హోర్ముజ్ కాదు..నరకానికి గేట్లు తెరుస్తాం
ABN , Publish Date - Apr 06 , 2026 | 04:07 AM
ఒప్పందానికి వచ్చి, హోర్ముజ్ జలసంధిని తెరవకపోతే ఇరాన్‌ను నాశనం చేస్తానన్న ట్రంప్ హెచ్చరికలపై ఇరాన్ ఘాటుగా స్పందించింది...
ట్రంప్ హెచ్చరికలు మతితప్పిన మూర్ఖపు వ్యాఖ్యలు: ఇరాన్
దుబాయ్/న్యూఢిల్లీ, ఏప్రిల్ 5: ఒప్పందానికి వచ్చి, హోర్ముజ్ జలసంధిని తెరవకపోతే ఇరాన్‌ను నాశనం చేస్తానన్న ట్రంప్ హెచ్చరికలపై ఇరాన్ ఘాటుగా స్పందించింది. హోర్ముజ్ జలసంధిని కాదని.. శత్రువుల కోసం నరకానికి గేట్లు తెరుస్తామని హెచ్చరించింది. ట్రంప్ హెచ్చరికలు పూర్తిగా నిస్సహాయ, మతితప్పిన మూర్ఖపు వ్యాఖ్యలని మండిపడింది. ఈ మేరకు ఇరాన్ అత్యున్నత రక్షణ విభాగం ‘ఖాతమ్ అల్ అన్బియా కేంద్ర ప్రధాన కార్యాలయం’ ప్రతినిధి ఇబ్రహీం జోల్ఫఘారి మాట్లాడుతున్న దృశ్యాలను ఇరాన్ వార్తా సంస్థలు ప్రసారం చేశాయి. అమెరికా పైలట్‌ను రెస్క్యూ చేయడానికి చేపట్టిన ఆపరేషన్ పూర్తిగా ఫెయిలైందని జోల్ఫఘారి పేర్కొన్నారు. తమ రెండో పైలట్‌ను కూడా విజయవంతంగా రక్షించామన్న ట్రంప్ ప్రకటనను ఖండించారు. అమెరికా పైలట్‌ను పట్టుకున్నారా, ఇంకా గాలిస్తున్నారా అన్న వివరాలు మాత్రం వెల్లడించలేదు. అయితే రెస్క్యూ ఆపరేషన్ కోసం వచ్చిన అమెరికా బలగాలపై తీవ్రస్థాయిలో దాడులు చేశామని తెలిపారు. ఇస్ఫహాన్ దక్షిణ ప్రాంతంలో వినియోగంలో లేని ఒక విమానాశ్రయం వేదికగా అమెరికా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిందని, దాన్ని పూర్తిగా అడ్డుకున్నామని వెల్లడించారు. అమెరికాకు చెందిన రెండు సీ-130 మిలిటరీ రవాణా విమానాలు, రెండు బ్లాక్ హాక్ హెలికాప్టర్లను కూల్చివేశామని తెలిపారు. ట్రంప్ వ్యాఖ్యలన్నీ డొల్ల మాటలని, దృష్టి మళ్లించే ప్రయత్నాలని చెప్పారు. ఎడారి ప్రాంతంలో దట్టంగా వెలువడుతున్న పొగలు, విమాన శకలాలకు సంబంధించిన వీడియోలను ఇరాన్ వార్తా సంస్థలు ప్రసారం చేశాయి. పరస్పర దాడుల్లో ఐదుగురు ఇరాన్ వాసులు మరణించారని తెలిపాయి. ఇక ఇస్ఫహాన్ ప్రావిన్స్‌లో మరో రెండు అమెరికన్ ఎంక్యూ-9 రీపర్ డ్రోన్లను, ఇజ్రాయెల్‌కు చెందిన పలు హెర్మెస్ 900 డ్రోన్లను కూడా కూల్చివేసినట్టు ఐఆర్‌జీసీ వెల్లడించింది.
