ఇరాన్ స్కెచ్ తెలిసి.. చివరి నిమిషంలో విమానాన్ని మార్చిన ట్రంప్!
ABN , Publish Date - Jul 26 , 2026 | 01:01 PM
ఇరాన్ ప్రేరేపిత శక్తులు తనను టార్గెట్ చేశాయని తెలిసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చివరి నిమిషంలో తన విమానాన్ని మార్చినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్ ప్రేరేపిత శక్తులు తనను టార్గెట్ చేశాయని తెలిసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయాణానికి ముందు చివరి నిమిషంలో తన విమానాన్ని మార్చినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ నెలలో టర్కీ పర్యటన సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది.
మీడియా కథనాల ప్రకారం, నాటో సమావేశాల్లో పాల్గొనేందుకు ట్రంప్ ఖతార్ బహుమతిగా ఇచ్చిన బోయింగ్-747-8 విమానంలో వెళ్లారు. అయితే, తిరిగి వెళ్లే సమయంలో మాత్రం ట్రంప్ మునుపటి ఎయిర్‌ఫోర్స్ వన్ విమానాన్నే వినియోగించినట్టు తెలిసింది. అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాల సూచన మేరకే ట్రంప్ చివరి నిమిషంలో విమానాన్ని మార్చారని సమాచారం.
డొనాల్డ్ ట్రంప్‌ను, ఆయన విమానాన్ని టార్గెట్ చేయాలని ఇరాన్ ప్రేరేపిత శక్తులు ప్లాన్ చేస్తున్నట్టు అమెరికా నిఘా వర్గాలకు సమాచారం అందింది. దీంతో, ట్రంప్ ఖతార్ విమానాన్ని పక్కనపెట్టి మునుపటి ఎయిర్‌ఫోర్స్ వన్‌లో తిరిగివెళ్లారని తెలిసింది. అయితే, యూస్ సిబ్బందికి కొత్త విమానాన్ని చూసేందుకు అవకాశం కల్పించాలనే తాను మరో విమానంలో వెళ్లినట్టు ట్రంప్ అప్పట్లో పత్రికాముఖంగా పేర్కొన్నారు. ఇక వైట్ హౌస్ వర్గాలు కూడా ఈ వార్తలను కొట్టిపారేశాయి. చివరి నిమిషంలో విమానం మార్పులు సర్వసాధారణమని, గతంలోనూ ఇలా జరిగిందని చెప్పాయి.
ఖతార్ రాజకుటుంబం వినియోగించిన బోయింగ్ విమానాన్ని అక్కడి ప్రభుత్వం ట్రంప్‌నకు బహుమతిగా ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తరువాత అధ్యక్షుడి భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా విమానంలో కొత్త వ్యవస్థలను ఏర్పాటు చేశారు. అయితే, శత్రుదేశ మిసైల్స్‌ను అడ్డుకునే అత్యాధునిక వ్యవస్థ ఇందులో లేదన్న వార్తలు ఉన్నాయి. ఈ ఏడాది చివరి కల్లా అన్ని రకాల వ్యవస్థలను విమానంలో ఏర్పాటు చేయనున్నారని సమాచారం.
ఈ వార్తలనూ చదవండి:
స్పెయిన్-ఫ్రాన్స్ సరిహద్దులో కార్చిచ్చు బీభత్సం.. 2.5 లక్షల మందికి పైగా తరలింపు..
నేపాల్ ప్రభుత్వం యూటర్న్.. వివాదాస్పద మ్యాప్‌తోనే రూ.1 నాణెం విడుదల..