మమల్ని గెలిపిస్తే వయోజన పౌరులకు 5 వేల డాలర్ల చొప్పున ఇస్తాం: ట్రంప్
ABN , Publish Date - Sep 10 , 2026 | 01:20 PM
అమెరికాలో త్వరలో మిడ్‌టర్మ్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న దృఢసంకల్పంతో ఉన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో త్వరలో మిడ్‌టర్మ్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలిచి తీరాలని పట్టుదలతో ఉన్న అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ తాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి చట్టసభల్లో తమకు మెజారిటీ దక్కేలా చేస్తే వయోజనులైన అమెరికన్లకు ఒక్కొక్కరికీ 5 వేల డాలర్ల చొప్పున ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ చెల్లింపులకు ట్రంప్ డివిడెండ్ అని కూడా ఆయన పేరుపెట్టారు.
‘డివిడెండ్’ ఇచ్చేందుకు అధ్యక్షుడు ట్రంప్ ఓ షరతు కూడా విధించారు. ఈ డబ్బును అమెరికాలో మాత్రమే ఖర్చు పెట్టాలని స్పష్టం చేశారు. ‘ఈ డబ్బును మీరు కెనడాలో ఖర్చు పెట్టకూడదు. చైనా, జర్మనీ పర్యటనలకు వెళ్లి ఖర్చు చేయకూడదు. అమెరికాలోనే ఈ డబ్బును వినియోగించాలి’ అని అన్నారు. ఓటింగ్ సరళిని ప్రభావితం చేసేలా ట్రంప్ ఇలా బహిరంగంగా ఓటర్లకు డబ్బు ఆశ చూపించడం అమెరికాలో కలకలానికి దారి తీసింది. అసలు ఇది ఆచరణ సాధ్యమేనా? ఇలాంటి హామీలు ఇవ్వడం చట్టాన్ని ఉల్లంఘించడం కాదా? అనే చర్చ మొదలైంది.
అమెరికాలో ప్రస్తుతం వయోజనులైన పౌరుల సంఖ్య దాాదాపు 27 కోట్లు. ట్రంప్ హామీ ప్రకారం వీరందరికీ డబ్బులు చెల్లించాలంటే ఖజానాపై 1.3 ట్రిలియన్ డాలర్ల భారం పడుతుంది. అసలు ఇంత డబ్బును సమకూర్చుకోవడం ప్రభుత్వానికి ఎలా సాధ్యం అవుతుందని కొందరు ప్రశ్నిస్తున్నారు. ట్రంప్ డివిడెండ్ అమెరికాలోనే ఖర్చు అయ్యేలా పర్యవేక్షణ సాధ్యం అవుతుందా? అని మరికొందరు ప్రశ్నించారు. సాధారణంగా నిధుల విడుదలకు అమెరికా చట్టసభల అనుమతి తప్పనిసరి. కానీ కాంగ్రెస్ అనుమతి తీసుకుంటారా? లేదా? అనే విషయంలో ట్రంప్ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.
ఇక ఈ వ్యాఖ్యల చట్టబద్ధతపై కొందరు రాజ్యాంగ నిపుణులు కూడా స్పందించారు. ఓటర్లను డబ్బులతో ప్రభావితం చేయడం ఫెడరల్ చట్టాలను ఉల్లంఘించడమేనని అన్నారు. అయితే, అమెరికా రాజ్యాంగంలోని భావప్రకటనా హక్కు ట్రంప్‌నకు రక్షణగా ఉంటుందని అన్నారు. ఇక ప్రతిపక్షం మాత్రం ట్రంప్ మాటలను డొల్ల హామీగా కొట్టిపారేసింది. అయితే, కొవిడ్ సమయంలో జార్జియా రాష్ట్రంలో డెమోక్రటిక్ నేతలు కూడా దాదాపు ఇలాంటి హామీనే ఇచ్చారు. రాష్ట్ర చట్టసభల్లో తమకు మెజారిటీ కట్టపెడితే పౌరులు ఒక్కొక్కరికీ 2 వేల డాలర్ల చొప్పున కొవిడ్ సాయం అందిస్తామని అన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ఆ మూడు భారతీయ కంపెనీలపై చర్యలు తీసుకోండి: యూఎస్ సెనెటర్లు
అమెరికా ఎయిర్ బేస్‌పై ఇరాన్ దాడులు.. సైనిక విమానాలు ధ్వంసం..