Share News

నేను ఏమైనా చేయగలను! క్యూబాపై ట్రంప్ సంచలన వ్యాఖ్య

ABN , Publish Date - Mar 17 , 2026 | 09:26 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. క్యూబా విషయంలో తాను ఏమైనా చేయగలనని తాజా మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు.

నేను ఏమైనా చేయగలను! క్యూబాపై ట్రంప్ సంచలన వ్యాఖ్య

ఇంటర్నెట్ డెస్క్: వెనెజువెలా వ్యవహారాలను తన కంట్రోల్‌లో పెట్టుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం ఇరాన్‌పై మిలిటరీ చర్యతో బిజీగా ఉన్నారు. ఈ వ్యవహారం ఓ కొలిక్కి రాకమునుపే ట్రంప్ క్యూబాపై మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. క్యూబాను కూడా తన ఆధీనంలోకి తెచ్చుకునే అవకాశం ఉందని అన్నారు.

‘క్యూబాను ఆధీనంలోకి తెచ్చుకునే గౌరవం నాకే దక్కవచ్చు’ అని ట్రంప్ తాజా మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలకు అర్థం ఏమిటని విలేకరులు ప్రశ్నించారు. ‘అంటే.. క్యూబాకు నేను స్వేచ్ఛ కల్పించగలను.. లేదంటే నా ఆధీనంలోకి తీసుకోగలను. ఆ మాటకొస్తే నేను ఏదైనా చేయగలను’ అని చెప్పుకొచ్చారు.

అమెరికా ఆంక్షల కారణంగా ప్రస్తుతం క్యూబా ప్రజలు ఇక్కట్ల పాలవుతున్నారు. సోమవారం అక్కడ విద్యుత్ ఉత్పత్తి తగినంత లేక గ్రిడ్ కుప్పకూలడంతో అనేక ప్రాంతాలు అంధకారంలో కూరుకుపోయాయి. విద్యుత్ ఉత్పత్తికి కావాల్సిన ఇంధనం లేక క్యూబా కొంతకాలంగా ఇబ్బందులు పడుతోంది. గత మూడు నెలల్లో సముద్రమార్గం మీదుగా తమకు ఎలాంటి ఇంధన సరఫరా జరగలేదని క్యూబా ప్రభుత్వం ఇటీవల పేర్కొంది. అమెరికా ప్రభుత్వ ఆంక్షలే ఇందుకు కారణమని తెలిపింది.


క్యూబాపై పట్టు కోసం అమెరికా ఆర్థిక ఆంక్షలను విధించిన విషయం తెలిసిందే. అక్కడ 67 ఏళ్లుగా అధికారంలో ఉన్న పార్టీకి చెక్ పెట్టాలని అమెరికా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ఏడాది జనవరిలో వెనెజువెలా అధ్యక్షుడు మదురోను అదుపులోకి తీసుకున్నాక ట్రంప్ ప్రభుత్వం క్యూబాపై దృష్టి పెట్టింది. క్యూబాలోకి ముడి చమురు నౌకలు రాకుండా ఆంక్షలు విధించింది. క్యూబా నుంచి అసాధారణ ముప్పు పొంచి ఉన్నందుకే తాము ఆంక్షలు విధించాల్సి వచ్చిందని ట్రంప్ అప్పట్లో చెప్పుకొచ్చారు. ఈ విషయంలో క్యూబా అమెరికాతో డీల్‌కు సిద్ధంగా ఉందని ఆ తరువాత మరో సందర్భంలో అన్నారు. ఇరాన్ తరువాత క్యూబాపై దృష్టి పెడతామని ఇటీవల చెప్పారు.


ఈ వార్తలూ చదవండి:

పాకిస్థాన్‌ వైమానిక దాడి.. 400 మంది మృతి..

బెంగాల్‌ సీఎస్‌, డీజీపీపై వేటు

Updated Date - Mar 17 , 2026 | 10:11 AM