Share News

భారత్ ఆందోళనను అర్థం చేసుకున్నాము: యూఎస్ మంత్రి రూబియో

ABN , Publish Date - Oct 22 , 2026 | 06:04 PM

ఉగ్రవాదం విషయంలో తాము భారత్ ఆందోళనను అర్థం చేసుకున్నామని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో తెలిపారు.

భారత్ ఆందోళనను అర్థం చేసుకున్నాము: యూఎస్ మంత్రి రూబియో
Marco Rubio

ఇంటర్నెట్ డెస్క్: ఉగ్రవాదం విషయంలో తాము భారత్ ఆందోళనను అర్థం చేసుకున్నామని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో తెలిపారు. ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్న ఆయన జాతీయ మీడియాకు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదంపై భారత్‌ వ్యక్తం చేస్తున్న ఆందోళన తమకూ ఉందని అన్నారు. భారత్‌ను కాదనుకుని పాక్‌కు దగ్గరయ్యే ప్రశ్నే లేదని చెప్పారు.


పాక్ సహా అన్ని దేశాలతో సంబంధాలు నెరపాల్సిన అవసరం అమెరికాకు ఉందని మంత్రి రూబియో పేర్కొన్నారు. దౌత్యబంధాల్ని కొనసాగించడం ద్వారా పాక్‌ నిర్ణయాలను కొంత ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. దాయాది దేశాల దౌత్యంతో ఘర్షణలు తీవ్రరూపం దాల్చకుండా అడ్డుకునే అవకాశం ఉందని చెప్పారు. భారత్‌-అమెరికా మధ్య దీర్ఘకాలిక బంధం ఉందని అన్నారు. పాక్‌తో దౌత్యబంధం ఇటీవల కాలంలో కొంత మెరుగైందని చెప్పారు. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు అమెరికా సిద్ధంగానే ఉందని అన్నారు.


ఇరు దేశాల మధ్య యుద్ధం జరగడం అమెరికాకు ఇష్టం లేదని మంత్రి రూబియో చెప్పారు. రెండు దేశాలు అభివృద్ధి, వాణిజ్యంపై దృష్టి పెట్టాలని కోరారు. అమెరికా కూడా ఉగ్రవాదం బారిన పడిందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా టెర్రరిస్టుల ఆటకట్టించేందుకు పలు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. మిగతాదేశాలన్నిటికంటే తీవ్రంగా ఉగ్రవాదంపై అమెరికా పోరాడుతోందని అన్నారు. ఆఫ్రికాలోని టెర్రరిస్టు గ్రూపులపై తీసుకున్న చర్యల గురించి ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఉగ్రవాద కట్టడి కోసం తమ నిబద్ధతను ఇప్పటికే పలుమార్లు చాటుకున్నామని చెప్పారు.


ఈ వార్తలనూ చదవండి:

సౌదీ ఎయిర్‌‌పోర్టుపై దాడి.. మృతుల్లో భారతీయుడు

సముద్రం పేరు మారుస్తానంటే.. పిచాయ్ నో చెప్పారు: ట్రంప్

Updated Date - Oct 22 , 2026 | 06:20 PM