వలస డ్రైవర్లను మాజీ సైనికులతో భర్తీ చేస్తాం.. ట్రంప్ కొత్త ప్రతిపాదన
ABN , Publish Date - Jul 17 , 2026 | 08:39 PM
అమెరికాలోకి అక్రమంగా వలస వచ్చి ట్రక్ డ్రైవర్లుగా మారిన వారిని తప్పించి ఆ బాధ్యతలను మాజీ సైనికులకు అప్పగిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రతిపాదించారు.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. దేశంలోకి అక్రమంగా వలస వచ్చి ట్రక్ డ్రైవర్లుగా మారిన వారిని తప్పించి ఆ బాధ్యతలను మాజీ సైనికులకు అప్పగించే అంశాన్ని పరిశీలిస్తున్నామని అన్నారు. దేశంలోకి వలస వచ్చిన అనేక మంది డ్రైవర్లు మద్యం, డ్రగ్స్ మత్తులో తూగుతూ అనేక మంది మరణాలకు కారణమవుతున్నారని ఆరోపించారు. ఈ ప్రతిపాదన కార్యరూపం దాలిస్తే అమెరికాలోని వేల మంది వలసదార్లు చిక్కుల్లో పడే ప్రమాదం ఉందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
‘త్వరలో మా ప్రభుత్వం ఓ చరిత్రాత్మక నిర్ణయం తీసుకోబోతోంది. దేశంలో అక్రమంగా ఉంటూ అనేక మంది ట్రక్ డ్రైవర్లపై చర్యలు తీసుకోబోతున్నాం. వీళ్లల్లో చాలా మంది మద్యం, డ్రగ్స్ మత్తులో తూగుతుంటారు. రోడ్డుపై ఉన్న ట్రాఫిక్ బోర్డులను కూడా వీరు చదవలేరు. వీళ్లు మనకు అవసరం లేదు. కానీ మన రోడ్లపై వీళ్లు ట్రక్‌లతో దూసుకెళుతున్నారు. వీళ్ల స్థానాన్ని మాజీ అమెరికా సైనికులతో భర్తీ చేస్తాము. ఈ దిశగా మాజీ సైనికులకు శిక్షణ ఇస్తాము. ట్రక్ డ్రైవింగ్ నేర్పిస్తాము’ అని ట్రంప్ పేర్కొన్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అమెరికా మిలిటరీ కోసం ట్రక్స్ నడిపిన డ్రైవర్లు అందరూ ఆటోమేటిక్‌గా కమర్షియల్ డ్రైవర్ లైసెన్స్‌కు అర్హత పొందుతారని కూడా ట్రంప్ చెప్పారు.
అమెరికాలో ఇటీవల ట్రక్ డ్రైవింగ్ ఉద్యోగాలపై వలసదారుల్లో ఆసక్తి పెరిగినట్టు తెలుస్తోంది. ఈ రంగంలో అమెరికన్లు తక్కువగా ఉండటంతో పాటు యూఎస్‌కు రాగానే మంచి ఆదాయం కళ్ల చూసే అవకాశం ఉండటంతో అనేక మంది ట్రక్ డ్రైవర్లుగా మారుతున్నట్టు తెలుస్తోంది. అయితే, అక్రమవలసదారులపై ట్రంప్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుండటంతో మార్చిలో వేల సంఖ్యలో విదేశీ ట్రక్ డ్రైవర్లు తమ కమర్షియల్ లైసెన్సులు కోల్పోయారు.
ఈ వార్తలనూ చదవండి:
బుల్లెట్ వేగంతో ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ ప్రాజెక్ట్!
యూఎస్ ఫైటర్ జెట్స్‌ను ధ్వంసం చేశాం: ఇరాన్ సైనిక దళం