కాల్పుల విరమణ ప్రతిపాదనలను పరిశీలిస్తున్న ఇరాన్, యూఎస్ఏ
ABN , Publish Date - Apr 06 , 2026 | 03:42 PM
పశ్చిమాసియాలో కాల్పుల విరమణ కోసం మధ్యవర్తులు చేసిన ప్రతిపాదనలను అమెరికా, ఇరాన్‌లు పరిశీలిస్తున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే, డెడ్‌లైన్‌ల ఒత్తిడిలో డీల్ సాధ్యం కాదని ఇరాన్ స్పష్టం చేసినట్టు సమాచారం.
ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు తెరదించే కాల్పుల విరమణ ప్రతిపాదనలను యూఎస్, ఇరాన్ పరిశీలిస్తున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఇరు వర్గాలు 45 రోజుల పాటు కాల్పుల విరమణ పాటించేలా ముసాయిదా ప్లాన్‌ను మధ్యవర్తులు సిద్ధం చేసినట్టు మీడియా సంస్థ యాక్సియోస్ (Axios) ఒక కథనాన్ని ప్రచురించింది. రెండు దశల్లో ఈ ప్లాన్‌ను అమలు చేసేలా ప్రణాళికలు రెడీ అయినట్టు పేర్కొంది.
ఇరు దేశాల మధ్య రాజీ కుదిర్చేందుకు పాకిస్థాన్, ఈజిప్టు, తుర్కియే, గల్ఫ్ దేశాలు ప్రయత్నాలు చేస్తున్నట్టు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, యూఎస్ ప్రత్యేక ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్‌తో పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ చర్చలు జరుపుతున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయని రాయిటర్స్ వార్తా సంస్థ ఓ కథనంలో పేర్కొంది. ఇరాన్ విదేశాంగ శాఖా మంత్రితో కూడా ఆసిమ్ మునీర్ కాల్పుల విరమణపై చర్చిస్తున్నట్టు పేర్కొంది. అయితే, కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా హోర్ముజ్‌ను తెరిచేందుకు ఇరాన్ సిద్ధంగా లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఒత్తిడులు, తుది గడువులను సహించేది లేదని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.
హోర్ముజ్ జలసంధి విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొదట్లో ఇరాన్‌కు ఏప్రిల్ 6ను డెడ్‌లైన్‌గా విధించారు. హోర్ముజ్‌ను తెరవకపోతే ఇరాన్‌లో నరకం కనిపిస్తుందని ఇష్టారీతిన తిడుతూ డెడ్‌లైన్‌కు ఒక రోజు ముందు ట్రంప్ ఓ పోస్టు పెట్టారు. ఈ తుది గడువును మరో 20 గంటల మేర పొడిగిస్తున్నట్టు తాజాగా ట్రంప్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో 45 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదన తాజాగా తెరపైకి వచ్చింది.
ఈ వార్తలను చదవండి:
ఇరాన్‌కు మరో గట్టి దెబ్బ... ఐఆర్‌జీసీ ఇంటెలిజెన్స్ చీఫ్ హతం
యుద్ధాన్ని ఆపేందుకు చివరి ప్రయత్నం.. 45 రోజుల కాల్పుల విరమణ దిశగా మధ్యవర్తుల చర్చలు!