Share News

యూఎస్ ఫైటర్ జెట్స్‌ను ధ్వంసం చేశాం: ఇరాన్ సైనిక దళం

ABN , Publish Date - Jul 17 , 2026 | 03:48 PM

జోర్డాన్‌లోని వైమానిక స్థావరంలోగల పలు యూఎస్ యుద్ధ విమానాలను ధ్వంసం చేశామని ఇరాన్‌ సైనిక దళం ఐఆర్‌జీసీ తాజాగా ప్రకటించింది. ఎయిర్ రీఫ్యూలింగ్ విమానాలనూ ధ్వంసం చేశామని పేర్కొంది.

యూఎస్ ఫైటర్ జెట్స్‌ను ధ్వంసం చేశాం: ఇరాన్ సైనిక దళం
Iran Attacks US Fighter Jets in Jordan

ఇంటర్నెట్ డెస్క్: జోర్డాన్‌లోని వైమానిక స్థావరంలోగల పలు అమెరికా యుద్ధ విమానాలను ధ్వంసం చేశామని ఇరాన్‌ సైనిక దళం ఐఆర్‌జీసీ తాజాగా ప్రకటించింది. పలు ఎయిర్ రీఫ్యూలింగ్ విమానాలనూ ధ్వంసం చేశామని పేర్కొంది. ఇరాన్ ప్రయోగించిన పలు మిసైల్స్‌ను మార్గమధ్యంలోనే అడ్డుకున్నామని జోర్డాన్ ప్రకటించిన కాసేపటికే ఐఆర్‌జీసీ ఈ ప్రకటన చేసింది. అమెరికా దాడులకు ప్రతీకారంగా ఈ దాడి చేసినట్టు ఐఆర్‌జీసీ వెల్లడించింది. తమ దాడుల్లో పలు అమెరికన్ విమానాలు దెబ్బతిన్నాయని కూడా ఐఆర్‌జీసీ పేర్కొంది. అంతేకాకుండా, ఇస్లామ్ వ్యతిరేక అమెరికా ప్రయోజనాలను, అమెరికన్ ప్రజలను కూడా టార్గెట్ చేయాలని జోర్డాన్ ప్రజలకు ఐఆర్‌జీసీ పిలుపునిచ్చింది.


సిరియాలోని అల్ టాన్ఫ్‌లోగల యూఎస్ స్పెషల్ ఆపరేషన్స్ కమాండ్‌ సెంటర్‌పై కూడా తాము దాడి చేశామని ఐఆర్‌జీసీ పేర్కొన్నట్టు ఇరాన్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే, ఈ ప్రకటనలపై సిరియన్ ప్రభుత్వం, అమెరికా మిలిటరీ ఇంకా స్పందించలేదు. సిరియా, జోర్డాన్, ఇరాన్ సరిహద్దులోని అల్ టాన్ఫ్ స్థావరాన్ని విడిచివెళ్లిపోయామని యూఎస్ ఫిబ్రవరిలోనే ప్రకటించింది. ఇదిలా ఉంటే గల్ఫ్ దేశాలను అతలాకుతలం చేస్తున్న ఈ యుద్ధం విషయంలో సిరియా అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఈ ఘర్షణలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తోంది. సిరియాకు పొరుగున ఉన్న లెబనాన్‌లోని హెజ్‌బోల్లా మిలిటెంట్ సంస్థ ఇప్పటికే ఇజ్రాయెల్ దళాలతో పోరాడుతోంది. మరోవైపు, ఇరాన్ మద్దతు ఉన్న కొన్ని మిలిటెంట్ గ్రూపులు కూడా ఇరాన్ నుంచి దాడులు చేస్తున్నాయి.


గత నెలలో అమెరికా, ఇరాన్ మధ్య శాంతిస్థాపన కోసం కుదిరిన అవగాహన ఒప్పందం నిలిచిపోవడంతో మళ్లీ పరస్పర దాడులు మొదలైన విషయం తెలిసిందే. హోర్ముజ్‌పై నియంత్రణ కోసం ఇరు దేశాలు ఒకరిపైమరొకరు దాడులు చేసుకుంటున్నాయి. ఇటీవల కాలంలో అమెరికా ఇరాన్‌పై వైమానికదాడులను మరింత ఉధృతం చేసింది. ఇరాన్‌లోని మౌలిక వసతులే టార్గెట్‌గా దాడులను కొనసాగిస్తోంది. ముఖ్యంగా తీరప్రాంత నగరాలు, ద్వీపాలపై అమెరికా దాడులు జరుపుతోంది. అహ్వాజ్, కేషమ్, బుషెహర్, డాస్తీ, బోస్తాన్, సిరిక్, బందర్ ఏ లెంగే వంటి చోట్ల యూఎస్ దాడుల్లో మౌలిక వసతులు దెబ్బతిన్నాయి. హోర్మోజ్గాన్ ప్రావిన్సులో జరిగిన దాడిలో రైల్వే, రోడ్డు రవాణా మౌలికవసతులు దెబ్బతిన్నాయి. ఏడుగురు మరణించారు. ఇరాన్‌షహర్‌లోని ఒక ఎయిర్‌‌పోర్టుపై కూడా దాడి జరిగినట్టు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. యూఎస్ దాడుల్లో డజన్ల కొద్దీ జనాలు మరణించారని, వందల మంది గాయపడ్డారని ఇరాన్ మీడియా పేర్కొంది. శుక్రవారం జరిగిన దాడుల్లో కూడా పలువురు మరణించారని చెప్పింది.


ఈ వార్తలనూ చదవండి:

22 కోట్ల అమెరికా ఓటర్ల వివరాలను చైనా తస్కరించింది: ట్రంప్

ఇరాక్ సంచలన ప్రకటన.. ట్రంప్ హత్యకు 10 మిలియన్ డాలర్ల రివార్డ్!

Updated Date - Jul 17 , 2026 | 04:32 PM