Share News

ట్రంప్‌పై హత్యాయత్నం!

ABN , Publish Date - Apr 27 , 2026 | 04:32 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పాల్గొన్న వైట్‌హౌస్‌ కరస్పాండెంట్ల విందులో కాల్పులు కలకలం సృష్టించాయి. వాషింగ్టన్‌లో శ్వేతసౌధం సమీపంలోని హిల్టన్‌ హోటల్‌లో ఏటా ఈ విందు ఏర్పాటు చేస్తారు.

ట్రంప్‌పై హత్యాయత్నం!

  • వాషింగ్టన్‌లోని హిల్టన్‌ హోటల్లో వైట్‌హౌస్‌ కరస్పాండెంట్ల విందులో ఘటన

  • కార్యక్రమంలో ట్రంప్‌, మెలానియా, వాన్స్‌, ఉషా, హెగ్సెత్‌, రూబియో తదితరులు

  • హాల్‌లో 2500 మందికిపైగా అతిథులు

  • హోటల్లోకి వెళ్లేందుకు యత్నించిన దుండగుడు

  • భద్రతా చెక్‌ పాయింట్‌ వద్ద కాల్పులు

  • వెంటనే ట్రంప్‌ను, వాన్స్‌ దంపతులను సురక్షిత ప్రాంతానికి తరలించిన అధికారులు

  • ఎదురు కాల్పులు జరిపి, నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్లు

  • కాలిఫోర్నియాకు చెందిన థామ్‌సగా గుర్తింపు

  • నేనూ అదే హోటల్లో ఉన్నా: కేఏ పాల్‌

వాషింగ్టన్‌, ఏప్రిల్‌ 26: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పాల్గొన్న వైట్‌హౌస్‌ కరస్పాండెంట్ల విందులో కాల్పులు కలకలం సృష్టించాయి. వాషింగ్టన్‌లో శ్వేతసౌధం సమీపంలోని హిల్టన్‌ హోటల్‌లో ఏటా ఈ విందు ఏర్పాటు చేస్తారు. శనివారం రాత్రి జరిగిన విందుకు అధ్యక్షుడు ట్రంప్‌, ప్రథమ మహిళ మెలానియా, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌, ఆయన సతీమణి ఉషా వాన్స్‌ సహా పలువురు నేతలు, జర్నలిస్టులు, ప్రముఖులు దాదాపు 2500 మంది హాజరయ్యారు. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 8.30 గంటల సమయంలో అందరూ విందు ఆరగించేందుకు సిద్ధమవుతుండగా.. ఒక్కసారిగా కాల్పుల శబ్దం వినిపించింది. ఆ సమయంలో వైట్‌హౌస్‌ కరస్పాండెంట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు జియాంగ్‌తో ట్రంప్‌ మాట్లాడుతున్నారు. వెంటనే అప్రమత్తమైన సీక్రెట్‌ సర్వీసెస్‌ ఏజెంట్లు, ఇతర భద్రతా సిబ్బంది విందు జరుగుతున్న హాల్‌లోకి ప్రవేశించి ట్రంప్‌, మెలానియా, వాన్స్‌, ఉషా వాన్స్‌, రక్షణశాఖ మంత్రి పీట్‌ హెగ్సెత్‌, విదేశాంగ శాఖ మంత్రి మార్కో రుబియోలను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు. కాల్పుల శబ్దం వినిపించడం, భద్రతాధికారులు రావడంతో వందలాది మంది అతిథులు హాహాకారాలు చేస్తూ పరుగులు పెట్టారు. చాలా మంది ప్రాణభయంతో డిన్నర్‌ టేబుళ్ల కింద దాక్కున్నారు. ఐదు నుంచి ఎనిమిది రౌండ్ల కాల్పుల శబ్దాలు వినిపించినట్లు విందులో పాల్గొన్నవారు తెలిపారు. కాగా, ఏటా జరిగే శ్వేతసౌధం మీడియా కరస్పాండెంట్ల విందుకు అధ్యక్షుడి హోదాలో ట్రంప్‌ హాజరవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

3.jpg


అసలేం జరిగిందంటే..

