1993లో జపాన్‌కు వచ్చాడు.. 33 ఏళ్ల తర్వాత ఊహించని విధంగా..
ABN , Publish Date - Sep 01 , 2026 | 06:53 AM
జపాన్‌లో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. 15 రోజుల అనుమతితో జపాన్‌కు వచ్చిన ఓ వ్యక్తి ఏకంగా 33 సంవత్సరాల పాటు అక్కడే అక్రమంగా ఉండిపోయాడు. 33 ఏళ్ల తర్వాత అతడికి ఊహించని షాక్ తగిలింది.
ఇంటర్‌నెట్ డెస్క్: జపాన్‌లో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. 15 రోజుల అనుమతితో జపాన్‌కు వచ్చిన ఓ వ్యక్తి ఏకంగా 33 సంవత్సరాల పాటు అక్కడే అక్రమంగా ఉండిపోయాడు. 33 ఏళ్ల తర్వాత అతడికి ఊహించని షాక్ తగిలింది. తాజాగా, పోలీసులకు చిక్కి జైలు పాలయ్యాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. దక్షిణ కొరియాకు చెందిన మున్ జోంగ్-గి అనే వ్యక్తి 1993 సెప్టెంబర్ నెలలో తన తమ్ముడి పాస్‌పోర్ట్‌ను ఉపయోగించి జపాన్‌లోకి ప్రవేశించాడు. కొరియా కంటే జపాన్‌లో మంచి వేతనాలు లభిస్తాయనే ఉద్దేశంతో మున్ జోంగ్ ఈ అక్రమ మార్గాన్ని ఎంచుకున్నాడు.
అతడికి లభించిన టూరిస్ట్ వీసా గడువు కేవలం 15 రోజులు మాత్రమే. కానీ, ఆ గడువు ముగిసిన తర్వాత కూడా మున్ జోంగ్ స్వదేశానికి తిరిగి వెళ్లకుండా జపాన్‌లోనే ఉండిపోయాడు. గడిచిన 33 ఏళ్లుగా మున్ జోంగ్ జపాన్‌లోని షిజుయోకా ప్రిఫెక్చర్ పరిధిలోని యైజు నగరంలో నివసిస్తున్నాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు చిన్నచిన్న దినసరి కూలీ పనులు, తాత్కాలిక పనులు చేసుకుంటూ తన జీవనాన్ని సాగించాడు. ఈ ఏడాది జూన్ నెలలో ఓ గుర్తుతెలియని వ్యక్తి ద్వారా జపాన్‌లో అక్రమంగా నివసిస్తున్న మున్ జోంగ్ గురించి పోలీసులకు తెలిసింది.
రంగంలోకి దిగిన షిజుయోకా ప్రిఫెక్చరల్ పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. ఆగస్టు 26వ తేదీన మున్ జోంగ్-గిని అరెస్ట్ చేశారు. అతడిని విచారించగా నేరం అంగీకరించాడు. 33 ఏళ్ల పాటు ఎవరికీ దొరకకుండా అతను ఎలా తప్పించుకున్నాడనే కోణంలో పోలీసులు ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు. మున్ జోంగ్ వయసు 72 సంవత్సరాలు. అతడిని దక్షిణ కొరియాకు డిపోర్ట్ (దేశ బహిష్కరణ) చేస్తారా లేదా అనేది తెలియరాలేదు.
ఇవి కూడా చదవండి
రోడ్డు ప్రమాద బాధితులకు .10 లక్షల ప్రకటనపై మంద కృష్ణ హర్షం
ప్రజల ఆశీర్వాదంతో ప్రజాపాలనకు 1000 రోజులు