Share News

న్యూయార్క్‌లో మహిళ అరాచకం.. పోలీసు కాల్పుల్లో మృతి

ABN , Publish Date - Sep 01 , 2026 | 08:14 AM

న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్ ప్రాంతంలో కత్తితో దాడికి తెగబడ్డ ఓ మహిళ పోలీసు కాల్పుల్లో మృతి చెందింది. మంగళవారం ఈ ఘటన జరిగింది.

న్యూయార్క్‌లో మహిళ అరాచకం.. పోలీసు కాల్పుల్లో మృతి
Times Square Incident

ఇంటర్నెట్ డెస్క్: న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్ ప్రాంతంలో కత్తితో దాడికి తెగబడ్డ ఓ మహిళ పోలీసు కాల్పుల్లో మృతి చెందింది. మంగళవారం ఈ ఘటన జరిగింది. కత్తులతో అక్కడికి వచ్చిన ఆమె ఇద్దరిని పొడిచింది. వారిలో ఒకరు మరణించగా మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయపడ్డ వ్యక్తికి ప్రాణాపాయం తప్పింది.

ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, మహిళ రెండు కత్తుల వచ్చి అక్కడున్న ఇద్దరు వ్యక్తులపై అకస్మాత్తుగా దాడి చేసింది. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను టేజర్‌తో షాకిచ్చి అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. అయితే, ఆమె పోలీసులవైపు దూసుకురావడంతో వారు ఆమెపై రెండు సార్లు కాల్పులు జరిపారు. దీంతో, మహిళ ఘటనా స్థలంలోనే కన్నుమూసింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇంకా పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది. ఈ ఘటన వెనుక ఉగ్రకుట్ర కోణం లేదన్నట్టు అమెరికా మీడియాలో కథనాలు వెలువడ్డాయి. మహిళ అకారణంగా దాడికి ఎందుకు దిగింది? అమె మానసిక ఆరోగ్యం సరిగా లేదా? అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


ఘటనపై న్యూయార్క్ మేయర్ జొహ్రాన్ మమ్దానీ విచారం వ్యక్తం చేశారు. పరిస్థితి మరింత ముదరకుండా నిరోధించిన పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం ఘటనపై దర్యాప్తు జరుగుతున్నందున ఇప్పుడే అన్ని వివరాలు చెప్పలేమని పోలీసులు ఒక ప్రకటనలో అన్నారు. న్యూయార్క్‌లోని మన్‌హట్టన్‌లోగల టైమ్స్‌స్క్వేర్ వాణిజ్య, ఎంటర్‌టెయిన్‌మెంట్ కేంద్రంగా ఉన్న విషయం తెలిసిందే.


ఈ వార్తలనూ చదవండి:

1993లో జపాన్‌కు వచ్చాడు.. 33 ఏళ్ల తర్వాత ఊహించని విధంగా..

ఇరాన్‌లో లక్ష మందికి పైగా నిరసనకారుల హత్య: ట్రంప్ సంచలన ఆరోపణలు..

Updated Date - Sep 01 , 2026 | 08:32 AM