ఇరాన్‌ను నాశనం చేశాం
ABN , Publish Date - Mar 16 , 2026 | 03:49 AM
యుద్ధంలో ఇరాన్‌ను పూర్తిగా నాశనం చేశామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. సైనికపరంగా, ఆర్థికంగానే కాక..
అన్ని విధాలుగా ఆ దేశాన్ని ఓడించాం
ఖార్గ్ ద్వీపంపై సరదా కోసం మళ్లీ దాడి చేస్తాం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన
హోర్ముజ్ జలసంధిని వాడే దేశాలు..అక్కడికి తమ యుద్ధ నౌకలను పంపాలని పిలుపు
ఇరాన్‌లోని ఇస్ఫహాన్ నగరంపై వైమానిక దాడులు
గల్ఫ్ దేశాలు, ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణుల వర్షం
పర్షియన్ గల్ఫ్‌లో భారత యుద్ధనౌకలు
వాణిజ్య నౌకల రక్షణకు మోహరింపు
అమెరికా, ఇజ్రాయెల్‌కు తప్ప ‘హోర్ముజ్’ అందరికీ
మొజ్తాబా ఖమేనీ సురక్షితం: అరాగ్చీ
మరో జలసంధి మూసివేత?
ఇరాన్‌కు మద్దతుగా యుద్ధంలోకి హౌతీ గ్రూపు!
బాబ్ ఎల్-మన్‌దెబ్ జలసంధి దిగ్బంధించే యత్నం
అదే జరిగితే.. ప్రపంచ వాణిజ్యానికి విఘాతం
వాషింగ్టన్/దుబాయ్, మార్చి 15: యుద్ధంలో ఇరాన్‌ను పూర్తిగా నాశనం చేశామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. సైనికపరంగా, ఆర్థికంగానే కాక.. అన్ని రకాలుగా ఆ దేశాన్ని ఓడించామని చెప్పారు. ఈ మేరకు ట్రూత్ సోషల్‌లో ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ‘సైనికపరంగా, ఆర్థికంగానే కాక.. అన్ని రకాలుగా ఇరాన్‌ను అమెరికా ఓడించి నాశనం చేసింది. అయితే, తనకు ఉన్న పరిమితమైన వనరులతో హోర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలను అడ్డుకొనేందుకు ఇరాన్ ఇంకా ప్రయత్నిస్తోంది. ఆ జలసంధి ద్వారా చమురు తీసుకెళ్లే దేశాలన్నీ కలిసి.. ఆ మార్గం నౌకా రవాణాకు తెరిచే ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. హోర్ముజ్ ద్వారా చమురు వేగంగా, ఇబ్బంది లేకుండా రవాణా అయ్యేందుకు అమెరికా సహాయం చేస్తుంది. ప్రపంచ శాంతి భద్రతల కోసం అందరం కలిసికట్టుగా ఈ పని చేద్దాం’ అని ట్రంప్ పిలుపునిచ్చారు. హోర్ముజ్ ద్వారా చమురు రవాణా ఆగిపోయి ఇబ్బందులు పడుతున్న దేశాలు.. ఆ మార్గాన్ని తెరిచి ఉంచేందుకు తమ నౌకాదళాలను పంపాలని కోరారు.
సరదా కోసం మళ్లీ దాడి చేస్తాం
ఇరాన్ చమురు నిల్వలకు అత్యంత కీలకమైన ఖార్గ్ ద్వీపంపై సరదా కోసం మరికొన్నిసార్లు దాడి చేసే అవకాశముందని ట్రంప్ తెలిపారు. ఈ ద్వీపంలోని ఇరాన్ సైనిక మౌలిక సదుపాయాలపై వైమానిక దాడులు చేసి ఇప్పటికే ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. కాగా, ఇరాన్‌లో అణు కేంద్రం ఉన్న ఇస్ఫహాన్ నగరంపై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఆదివారం బాంబుల వర్షం కురిపించాయి. నగరంలో చాలాచోట్ల భారీ పేలుళ్లు వినిపించాయి. దట్టమైన పొగ ఆకాశాన్ని కమ్మేసింది. దేశ రాజధాని టెహ్రాన్‌లోని అంతరిక్ష పరిశోధన కేంద్రంపై కూడా దాడి జరిగింది. ఇరాన్‌పై దాడులకు బీ-52 బాంబర్‌ను వినియోగించినట్లు అమెరికా ప్రకటించింది. ఇది దాదాపు 38 టన్నుల బరువైన బాంబులను మోసుకెళ్లగలదు. ఇదిలా ఉండగా ఇటీవల టెహ్రాన్‌లోని చమురు డిపోలను అమెరికా, ఇజ్రాయెల్ పేల్చివేసిన తర్వాత నగరంలోని కొన్ని ప్రాంతాల్లో నల్లని వర్షం కురిసినట్లు స్థానికులు తెలిపారు. దీని కారణంగా తమకు కళ్లు విపరీతంగా మంటలు పుట్టాయని, ఊపిరి తీసుకోవటం కూడా కష్టమైందని చెప్పారు. ఇలాంటి వర్షాలు ప్రజల ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బ తీస్తాయని కార్నెగీ మిలన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ పీటర్ ఆడమ్స్ తెలిపారు.
