Share News

ఆర్టెమిస్-2 మిషన్.. సరికొత్త రికార్డు దిశగా వ్యోమగాములు

ABN , Publish Date - Apr 06 , 2026 | 06:01 PM

మరికొన్ని గంటల్లో ఆర్టెమిస్-2 మిషన్‌ సరికొత్త రికార్డును నెలకొల్పనుంది. భూమ్మీద నుంచి గరిష్ఠ దూరానికి చేరుకున్న మానవసహిత యాత్రగా రికార్డు నెలకొల్పనుంది.

ఆర్టెమిస్-2 మిషన్.. సరికొత్త రికార్డు దిశగా వ్యోమగాములు
NASA Artemis 2 mission

ఇంటర్నెట్ డెస్క్: చంద్రుడిని చుట్టి వచ్చేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) చేపట్టిన ఆర్టెమిస్-2 మిషన్ మరి కొన్ని గంటల్లో సరికొత్త రికార్డు నెలకొల్పనుంది. ఈ మిషన్‌లో భాగంగా నలుగురు వ్యోమగాములతో కూడిన ఒరాయన్ వ్యోమనౌక ఇప్పటికే చంద్రుడి గురుత్వాకర్షణ ప్రభావం పరిధిలోకి వెళ్లింది. ఈస్టర్న్ డేలైట్ టైమ్ (అమెరికా కాలమానం) ప్రకారం, ఏప్రిల్ 6న సాయంత్రం 7.07 గంటలకు భూమి నుంచి గరిష్ఠంగా 252,757 మైళ్ల దూరానికి వ్యోమనౌక చేరుకుంటుంది. భారత కాలమానం ప్రకారం రేపు తెల్లవారుజామున సుమారు 4.35 గంటల సమయంలో వ్యోమనౌక ఈ గరిష్ఠ దూరానికి చేరుకుంటుంది. దీంతో, ఇది భూమ్మీద నుంచి అత్యధిక దూరానికి చేరిన మానవసహిత యాత్రగా నిలిచిపోతుంది. 1970లో నాసా చేపట్టిన అపోలో-13 మిషన్‌ కంటే 4,102 మైళ్ల అధిక దూరానికి ఒరాయన్ నౌక చేరుకుంటుంది.


ఈ మిషన్‌లో భాగంగా నాసా ఆస్ట్రోనాట్స్ రీడ్ వైస్‌మెన్, విక్టర్ గ్లోవర్, క్రిస్టీనాతో పాటు కెనడా వ్యోమగామి జెరెమీ హాన్సన్ చంద్రుడి చుట్టూ పరిభ్రమిస్తూ ఫొటోలు తీయనున్నారు. సాధారణంగా జాబిల్లికి చెందిన ఒకవైపు మాత్రమే భూమ్మిద నుంచి కనిపిస్తుంది. భూమ్మీద నుంచి చూడటం సాధ్యం కాని రెండో వైపును ఫార్ సైడ్ అని శాస్త్రవేత్తలు పిలుస్తారు. తాజా మిషన్‌లో ఆస్ట్రోనాట్స్‌ ఫార్ సైడ్‌న ఉన్న ఉపరితలాన్ని ఫొటోలు తీయనున్నారు. చంద్రుడి చుట్టూ పరిభ్రమిస్తూ ఉపరితలానికి 4 వేల మైళ్ల ఎత్తునుంచి ఈ ఫొటోలు తీసుకున్న అనంతరం భూమివైపు తిరుగుప్రయాణం అవుతారు. భారత కాలమానం ప్రకారం రేపు తెల్లవారుజామున ఈ ఫ్లైబై ప్రక్రియ ప్రారంభం అవుతుంది. మిషన్ అనంతరం ఏప్రిల్ 10న (అమెరికా కాలమానం) వ్యోమగాములు భూమికి చేరుకుంటారు.


ఈ వార్తలూ చదవండి:

కాల్పుల విరమణ ప్రతిపాదనలను పరిశీలిస్తున్న ఇరాన్, యూఎస్ఏ

ఇరాన్‌కు మరో గట్టి దెబ్బ... ఐఆర్‌జీసీ ఇంటెలిజెన్స్ చీఫ్ హతం

Updated Date - Apr 06 , 2026 | 07:13 PM