హెచ్1బీ వీసాదారులకు వ్యతిరేకం కాదు
ABN , Publish Date - Oct 19 , 2026 | 06:23 AM
హెచ్1బీ వీసాలపై పనిచేస్తున్న విదేశీ ఉద్యోగులను ఒప్పంద బానిసలు అంటూ గతంలో తాను చేసిన వ్యాఖ్యలపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వివరణ ఇచ్చారు.
అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా వలసలుండాలి
నా వ్యాఖ్యల్లో తప్పులు దొర్లి ఉండొచ్చు
విదేశీ నిపుణులను లక్ష్యంగా చేసుకోవాలన్నది ఉద్దేశం కాదు
అవసరమైన చోట వారికి స్వాగతం పలకాల్సిందే
భారత్ నుంచి వచ్చిన అత్త, మామలంటే ఎంతో ప్రేమ
అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్
వాషింగ్టన్, అక్టోబర్ 18: హెచ్1బీ వీసాలపై పనిచేస్తున్న విదేశీ ఉద్యోగులను ఒప్పంద బానిసలు అంటూ గతంలో తాను చేసిన వ్యాఖ్యలపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వివరణ ఇచ్చారు. తన అభిప్రాయాల వ్యక్తీకరణలో లోపం ఉండొచ్చంటూనే.. వలసలపై తాను లేవనెత్తిన అంశాలను మాత్రం సమర్థించుకున్నారు. హెచ్1బీ వీసాదారులను కించపరచడం తన ఉద్దేశం కాదని, వారిని నియమించుకునే కంపెనీలు, వీసా వ్యవస్థను విమర్శించడమే తన ఉద్దేశమని వివరణ ఇచ్చారు. అమెరికన్ ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడుతూనే.. దేశానికి సేవ చేయాలనుకునే విదేశీ నిపుణులకు గౌరవంగా స్వాగతం పలకాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘విదేశీ ఒప్పంద పనివాళ్లు అంటూ ఆ రోజు నేడు వాడిన పదం సరైనది కాదు. హెచ్1బీ వీసాదారులను లక్ష్యంగా చేసుకోవాలన్నది నా ఉద్దేశం కాదు. నా కుటుంబం ఎక్కడి నుంచి వచ్చిందో మీకు తెలిసే ఉంటుంది. దక్షిణ భారత్ నుంచి వలస వచ్చిన నా అత్త, మామలను నేను ఎంతో ప్రేమిస్తాను. అమెరికాలోనే జన్మించిన వారి కుమార్తె ఇప్పుడు ద్వితీయ మహిళ(వాన్స్ భార్య ఉష)గా ఉన్నారు. ఆమెను చూసి ఎంతో గర్విస్తున్నాను. ఆమెను ఎంతగానో ప్రేమిస్తున్నాను’’అని సీబీఎస్ న్యూస్ టౌన్ హాల్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా వాన్స్ చెప్పారు. ‘పర్మినెంట్ లేబర్ సర్టిఫికేషన్ కార్యక్రమం’ (పెర్మ్)ను భారత ఐటీ కంపెనీలు వినియోగించుకోకుండా ఈ నెల మొదట్లో నిషేధం విధించిన సందర్భంగా జేడీ వాన్స్ మాట్లాడుతూ.. పలు వ్యాఖ్యలు చేశారు. భారత్‌కు చెందిన ఐటీ కంపెనీలు హెచ్1బీ వీసాను దుర్వియోగం చేస్తున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వాన్స్ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు రాగా, భారత్ సైతం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో వాన్స్ తన ఉద్దేశమేంటో వివరించే ప్రయత్నం చేశారు. ఓ పెద్ద కార్పొరేట్ సంస్థ తనవద్దనున్న ఉద్యోగులతో పనిచేయించుకోవడం సాధ్యం కాదని చెప్పి, విదేశీ అకౌంటెంట్‌ను నియమించుకున్న అనంతరం.. అమెరికన్ అకౌంటెంట్‌ను తొలగిస్తే అది ఎలా సమర్థనీయం అవుతుందన్నారు. విదేశీ ఉద్యోగులను నియమించుకోవడాన్ని వ్యతిరేకించడం తన ఉద్దేశం కాదని స్పష్టం చేస్తూ.. అది అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా ఉండాలన్నారు. ఈ రెండింటి మధ్య సరైన సమతూకం అవసరమన్నారు.