Share News

ఆ మూడు భారతీయ కంపెనీలపై చర్యలు తీసుకోండి: యూఎస్ సెనెటర్లు

ABN , Publish Date - Sep 10 , 2026 | 10:07 AM

అమెరికా పౌరులు, సంస్థలకు చెందిన డేటాను చోరీ చేస్తున్న కొన్ని భారతీయ కంపెనీలపై చర్యలు తీసుకోవాలని అధికార రిపబ్లికన్, ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీలకు చెందిన ముగ్గురు సెనెటర్లు కోరారు.

ఆ మూడు భారతీయ కంపెనీలపై చర్యలు తీసుకోండి: యూఎస్ సెనెటర్లు
US Senators Demand Action against Indian Cyber Companies

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా పౌరులు, సంస్థలకు చెందిన డేటాను చోరీ చేస్తున్న కొన్ని భారతీయ కంపెనీలపై చర్యలు తీసుకోవాలని అధికార రిపబ్లికన్, ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీలకు చెందిన ముగ్గురు సెనెటర్లు కోరారు. సెనెటర్లు రాన్ వైడెన్, షెల్డన్ వైట్‌హౌస్, పాట్ హారిగన్‌లు ఈ మేరకు ట్రంప్ ప్రభుత్వానికి లేఖ రాశారు. సన్‌కిస్డ్ ఆర్గానిక్ ప్రైవేట్ లిమిటెడ్, బెల్‌ట్రాక్స్ లిమిటెడ్, సైబర్‌రూట్ లిమిటెడ్ సంస్థలు హ్యాకింగ్‌కు పాల్పడి వేల మంది అమెరికన్ పౌరులు, సంస్థల డేటాను తస్కరించాయని ఆరోపించారు. ఈ మేరకు యూఎస్ వాణిజ్య శాఖ మంత్రి హోవర్డ్ లట్నిక్‌కు లేఖ రాశారు.


2022లో ఫిఫా వరల్డ్ కప్‌కు ఆతిథ్యమిచ్చేందుకు ఖతార్ ప్రయత్నించిన నేపథ్యంలో అడ్డంకులు తొలగించేందుకు హ్యాకింగ్ గ్రూపులు రంగంలోకి దిగినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఖతార్ ప్రయత్నాలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిని హ్యాకింగ్ గ్రూపులు టార్గెట్ చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. యూఎస్‌లోని ప్రైవేటు ఈక్విటీ సంస్థలు, ఫార్మా సంస్థలు, వెయ్యికి పైగా న్యాయవాద సంస్థలూ టార్గెట్‌గా మారినట్టు వార్తలు వెలువడ్డాయి. అయితే ఖతార్ మాత్రం ఈ ఆరోపణలను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది.


ఖతార్ ప్రభుత్వ ప్రోద్బలంతో ఈ సంస్థలు హ్యాకింగ్‌కు పాల్పడ్డాయని చెప్పేందుకు ఆధారాలు ఉన్నాయని కూడా సెనెటర్లు తమ లేఖలో పేర్కొన్నారు. నిఘా వ్యవహారాలకు సంబంధించి ప్రతినిధుల సభ కమిటీ మాజీ చైర్మన్ కుటుంబాన్ని కూడా హ్యాకింగ్ గ్రూపులు టార్గెట్ చేశాయని అన్నారు. తమ కార్యకలాపాలను బయటపడకుండా ఉండేందుకు న్యాయప్రక్రియలను కూడా దుర్వినియోగం చేశాయని వారు చెప్పారు. గూగుల్ వంటి అమెరికన్ టెక్ కంపెనీలు, మీడియా సంస్థలపై ఆ మూడు కంపెనీలు కేసులు వేశాయని చెప్పారు. అమెరికా సాఫ్ట్‌వేర్, క్లౌడ్ వసతులు, సైబర్ సెక్యూరిటీ టూల్స్ ఆ కంపెనీలకు అందుబాటులో లేకుండా వాటిని ఎంటిటీ లిస్టులో చేర్చాలని వాణిజ్య మంత్రిత్వ శాఖలోని బ్యూరో ఆఫ్ ఇండస్ట్రీ అండ్ సెక్యూరిటీ విభాగాన్ని కోరారు.


ఈ వార్తలనూ చదవండి:

మేడ్ ఇన్ చైనా యుద్ధ ట్యాంకు పేలుడు.. ఇద్దరు బంగ్లాదేశీ సైనికుల మృతి

కాగ్నిజెంట్‌కు షాకిచ్చిన యూఎస్

Updated Date - Sep 10 , 2026 | 10:38 AM