డిన్నర్‌ వద్ద సీక్రెట్‌ సర్వీసెస్‌ బృందం ఏర్పాటు చేసిన భద్రతా తనిఖీ కేంద్రాన్ని దాటుకొని ఓ దుండగుడు షాట్‌ గన్‌, హ్యాండ్‌ గన్‌, పలు కత్తులతో హోటల్‌లోనికి ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. అడ్డుకున్న భద్రతా సిబ్బంది పైకి కాల్పులు జరిపాడు. వెంటనే ఎదురుకాల్పులు జరిపిన సిబ్బంది, అతన్ని వెంబడించి అదుపులోకి తీసుకొన్నాయి. ఈ కాల్పుల్లో ఓ సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్‌ గాయపడినట్లు వాషింగ్టన్‌ డీసీ పోలీస్‌ కమిషనర్‌ జెఫ్రీ వెల్లడించారు. నిందితుడిని 31 ఏళ్ల కోల్‌ థామస్‌ అలెన్‌గా గుర్తించారు. అతను కాలిఫోర్నియాలోని టోరెన్స్‌ ప్రాంతానికి చెందినవాడని, హిల్టన్‌ హోటల్‌లో అతిథి అని జెఫ్రీ చెప్పారు. కాల్పుల ఘటనలో అతిథులెవరికీ ఎలాంటి హానీ జరగలేదన్నారు. థామస్‌ను సోమవారం కోర్టులో హాజరుపర్చనున్నట్లు చెప్పారు. కాగా, హిల్టన్‌ హోటల్‌లోనే నిందితుడు ఆయుధాన్ని సిద్ధం చేసినట్లు ప్రత్యక్ష సాక్షిని ఉటంకిస్తూ అమెరికా మీడియా వెల్లడించింది. కాగా, ట్రంప్‌, ఆయన ప్రభుత్వంలోని అధికారులే నిందితుడి లక్ష్యమని తాత్కాలిక అటార్నీ జనరల్‌ టాడ్‌ మీడియాకు వెల్లడించారు.

భయపడుతూ బతికే రకం కాదు: ట్రంప్‌

కాల్పుల ఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత ట్రంప్‌ మీడియాతో మాట్లాడారు. సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్లు, అధికారులు అద్భుతంగా పనిచేశారని కొనియాడారు. క్షణాల్లోనే ఎంతో వేగంగా, ధైర్యంగా స్పందించి కాల్పులు జరిపిన వ్యక్తిని పట్టుకున్నట్లు వెల్లడించారు. తామంతా సురక్షితంగా ఉన్నామని ట్రంప్‌ పేర్కొన్నారు. అధ్యక్ష పదవి ప్రమాదాలతో కూడుకున్నదన్న విషయం తనకు స్పష్టంగా తెలుసని చెప్పారు. కానీ, తాను భయపడుతూ బతికే రకం కాదన్నారు. ‘‘రిపబ్లికన్లు, డెమోక్రాట్లు, ఇండిపెండెంట్లు, కన్జర్వేటివ్‌లు, లిబరల్స్‌, ప్రోగ్రెసివ్స్‌.. ఇలా ఎంతో మంది ఆ రూమ్‌లో ఉన్నారు. ఈ ఘటన నేపథ్యంలో అమెరికన్లందరినీ ఒకటే అడుగుతున్నా. మనమధ్య ఏమైనా విభేదాలుంటే హృదయపూర్వకంగా, శాంతియుతంగా పరిష్కరించుకుందాం’’ అని ట్రంప్‌ పేర్కొన్నారు. వాస్తవానికి కాల్పుల ఘటన తర్వాత తాను హోటల్‌లోనే ఉండి విందును కొనసాగిస్తానన్నానని.. సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్లు మాత్రం అక్కడ్నుంచి వెంటనే వెళ్లిపోవాలని నచ్చజెప్పారని ట్రంప్‌ వెల్లడించారు. మరో 30 రోజుల్లో ఈ విందు సమావేశాన్ని రీషెడ్యూల్‌ చేస్తానన్నారు.

