Share News

ఇరాన్‌కు సాయం నిలిపివేతపై వార్తలు.. ఖండించిన రష్యా

ABN , Publish Date - Mar 21 , 2026 | 01:42 PM

ఇరాన్‌కు నిఘా సమాచారం అందజేతను నిలిపివేస్తామని అమెరికాకు రష్యా ప్రతిపాదించినట్టు వచ్చిన వార్తలను అధ్యక్షుడు పుతిన్ కార్యాలయం ఖండించింది. అలాంటి ప్రతిపాదన ఏదీ తాము చేయలేదని స్పష్టం చేసింది.

ఇరాన్‌కు సాయం నిలిపివేతపై వార్తలు.. ఖండించిన రష్యా
Russia Condemns Polico's report on Sharing Intelligence With Iran

ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్‌కు నిఘా సమాచారం అందజేతను నిలిపివేస్తామని అమెరికాకు తాము ప్రతిపాదించినట్టు మీడియాలో వచ్చిన వార్తలను రష్యా అధ్యక్షుడి కార్యాలయం క్రెమ్లిన్ తాజాగా తోసిపుచ్చింది. తాము అలాంటి ప్రతిపాదన ఏదీ చేయలేదని స్పష్టం చేసింది. ఉక్రెయిన్‌కు నిఘా సమాచారాన్ని అమెరికా అందించకపోతే తామూ ఇరాన్ విషయంలో వెనక్కు తగ్గుతామని రష్యా ప్రతిపాదించినట్టు యూఎస్‌ మీడియా సంస్థ పోలిటికోలో వార్తలు వెలువడ్డాయి.

పొలిటికో కథనాల ప్రకారం, అమెరికా ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, జేరెడ్ కుష్నర్ వద్ద రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రతినిధి కిరిల్ డిమిట్రియేవ్ గతవారం ఈ అంశాన్ని ప్రస్తావించారట. ఉక్రెయిన్‌కు నిఘా సమాచారాన్ని అందించడం నిలిపివేయాలని అమెరికాను కోరాట. ఇందుకు ప్రతిగా తామూ ఇరాన్ విషయంలో వెనక్కు తగ్గుతామని అన్నారట. అయితే, అమెరికా మాత్రం ఈ ప్రతిపాదనను తోసిపుచ్చిందట. ఈ చర్చల్లో పాల్గొన్న కొందరిని ఉటంకిస్తూ పొలిటికో ఈ వార్తలను ప్రచురించింది.


ఈ కథనాలపై కిరిల్ డిమిట్రియేవ్ ఎక్స్ వేదికగా మండిపడ్డారు. అవన్నీ తప్పుడు వార్తలని తేల్చి చెప్పారు. మరోవైపు, అమెరికాలో అధికార రిపబ్లికన్ పార్టీకి చెందిన చట్టసభ సభ్యురాలు ఆనా పౌలీనా కూడా ఈ వార్తలపై ఫైరైపోయారు. ఉక్రెయిన్‌లోని యుద్ధ అనుకూల వర్గాలకు పొలిటికో కరపత్రంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్వేత సౌధంలోని వ్యవహారాలు, అంతర్గత చర్చలపై పొలిటికోకు ఎలాంటి సమాచారం లేదని అన్నారు. రష్యా, అమెరికాల మధ్య ఉద్రిక్తతలు పెంచే ఇలాంటి కథనాలను పట్టించుకోవద్దని ప్రజలకు సూచించారు.

ఇక పశ్చిమాసియా ఉద్రిక్తతలకు సంబంధించి మరో అంతర్జాతీయ మీడియా సంస్థ వాషింగ్టన్ పోస్టు ఇటీవల కీలక కథనాన్ని ప్రచురించింది. అమెరికా యుద్ధ నౌకలు, ఫైటర్ జెట్‌ల కదలికలకు సంబంధించిన కీలక నిఘా సమాచారాన్ని రష్యా ఇరాన్‌కు చేరవేసిందని పేర్కొంది. ఈ వార్తలను కూడా క్రెమ్లిన్ అప్పట్లో తోసిపుచ్చింది. ఇక ఉక్రెయిన్‌తో యుద్ధం విషయంలో ఇరాన్‌ తొలి నుంచీ రష్యాకు మద్దతుగా నిలుస్తోంది. ఉక్రెయిన్‌పై దాడుల కోసం డ్రోన్‌లను కూడా ఇరాన్ సరఫరా చేసినట్టు మీడియాలో కథనాలు వెలువడ్డాయి.


ఈ వార్తలూ చదవండి:

చమురు, గ్యాస్‌కు..మరో 6 నెలలు కష్టాలే!

4 వేల కిలోమీటర్ల దూరంలోని యూఎస్ స్థావరంపైకి ఇరాన్ మిసైల్స్‌!

Updated Date - Mar 21 , 2026 | 02:05 PM