బెంగాల్ సీఎస్, డీజీపీపై వేటు
ABN , Publish Date - Mar 17 , 2026 | 06:54 AM
అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలై ప్రవర్తనా నియమావళి (ఎన్నికల కోడ్) అమల్లోకి రాగానే కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) పశ్చిమ బెంగాల్ అధికార యంత్రాంగంలో భారీగా మార్పులు చేసింది.
హోం కార్యదర్శి, కోల్‌కతా కమిషనర్ కూడా బదిలీ..అసెంబ్లీ ఎన్నికల వేళ ఈసీ కొరడా
మమత ఆగ్రహం.. విపక్షాల హర్షం
కోల్‌కతా/న్యూఢిల్లీ, మార్చి 16: అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలై ప్రవర్తనా నియమావళి (ఎన్నికల కోడ్) అమల్లోకి రాగానే కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) పశ్చిమ బెంగాల్ అధికార యంత్రాంగంలో భారీగా మార్పులు చేసింది. మొదటగా ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నందినీ చక్రవర్తి, హోం కార్యదర్శి జగదీశ్ ప్రసాద్ మీనాను బదిలీ చేసింది. ఈ మేరకు ఆదివారం రాత్రి పొద్దుపోయాక ఉత్తర్వులు జారీచేసింది. సోమవారం డీజీపీ పీయూష్ పాండే, కోల్‌కతా పోలీసు కమిషనర్ సుప్రతిమ్ సర్కార్, శాంతిభద్రతల అదనపు డీజీ వినీత్ గోయల్‌ను ఆ పదవుల నుంచి తొలగించింది. చక్రవర్తి స్థానంలో కొత్త సీఎస్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి, ఉత్తర బెంగాల్ అభివృద్ధి సంస్థ అదనపు సీఎస్ దుష్యంత్ నరియాలాను, నూతన డీజీపీగా సిద్ధ్‌నాథ్ గుప్తాను నియమించింది. కొత్త హోం కార్యదర్శిగా రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ కార్యదర్శి సంఘమిత్ర ఘోష్, కోల్‌కతా పోలీసు కమిషనర్‌గా అజయ్‌కుమార్ నంద్, శాంతిభద్రతల అదనపు డీజీగా అజయ్ ముకుంద్ రనడే నియమితులయ్యారు. తమ ఉత్తర్వులను తక్షణమే సంపూర్ణంగా అమలు చేయాలని.. కొత్త అధికారులు సోమవారం మధ్యాహ్నం 3 గంటల్లోపే విధుల్లో చేరినట్లు జాయినింగ్ రిపోర్టులను తనకు సమర్పించాలని ఈసీ ఆదేశించింది. బదిలీ వేటు పడిన అధికారులకు.. ఎన్నికల ప్రక్రిమ పూర్తయ్యేవరకు ఎన్నికల సంబంధ పోస్టింగులు ఇవ్వరాదని స్పష్టం చేసినట్లు కమిషన్ కార్యదర్శి సుజీత్‌కుమార్ మిశ్రా వెల్లడించారు. బెంగాల్ ఎన్నికలు ఈ దఫా శాంతియుతంగా, హింసరహితంగా నిర్వహిస్తామని ఆదివారం నాటి విలేకరుల సమావేశంలో ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్ హామీ ఇచ్చారని.. దానికి అనుగుణంగానే డీజీపీ, పోలీసు కమిషనర్‌ను బదిలీచేశారని ఈసీ వర్గాలు తెలిపాయి. ఈ బదిలీలపై బెంగాల్ సీఎం, టీఎంసీ నాయకురాలు మమతా బెనర్జీ మండిపడ్డారు. ఈసీ, బీజేపీ మహిళా వ్యతిరేకులుగా మారాయని ఆరోపించారు.
బీజేపీ ప్రోద్బలంతో కమిషన్ తన అధికారులను తొలగించి.. ప్రతిపక్షం కోరుకున్న వారిని నియమించిందని ధ్వజమెత్తారు. ‘‘సీఎస్‌గా ఉన్న నందినీ చక్రవర్తి బెంగాల్ మహిళ. ఆమెను తొలగించడం ద్వారా మీరు బెంగాలీ వ్యతిరేకులుగా మారారు’’ అని ఈసీ అధికారులపై మమత విరుచుకుపడ్డారు. అయితే ఉన్నతాధికారుల బదిలీలను బీజేపీ, సీపీఎం స్వాగతించాయి. ‘‘టీఎంసీ చెప్పినట్లు నడచుకోలేదని.. హింసను రెచ్చగొట్టిన అధికార పార్టీ కుట్రదారులపై చర్యలు తీసుకున్నందుకు మమత ప్రభుత్వం కొందరు అధికారులను పక్కనపెట్టింది. వారిని ఈసీ తిరిగి తీసుకొచ్చినందుకు సంతోషంగా ఉంది. కీలక బాధ్యతల్లో వారి నియామకంతో ఎన్నికలు నిష్పాక్షికంగా, స్వేచ్ఛగా జరుగుతాయని నమ్ముతున్నాం’’ అని ప్రతిపక్ష నేత సువేందు అధికారి చెప్పారు. ఎన్నికల వేళ అధికారుల బదిలీలు సహజమే అయినా.. రాష్ట్రంలో ప్రస్తుత అధికార యంత్రాంగం ప్రవర్తన నేపథ్యంలో తాజా బదిలీలకు ప్రాధాన్యం ఉందని సీపీఎం పేర్కొంది. ఇదిలా ఉండగా, బెంగాల్లో 2021 అసెంబ్లీ ఎన్నికలు, 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో పోలింగ్ కేంద్రాలకు వెబ్ కెమెరాలను సరఫరా చేసిన ఏజెన్సీ కాంట్రాక్టును ఈసీ రద్దు చేసింది. నాడు ఉపయోగించిన కెమెరాల రికార్డింగ్ ఫుటేజీల పరిశీలనలో తీవ్రమైన అవకతవకల గుర్తించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
మమతతో మళ్లీ సువేందు ఢీ
బెంగాల్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్‌లో సీఎం మమతా బెనర్జీని ఓడించిన బీజేపీ సీనియర్ నేత సువేందు అధికారి ఈసారి కూడా ఆమెపై పోటీకి దిగుతున్నారు. అప్పట్లో ఉప ఎన్నిల్లో ఆమె గెలిచిన భవానీపూర్ నుంచి ఈసారి పోటీచేయనున్నారు. అయితే తన నియోజకవర్గం నందిగ్రామ్‌లోనూ ఆయన బరిలో దిగనున్నారు. 144 మంది అభ్యర్థులతో బీజేపీ సోమవారం తన తొలి జాబితాను ప్రకటించింది. మరోవైపు.. సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ కూడా 192 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించింది. 294 స్థానాల బెంగాల్ అసెంబ్లీకి ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరుగనున్న సంగతి తెలిసిందే. మే 4న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.