1.jpg


మాటల తూటాలు పేలతాయి: కరోలిన్‌

హిల్టన్‌ హోటల్‌లో నిర్వహించిన వైట్‌హౌస్‌ కరస్పాండెంట్స్‌ అసోసియేషన్‌ డిన్నర్‌ కార్యక్రమంలో కాల్పుల ఘటనకు కొన్ని గంటల ముందు ఓ మీడియా సంస్థతో వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ కరోలిన్‌ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ట్రంప్‌ చేసే ప్రసంగాన్ని ఉద్దేశిస్తూ.. ఈ రాత్రి కొన్ని తూటాలు పేలనున్నాయన్నారు. కానీ, అక్కడ నిజమైన తూటాలు పేలడంతో ఆమె వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఇదిలా ఉండగా, వాషింగ్టన్‌లోని హిల్టన్‌ హోటల్‌లోనే తాను కూడా బస చేసినట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ తెలిపారు. కాల్పుల ఘటన నేపథ్యంలో పాల్‌ హిల్టన్‌ హోటల్‌ నుంచి ఓ వీడియో విడుదల చేశారు.

ఇది మూడోసారి..

ట్రంప్‌పై హత్యాయత్నం జరగడం ఇది మూడోసారి. 2024 సెప్టెంబరులో పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ట్రంప్‌పై దుండగుడు కాల్పులు జరిపాడు. నాటి ఘటనలో ఒక తూటా ఆయన చెవికి తగులుతూ వెళ్లింది. ఆ ఘటన జరిగిన రెండు నెలల తర్వాత ఫ్లోరిడాలోని గోల్ఫ్‌కోర్స్‌ వద్ద ఆయుధంతో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్లు గుర్తించారు. ఓ ఏజెంట్‌ అతనిపై కాల్పులు జరిపారు. ట్రంప్‌ను సురక్షిత ప్రాంతానికి తరలించారు.

ఎవరీ థామస్‌..?

విందులో కాల్పులకు పాల్పడిన నిందితుడు కోల్‌ థామస్‌ అలెన్‌(31) ఉన్నత విద్యావంతుడు కావడం గమనార్హం. అతను కాలిఫోర్నియాలోని టోరెన్స్‌ ప్రాంత వాసి అని పోలీసులు గుర్తించారు. థామస్‌ లింక్డిన్‌ ప్రొఫైల్‌ ప్రకారం కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నుంచి 2017లో మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేశాడు. అనంతరం కాలిఫోర్నియా స్టేట్‌ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్‌ సైన్స్‌లో మాస్టర్స్‌ పూర్తిశాడు. 2018లో ఓ వీడియోగేమ్‌ను తయారు చేశాడు. ఇటీవల మరో గేమ్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు లింక్డిన్‌లో వెల్లడించాడు. 2014లో జెట్‌ ప్రొపెల్షన్‌ ల్యాబ్‌లో నాసా నిర్వహించిన ఫెలోషిప్‌ ప్రోగ్రామ్‌లో కూడా పాల్గొన్నాడు. ప్రస్తుతం టెస్ట్‌ ప్రిపరేషన్‌ ట్యూటరింగ్‌ కంపెనీ సీ2 ఎడ్యుకేషన్‌లో టీచర్‌గా పనిచేస్తున్నట్లు ప్రొఫైల్‌లో ఉంది. థామస్‌ డెమోక్రటిక్‌ పార్టీకి సానుభూతిపరుడని సమాచారం. కమలా హ్యారిస్‌ అధ్యక్ష ప్రచారానికి 25 డాలర్లు విరాళం కూడా ఇచ్చినట్లు ఎన్నికల సంఘం రికార్డుల్లో ఉంది.

2.jpg

Updated Date - Apr 27 , 2026 | 04:32 AM