ఇరాన్ ప్రతీకార దాడులు తీవ్రతరం
ఇజ్రాయెల్‌తోపాటు గల్ఫ్ దేశాలపై ఇరాన్ తన ప్రతీకార దాడులను మరింత తీవ్రం చేసింది. దుబాయ్, కువైట్‌లపై ఆదివారం క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ యుద్ధం ప్రారంభమైన తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)పైనే ఇరాన్ అత్యధికంగా క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. 1,600 డ్రోన్లు, 294 బాలిస్టిక్ క్షిపణులు, 15 క్రూయిజ్ క్షిపణులతో ఆ దేశంపై ఇరాన్ దాడి చేసింది. ఈ దాడుల్లో ఇప్పటివరకు ఆరుగురు చనిపోగా, 141 మంది గాయపడ్డారు. ఆదివారం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం, దుబాయ్‌లోని మరీనా, అల్ సఫా ప్రాంతాలపై డ్రోన్లతో దాడి చేసింది. అటు ఇజ్రాయెల్‌పైనా ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. ఎంతో పటిష్టమైన ఇజ్రాయెల్ గగన రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్‌ను చేధించుకొని కొన్ని క్షిపణులు టెల్ అవీవ్ నగరంలో పడ్డాయి. దీంతో ప్రజలు భయంతో బంకర్లలోకి పరుగులు పెడుతున్న వీడియోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇరాన్ దాడుల్లో ఇప్పటివరకు తమ దేశంలో 12 మంది మరణించినట్లు ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు.
9/11 తరహా దాడులకు ఎప్‌స్టీన్ ముఠా కుట్ర!
అమెరికాలో 2001 సెప్టెంబర్ 11న అల్‌ఖైదా ఉగ్రవాదులు జరిపిన దాడుల తరహాలో మళ్లీ దాడి చేసి, ఆ నేరాన్ని తమపై వేసేందుకు కుట్ర జరిగిందని ఇరాన్ సంచలన ఆరోపణలు చేసింది. అమెరికా లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్‌స్టీన్ ముఠాలోని కొందరు ఈ కుట్ర చేసినట్లు తమకు సమాచారం ఉందని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి అలీ లరిజానీ ఆదివారం ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఇలాంటి ఉగ్రవాద దాడులకు ఇరాన్ పూర్తిగా వ్యతిరేకమని తెలిపారు.
అమెరికా, ఇజ్రాయెల్‌కు తప్ప..‘హోర్ముజ్’ అందరికీ: ఇరాన్
మొజ్తాబా ఖమేనీ సురక్షితం: అరాగ్చీ
అమెరికా, ఇజ్రాయెల్‌కు తప్ప మిగతా అన్ని దేశాల నౌకలకు హోర్ముజ్ జలసంధిలో దారి ఇస్తున్నామని ఇరాన్ విదేశాంగ మంత్రి అరాగ్చీ స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరినప్పటికీ.. పలు నౌకలు హోర్ముజ్ గుండా ప్రయాణిస్తున్నాయని ఆదివారం ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. కొన్ని షిప్పింగ్ కంపెనీలు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్తున్నాయని చెప్పారు. అయితే ఈ జలసంధిని పూర్తిగా తెరిచే ఉద్దేశం తమకు లేదన్నారు. అమెరికా గనుక తమ చమురు రిఫైనరీలపై దాడిచేస్తే పర్షియన్ గల్ప్ ప్రాంతంలోని అన్ని చమురు క్షేత్రాలపైనా దాడిచేస్తామని హెచ్చరించారు. తమ కొత్త సుప్రీం నాయకుడు మొజ్తాబా ఖమేనీ తీవ్రంగా గాయపడ్డారంటూ అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ చేసిన ప్రకటనను అరాగ్చీ ఖండించారు. ఆయన సురక్షితంగా ఉన్నారని చెప్పారు. యుద్ధానికి ముందు అమెరికాతో దౌత్య చర్చల సందర్భంగా తమ వద్ద పలు అణు బాంబుల తయారీకి సరిపడా శుద్ధిచేసిన యురేనియం ఉందని తాను బెదిరించినట్లు వచ్చిన వార్తలను అరాగ్చీ తోసిపుచ్చారు. చర్చల్లో ఎక్కువ రాయితీలు కోరేందుకే ఆ వ్యాఖ్యలు చేశానని అన్నారు.