Share News

భారత్‌పై అదనపు సుంకాలు విధించమంటే వాళ్లు కుదరదన్నారు: యూఎస్ మంత్రి

ABN , Publish Date - Oct 19 , 2026 | 07:56 AM

రష్యా చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌, చైనాలపై అదనపు సుంకాలు విధించాలని కోరితే ఐరోపా దేశాలు తిరస్కరించాయని యూఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ తాజాగా వెల్లడించారు.

భారత్‌పై అదనపు సుంకాలు విధించమంటే వాళ్లు కుదరదన్నారు: యూఎస్ మంత్రి
Scott Bessent

ఇంటర్నెట్ డెస్క్: రష్యా చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌, చైనాలపై అదనపు సుంకాలు విధించాలని కోరితే ఐరోపా దేశాలు తిరస్కరించాయని యూఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ తాజాగా వెల్లడించారు. మరి రష్యాను దారికి తెచ్చే భారాన్ని పూర్తిగా తామే ఎందుకు భరించాలని ప్రశ్నించారు. ఐరోపా దేశాలు ఇప్పటికీ రష్యా ఇంధన ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నాయని చెప్పారు. రష్యాపై ఆర్థికంగా ఒత్తిడిని పెంచేందుకు సాయం చేయాలంటూ తాను వ్యక్తిగతంగా ఐరోపా మిత్రులను కోరినా స్పందన లేదని అన్నారు. రష్యా చమురు కొనుగోలుదారులపై 100 శాతం సుంకం విధింపు నుంచి భారత్‌కు యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాత్కాలిక మినహాయింపులు ఇవ్వడాన్ని స్కాట్ బెసెంట్ సమర్థించుకున్నారు.


ఇప్పటికీ రష్యా ఇంధన ఉత్పత్తులు కొనుగోలు చేస్తున్న ఐరోపా దేశాలు పుతిన్‌కు యుద్ధ నిధులు అందిస్తున్నాయని ఆరోపించారు. కానీ అమెరికాపై మాత్రం అవి విమర్శలు గుప్పిస్తున్నాయని ఆక్షేపించారు. ‘ఒక్కసారి ఐరోపాలో ఏం జరుగుతోందో చూడండి. ఐరోపా దేశాలు పుతిన్‌కు ఉక్రెయిన్ కంటే ఎక్కువగా నిధులు చేరేలా చేశాయి’ అని అన్నారు. తాము రష్యాను ఒంటరిని చేద్దామని ప్రయత్ని్స్తుంటే ఐరోపా దేశాలు మాత్రం రష్యా ఇంధనాలపై ఆధారపడటాన్ని కొనసాగిస్తున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. రష్యా యుద్ధ యంత్రానికి ఐరోపా నుంచే నిధులందుతున్నాయని వ్యాఖ్యానించారు. 1.4 బిలియన్ డాలర్ల విలువైన రష్యా ఉత్పత్తులను 1.8 బిలియన్ డాలర్ల ఫర్టిలైజర్లను తాము దిగుమతి చేసుకుంటే ఐరోపా ఇందుకు పది రెట్ల వరకూ రష్యా నుంచి తెచ్చుకుందని చెప్పారు.


భారత్, చైనాలకు తాత్కాలిక మినహాయింపులు ఇవ్వడాన్ని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో కూడా సమర్థించుకున్నారు. రష్యా చమురును కాదనుకుని ఇతర వనరులవైపు మళ్లడం భారత్‌కు ఒక్క రోజులో సాధ్యమయ్యే పని కాదని రూబియో స్పష్టం చేశారు. ఇప్పటికే భారత్ స్వచ్ఛందంగా ఇతర దేశాల నుంచి చమురును దిగుమతి చేసుకుంటోందని చెప్పారు. సుంకాలు విధిస్తే కలిగే ప్రభావాలపై ట్రంప్ రాబోయే 2 నెలల పాటు క్షుణ్ణంగా అధ్యయనం చేసి తుది నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.


ఈ వార్తలనూ చదవండి:

హెచ్‌1బీ వీసాదారులకు వ్యతిరేకం కాదు: జేడీ వాన్స్

ఒక్క రోజులో విధానాన్ని మార్చుకోవడం కష్టం: యూఎస్ మంత్రి మార్కో్ రూబియో

Updated Date - Oct 19 , 2026 | 07:57 AM