ముజ్ జలసంధిలో ముడి చమురు రవాణాకు రక్షణగా యుద్ధ నౌకలను పంపించాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అభ్యర్థనను పలు దేశాలు తిరస్కరించాయి. ఈ నేపథ్యంలో మంగళవారం మీడియా సమావేశంలో ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇరాన్ విషయంలో తమకు ఎవరి సాయం అవసరం లేదని అన్నారు. ‘మాకు ఎవరి అవసరమూ లేదు. అమెరికా శక్తిమంతమైన దేశం. మా మిలిటరీ ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైనది’ అని వ్యాఖ్యానించారు.
యుద్ధ నౌకలను పంపించాలన్న ట్రంప్ అభ్యర్థనపై నాటో దేశాలు ఆచితూచి స్పందించిన విషయం తెలిసిందే. యుద్ధ నౌకలను పంపే విషయమై చర్చలు జరుగుతున్నాయని యూకే పేర్కొంది. జపాన్ కూడా దాదాపుగా ఇదే ప్రకటన చేసింది. తమకు యుద్ధ నౌకలను పంపే యోచనే లేదని ఆస్ట్రేలియా స్పష్టం చేసింది. అసలు తమను ఈ విషయమై ఎవరూ సంప్రదించలేదని కూడా ఆస్ట్రేలియా కేబినెట్ మంత్రి కేథరిన్ కింగ్ పేర్కొన్నారు.
ఇక ట్రంప్ అభ్యర్థనను జర్మనీ నిర్ద్వంద్వంగా తోసి పుచ్చింది. యుద్ధం ప్రారంభించే ముందు అమెరికా గానీ ఇజ్రాయెల్ గానీ తమను సంప్రదించలేదని జర్మనీ ఛాన్సలర్ ఫ్రీడ్రిక్ మెర్జ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమకు కొన్ని చట్టపరమైన పరిమితులు ఉన్నాయని చెప్పారు. ఐక్యరాజ్య సమితి, ఐరోపా సమాఖ్య, నాటో నుంచి తమకు అనుమతులు లేవని చెప్పారు.
ఇరాన్ విషయంలో నాటో దేశాల నుంచి తాను ఆశించిన స్పందన లేకపోవడంతో ట్రంప్ గతంలోనూ అసంతృప్తి వ్యక్తం చేశారు. కూటమిలో భాగమైనా కూడా వారు అమెరికాకు సాయం చేసేందుకు ముందుకు రావట్లేదని అన్నారు. సమిష్టి రక్షణ బాధ్యతను పట్టించుకోవట్లేదని విమర్శించారు. హోర్ముజ్ జలసంధిని పట్టించుకోకపోతే నాటో దేశాల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని కూడా హెచ్చరించారు.
ఈ వార్తలూ చదవండి:
నేను ఏమైనా చేయగలను! క్యూబాపై ట్రంప్ సంచలన వ్యాఖ్య
పాకిస్థాన్ వైమానిక దాడి.. 400 మంది మృతి..