ఇరాన్‌లో ఉద్రిక్తతలు.. రష్యా ప్రభుత్వ అణు సంస్థ ఆందోళన
ABN , Publish Date - Mar 03 , 2026 | 07:03 PM
ఇరాన్‌లో బుషెహర్ అణుకేంద్రానికి ముప్పు ఉందని రష్యా ప్రభుత్వ అణు సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌లు దాడి చేస్తుంటే ఇరాన్ కూడా ప్రతీకార దాడులకు దిగుతోంది. ఈ నేపథ్యంలో రష్యా ప్రభుత్వ అణు సంస్థ రొసాటమ్ కీలక ప్రకటన చేసింది. ఇరాన్‌లోని బుషెహర్ అణు విద్యుత్ కేంద్రానికి ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇరాన్‌లో క్రియాశీలకంగా ఉన్న ఏకైక అణు విద్యుత్ కేంద్రం ఇదే కావడంతో ప్రస్తుతం సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇక ఇరాన్ నుంచి 100 మంది రష్యన్లను స్వదేశానికి తరలించినట్టు కూడా రష్యా పేర్కొంది. కొందరు రష్యన్ సిబ్బంది ఇంకా అణు కేంద్రం వద్దనే ఉన్నారని తెలిపింది.
ఇదిలా ఉంటే, అరబ్ దేశాలపై ఇరాన్ ప్రతీకార దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్ తమపై ఇప్పటివరకూ 186 మిసైళ్లను ప్రయోగించిందని యూఏఈ తాజాగా తెలిపింది. వీటిల్లో 172 క్షిపణులను మార్గమధ్యంలోనే నాశనం చేశామని పేర్కొంది. మరో 13 సముద్రంలో కూలిపోయాయని పేర్కొంది. ఒక మిసైల్ మాత్రం తమ భూభాగంలో పడిందని వెల్లడించింది. ఇక ఇరాన్ ప్రయోగించిన 812 డ్రోన్‌లలో 755 డ్రోన్‌లను కూడా మార్గమధ్యంలోనే అడ్డుకున్నామని యూఏఈ బ్రిగేడియర్ జనరల్ అబ్దుల్ నాసర్ అహ్మద్ తెలిపారు.
మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్ని ప్రయత్నాలు చేస్తారని రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ ప్రతినిధి ఒకరు తెలిపారు. మధ్యవర్తిత్వం వహించేందుకు పుతిన్ సిద్ధమేనని అన్నారు.
ఇవి కూడా చదవండి
ఇరాన్‌పై యుద్ధాన్ని బలవంతంగా రుద్దారు.. పాక్ రక్షణ శాఖ మంత్రి ఆగ్రహం
ఇరాన్‌పై అమెరికా దాడులను ఖండించిన చైనా