అమెరికా, ఇజ్రాయెల్‌లకు సర్‌ప్రైజ్ ఇస్తాం
అమెరికా, ఇజ్రాయెల్‌ల కోసం పెద్ద సర్‌ప్రైజ్ సిద్ధంగా ఉందని ఇరాన్ కీలక భద్రతాధికారిని ఉటంకిస్తూ ఫార్స్ న్యూస్ కథనం ప్రసారం చేసింది. తమ యుద్ధం ప్రణాళిక ప్రకారం కొనసాగుతోందని, అమెరికా లక్ష్యాలు మాత్రం తప్పుగా ఉన్నాయని ఆ అధికారి పేర్కొన్నారు. ఇరాన్‌లో వంతెనలు పేల్చేస్తామన్న ట్రంప్ వ్యాఖ్యలు హాస్యాస్పదమని, అమెరికా సైనిక చర్యలు విఫలమవడంచీతోనే అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. ఈ అసమాన యుద్ధంలో శత్రువును ఎలా అలసటకు గురిచేయాలో తమకు బాగా తెలుసని చెప్పారు. కాగా టెహ్రాన్‌పై అమెరికా చేసిన వైమానిక దాడిలో ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ కమాండర్ జనరల్ మసౌద్ జారే మృతిచెందినట్టు మెహెర్ వార్తా సంస్థ వెల్లడించింది.
ఇజ్రాయెల్‌లో డ్రోన్ ఫ్యాక్టరీ ధ్వంసం
ఆదివారం ఇజ్రాయెల్‌పైకి పెద్ద సంఖ్యలో క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్ విరుచుకుపడింది. పెటా టిక్వా ప్రాంతంలో ఏరో సోల్ ఏవియేషన్ సంస్థకు చెందిన డ్రోన్ తయారీ ఫ్యాక్టరీ ధ్వంసమైంది. పునరుద్ధరించేందుకు వీల్లేనంత స్థాయిలో ఫ్యాక్టరీ దెబ్బతిన్నదని ఆ సంస్థ అధికారులను ఉటంకిస్తూ వైనెట్ న్యూస్ వార్తా సంస్థ కథనం ప్రసారం చేసింది. ఇజ్రాయెల్ మిలిటరీకి, రక్షణ రంగ పరిశ్రమలకు అవసరమైన డ్రోన్లు, బాంబుల తయారీకి అవసరమైన విడిభాగాలు, పైలట్ హెల్మెట్లు, ఇతర ఉత్పత్తులను ఏరోసోల్ సంస్థ సరఫరా చేస్తుందని వెల్లడించింది. ఆదివారం రాత్రి జరిగిన ఇరాన్ క్షిపణి దాడిలో ఇజ్రాయెల్‌లోని హైఫాలో పలు భవనాలు దెబ్బతిన్నాయి. దుబాయ్‌లోని జబెల్ అలీ పోర్టుకు సమీపంలో ఇజ్రాయెల్‌కు చెందిన నౌకపై ఇరాన్ క్షిపణి దాడి చేసినట్టు ఐఆర్‌జీసీ వెల్లడించింది. దీంతో నౌకలో మంటలు అంటుకున్నాయి. ప్రాణనష్టం వివరాలు తెలియలేదు. కువైట్‌కు చెందిన బుబియాన్ దీవిలో అమెరికా స్థావరంపై డ్రోన్ దాడులు జరిగాయి. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి.

ట్రంప్ అమెరికాను నరకంగా మార్చారు: గలీబఫ్
ట్రంప్ నిర్లక్ష్యపు చర్యలు అమెరికాను ఆ దేశ ప్రజలకు సజీవ నరకంగా మార్చేస్తున్నాయని ఇరాన్ పార్లమెంటు స్పీకర్ గలీబఫ్ విమర్శించారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆదేశాలను అమలు చేస్తూ ట్రంప్ మొత్తం పశ్చిమాసియా తగలబడటానికి కారణమవుతున్నారని మండిపడ్డారు. యుద్ధ నేరాలకు పాల్పడి పొందగలిగేది ఏమీ లేదని, తప్పు చేయవద్దని సూచించారు. ఇరాన్ ప్రజల హక్కులను గౌరవిస్తూ ఈ ప్రమాదకర యుద్ధాన్ని ముగించడమే ప్రస్తుతమున్న పరిష్కారమని స్పష్టం చేశారు. కాగా, యుద్ధంలో ఇరాన్‌కు జరిగిన నష్టానికి శత్రుదేశాలు పరిహారం చెల్లించాల్సిందేనని, ఆ తర్వాతే హోర్ముజ్ జలసంధిని తెరుస్తామని ఇరాన్ అధ్యక్ష కార్యాలయం పేర్కొంది.