Share News

యుద్ధానికి మొదటగా సై అన్నది మీరేగా.. యుద్ధ శాఖ మంత్రిపై ట్రంప్ కీలక కామెంట్స్

ABN , Publish Date - Mar 24 , 2026 | 10:01 AM

ఇరాన్‌పై సైనిక చర్యకు అనుకూలంగా మొదట మాట్లాడింది యుద్ధ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ అని ట్రంప్ తాజాగా చేసిన కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి..

యుద్ధానికి మొదటగా సై అన్నది మీరేగా.. యుద్ధ శాఖ మంత్రిపై ట్రంప్ కీలక కామెంట్స్
Donald Trump Comments on Pete Hegseth

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పశ్చిమాసియాలో దాడులకు తాత్కాలిక విరామం ప్రకటించారు. ఫలితంగా ఉద్రిక్తతలు కాస్తంత తగ్గాయి. అయితే, అమెరికాను మిలిటరీ చర్య దిశగా నడిపిన పరిస్థితులపై మొదటి నుంచీ జనాల్లో అనేక సందేహాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ తాజాగా చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి.

ఇటీవల టెన్నెస్సీ రాష్ట్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో ట్రంప్ పాల్గొన్నారు. ఇరాన్‌పై మిలిటరీ చర్యకు దారి తీసిన పరిస్థితులకు సంబంధించి యుద్ధ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్‌ను ఉద్దేశిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘మిలిటరీ చర్యకు అనుకూలంగా మొదట మాట్లాడింది మీరేగా! ‘వాళ్లకు అణ్వాయుధం దక్కకూడదు.. మనం రంగంలోకి దిగాలి’ అని మీరు కామెంట్ చేశారుగా’’ అని పీట్‌ను ఉద్దేశించి ట్రంప్ అన్నారు.

ఇక మిలిటరీ చర్యకు మునుపు తాను చాలా మందిని సంప్రదించానని కూడా ట్రంప్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ‘నేను పీట్‌తో సంప్రదింపులు జరిపా.. జనరల్ కేన్‌తోనూ మాట్లాడా.. చాలా మందిని సంప్రదించా. మనకు మధ్యప్రాచ్యంలో సమస్య వచ్చింది. అక్కడికి వెళ్లి చెక్ పెట్టాలనుకున్నా’ అని ట్రంప్ అన్నారు. దీంతో, పీట్ పేరును ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం ఏమిటన్న వ్యాఖ్యలు అంతర్జాతీయ మీడియాలో వినిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ కారణంగానే అమెరికా మిలిటరీ చర్యకు పూనుకుందన్న వార్తలు ఇటీవల వైరల్ అయిన విషయం తెలిసిందే.


ఇక గల్ఫ్ దేశాలపై ఇరాన్ ప్రతీకార దాడులు కూడా తమను సర్‌ప్రైజ్ చేశాయని ట్రంప్ ఈ సమావేశంలో చెప్పారు. ‘వాళ్లు ప్రతిదాడికి దిగిన తీరు చూస్తే ఆశ్చర్యంగా అనిపించింది. వారు గల్ఫ్ దేశాలన్నిటిపైనా దాడులు చేశారు. ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించలేదు’ అని ట్రంప్ అన్నారు. అయితే, ఇరాన్ ప్రతీకార దాడులకు దిగవచ్చంటూ నిపుణులు అమెరికా ప్రభుత్వాన్ని ముందే అప్రమత్తం చేశారన్న కథనాలు కూడా అంతర్జాతీయ మీడియాలో వెలువడ్డాయి. పశ్చిమాసియాలో అమెరికా సైనిక చర్య చేపట్టడంపై ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తొలి నుంచీ విముఖత వ్యక్తం చేశారని కూడా ట్రంప్ గతంలో స్వయంగా వెల్లడించారు.


ఈ వార్తలూ చదవండి:

ట్రంప్‌తో చర్చల అనంతరం ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కీలక వ్యాఖ్యలు

ఇరాన్‌కు రష్యా ఇంటెలిజెన్స్ సపోర్ట్.. ఉక్రెయిన్ వద్ద తిరుగులేని ఆధారాలు!

Updated Date - Mar 24 , 2026 | 11:28 AM