Share News

బాంబులేసి పేల్చి పారేస్తాం.. మిత్రదేశం ఒమన్‌కు ట్రంప్ వార్నింగ్

ABN , Publish Date - Aug 17 , 2026 | 09:29 PM

హోర్ముజ్‌ జలసంధిలో భద్రమైన రవాణా మార్గంపై ఒమన్‌తో అవగాహన కుదిరిందని ఇరాన్ ప్రకటించిన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు.

బాంబులేసి పేల్చి పారేస్తాం.. మిత్రదేశం ఒమన్‌కు ట్రంప్ వార్నింగ్
Trump Warns Oman Over Deal With Iran

ఇంటర్నెట్ డెస్క్: హోర్ముజ్‌ జలసంధిలో భద్రమైన రవాణా మార్గంపై ఒమన్‌తో అవగాహన కుదిరిందని ఇరాన్ ప్రకటించిన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. ఇరాన్ విషయంలో జోక్యం చేసుకునేందుకు ప్రయత్నిస్తే బాంబులేసి పేల్చేస్తామని మిత్రదేశం ఒమన్‌కు గట్టి హెచ్చరికలు చేశారు. ‘ఒమన్ మధ్యలో అడ్డం వస్తే బాంబులేసి పేల్చి పారేస్తాము’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో శాంతి చర్చలకు సంబంధించి 60 రోజుల గడువు ముగిసిన నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, ఇరాన్‌తో డీల్ విషయంలో తనకు ఎలాంటి తొందర లేదని కూడా ట్రంప్ అన్నారు. హోర్ముజ్‌లో విధించిన దిగ్బంధనంతో ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడి అధికంగా ఉందని అన్నారు. హోర్ముజ్‌లో ఇరాన్ పోర్టుల నుంచి నౌకల రాకపోకలు జరగకుండా యూఎస్ నేవీ అడ్డుకుంటున్న విషయం తెలిసిందే.

ఇక ఒమన్‌తో ఒప్పందానికి సంబంధించి ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి పూర్తి వివరాలు వెల్లడించలేదు. జలమార్గం మ్యాపుపై ఏకాభిప్రాయానికి వచ్చినట్టు మాత్రం చెప్పారు. త్వరలో సంయుక్త ప్రకటన చేసేందుకు ఇరు దేశాలు కృషి చేస్తున్నాయని అన్నారు. ఇరాన్‌కు సమీపం నుంచి హార్ముజ్ జలసంధిలోకి ప్రవేశించి ఒమన్‌కు సమీపం నుంచి బయటకు వచ్చేలా మార్గంపై ఇరు దేశాల మధ్య అంగీకారం కుదిరినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.


అమెరికా అభ్యంతరాలకు కారణం ఇదే..

గల్ఫ్ వ్యవహారాల్లో ఒమన్ మొదటి నుంచీ తటస్థ దేశంగా వ్యవహరిస్తోంది. స్వతంత్రమైన సమౌతల్య విధానాన్ని అనుసరిస్తోంది. అమెరికాకు, ఇరాన్‌కు వివాదంలో మధ్యవర్తిగా కూడా కీలక పాత్ర పోషిస్తోంది. ఇక హోర్ముజ్ ఉద్రిక్తతల నేపథ్యంలో హోర్ముజ్‌లో సరకు రాకపోకలు తగ్గిపోయి ఒమన్ ఆర్థికరంగంపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో హోర్ముజ్‌లో రాకపోకల మార్గాన్ని ఖరారు చేసుకునేందుకు ఒమన్ ఇరాన్‌తో నేరుగా చర్చలకు దిగింది.

అయితే, అంతర్జాతీయ జలమార్గమైన హోర్ముజ్ విషయంలో ప్రత్యేక ఒప్పందం కుదర్చుకోవడంపై అమెరికా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ ఒప్పందంతో ఇరాన్‌కు హోర్ముజ్‌పై ప్రత్యేక అధికారం కట్టబెట్టినట్టు అవుతుందని వాదిస్తోంది. కాబట్టి ఈ విషయంలో జోక్యం చేసుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఒమన్‌ను యూఎస్ హెచ్చరిస్తోంది.


ఈ వార్తలనూ చదవండి:

ఇద్దరు భారతీయులకు పాక్ అత్యున్నత పౌర పురస్కారం

ఇండోనేషియాను కుదిపేసిన మరో భూకంపం.. 5.9 తీవ్రతతో భూప్రకంపనలు..

Updated Date - Aug 17 , 2026 | 09:41 PM