ఇరాన్‌కు మరో గట్టి దెబ్బ... ఐఆర్‌జీసీ ఇంటెలిజెన్స్ చీఫ్ హతం
ABN , Publish Date - Apr 06 , 2026 | 02:54 PM
ట్రంప్ బెదిరింపుల వేళ ఇరాన్‌కు మరో గట్టిదెబ్బ తగిలింది. అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన తాజా దాడుల్లో ఇరాన్ పారామిలిటరీ రివల్యూషనరీ గార్డ్స్ ఇంటెలిజెన్స్ చీఫ్ మజీద్ ఖాదేమీ మరణించారు.
టెహ్రాన్: ట్రంప్ బెదిరింపుల వేళ ఇరాన్‌కు మరో గట్టిదెబ్బ తగిలింది. అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన తాజా దాడుల్లో ఇరాన్ పారామిలిటరీ రివల్యూషనరీ గార్డ్స్(IRGC) ఇంటెలిజెన్స్ చీఫ్ మజీద్ ఖాదేమీ మరణించారు. ఈ విషయాన్ని ఐఆర్‌జీసీ ధ్రువీకరించింది. అయితే ఆయన ఎక్కడ హతమయ్యాడనేది వెల్లడించలేదు. టెహ్రాన్‌లోని నివాస ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని సోమవారం ఉదయం ఈ దాడులు చోటుచేసుకున్నాయి.
అమెరికన్-జియోనిస్ట్ శత్రువు తెల్లవారుజామున జరిపిన క్రిమినల్ టెర్రరిస్ట్ దాడిలో తమ ఇంటెలిజెన్స్ చీఫ్ మేజర్ జనరల్ మజీద్ ఖాదేమీ మరణించారని, ఆయన తన ఇంటెలిజెన్స్ విభాగంలో కీలక వ్యక్తి అని ఐఆర్‌జీసీ వెల్లడించింది. గత ఏడాది జూన్ 12న ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో జనరల్ మమహ్మద్ కజేమీ మరణించడంతో ఆయన స్థానంలో మజీద్ ఖాదేమీ బాధ్యతలు చేపట్టారు.
25 మంది మృతి
ఇజ్రాయెల్-అమెరికా సోమవారంనాడు జరిపిన భారీ దాడుల్లో 25 మందికి పైగా మరణించారు. ప్రతిగా ఇజ్రాయెల్, గల్భ్ అరబ్ పొరుగుదేశాలపై ఇరాన్ క్షిపణి దాడులు జరిపింది. ఫిబ్రవరి 28 ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులు ప్రారంభించడంతో ఆ దాడుల్లో ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించారు. అనంతరం ఇరాన్ అత్యున్నత భద్రతాధికారి అలీ లారీజాన్ మరణం ఇరాన్‌కు మరో గట్టిదెబ్బ అయింది. మార్చి 17న నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ చీఫ్, ఆయన కుటుంబ సభ్యులను అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త బలగాలు మట్టుబెట్టాయి. అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తీవ్రమైంది. ఈనెల 6లోగా హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవాలని, లేదంటే ఇరాన్‌ను సర్వనాశనం చేస్తామని ట్రంప్ డెడ్‌లైన్ విధించారు. గడువు ముగుస్తుండటంతో ఇదే చివరి అవకాశం అంటూ ట్రంప్ మరో రోజు గడువును పొడిగిస్తున్నట్టు తాజాగా ప్రకటించారు.
ఇవి కూడా చదవండి..
యుద్ధాన్ని ఆపేందుకు చివరి ప్రయత్నం.. 45 రోజుల కాల్పుల విరమణ దిశగా మధ్యవర్తుల చర్చలు!
ఇరాన్‌కు గడువు పొడిగిస్తూ ట్రంప్ తాజా నిర్ణయం