Share News

సముద్రం అల్లకల్లోలం.. వణుకుతున్న అమెరికా.. ఎల్ నినో కారణమా?

ABN , Publish Date - Nov 25 , 2026 | 02:04 PM

సముద్రంలో భారీ అలలు పోటెత్తుతుండటంతో అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం తీర ప్రాంతాల్లో కలకలం రేగుతోంది. భారీ అలలు విరుచుకుపడుతున్న వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

సముద్రం అల్లకల్లోలం.. వణుకుతున్న అమెరికా.. ఎల్ నినో కారణమా?
US Coastal Storm North california

ఎల్ నినో దెబ్బకు భారత్‌లో వర్షాభావం ఏర్పడింది. అనేక ప్రాంతాల్లో నీటి ఎద్దడి నెలకొంది. అయితే, ఎల్ నినో ప్రభావం ప్రాంతాలను బట్టి మారుతుంటుంది. ఈ నేపథ్యంలో తుఫానుల కారణంగా అమెరికా పశ్చిమ తీర ప్రాంతం వణికిపోతోంది. 30 అడుగుల మేర ఎగసిపడుతున్న అలలు చూసి ప్రజలు భయాందోళనలకు లోనవుతున్నారు. ముఖ్యంగా కాలిఫోర్నియా తీర ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.


అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, కాలిఫోర్నియా (అమెరికా) రాష్ట్ర తీర ప్రాంతాల్లో సముద్రం పోటెత్తుతోంది. తుఫాను వాతావరణం కారణంగా సముద్రం పోటు మీద ఉండటంతో 30 అడుగుల ఎత్తున అలలు తీరాన్ని ముంచెత్తుతున్నాయి. శాన్‌ఫ్రాన్‌సిస్కో నగరం తీర ప్రాంత ప్రజలు భారీ అలల తాకిడికి వణికిపోతున్నారు. 1982 తరువాత ఇంతటి భారీ అలలు అక్కడ చూడటం ఇదే తొలిసారని నేషనల్ వెదర్ సర్వీస్ పేర్కొంది. పరిస్థితి మరింత ముదిరే అవకాశం ఉందని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు.


అలల వెనుక ఎల్ నినో?

అలలు ఇంతలా పోటెత్తడానికి పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన తుఫానే కారణమని చెబుతున్నారు. ఇప్పటికే ఆ సముద్రంలో ఎల్‌నినో ప్రభావం ఉంది. ఇది అతితీవ్రమైన ఎల్ నినోగా మారనుందన్న అంచనాలు ఉన్నాయి. అయితే, ప్రస్తుత తుఫానుకు ఎల్ నినోనే కారణమా అనేది నిర్ధారించేందుకు మరింత అధ్యయనం అవసరమని చెబుతున్నారు. ఎల్ నినో నేపథ్యంలో ఏర్పడుతున్న ఈ అసాధారణ వాతావరణ మార్పులను శాస్త్రవేత్తలు నిశితంగా గమనిస్తున్నారు.


ఈ వార్తలనూ చదవండి:

హూతీ దాడుల్లో ఇద్దరు భారతీయులకు గాయాలు.. ఖండించిన విదేశాంగ శాఖ

విశ్వసుందరిగా ప్యూర్టోరికో భామ.. జెన్నిఫర్‌ బారెటోకు కిరీటం!

Updated Date - Nov 25 , 2026 | 02:32 PM