సముద్రం పేరు మారుస్తానంటే.. పిచాయ్ నో చెప్పారు: ట్రంప్
ABN , Publish Date - Oct 22 , 2026 | 03:21 PM
అట్లాంటిక్ మహాసముద్రం పేరు మార్పునకు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అస్సలు అంగీకరించలేదని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: అట్లాంటిక్ మహాసముద్రం పేరు మార్పునకు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అస్సలు అంగీకరించలేదని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా తెలిపారు. ‘నేను పేరు మారుద్దామని అన్నాను.. ఆయనేమో వద్ద వద్దు.. ఈసారి నా వల్ల కాదని అన్నారు’ అని ఇటీవల టెన్నిస్సీ రాష్ట్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో ట్రంప్ తెలిపారు. ‘సర్.. సముద్రాల వ్యవహారం వేరు. అవి చాలా దేశాలతో ముడిపడి ఉంటాయి. దయచేసి అలా చేయాలని మాత్రం అనొద్దు’ అని పిచాచ్ చెప్పినట్టు వివరించారు. పదవిలోంచి దిగిపోయే లోపు అట్లాంటిక్ మహాసముద్రం పేరును అమెరికా సముద్రంగా మార్చాలని యూఎస్ అధ్యక్షుడు ఉవ్విళ్లూరుతున్న విషయం తెలిసిందే.
ఏదైనా సముద్రానికి అమెరికా పేరు ఉంటే బాగుంటుందని ఎవరో తనకు సూచించినట్టు ట్రంప్ చెప్పుకొచ్చారు. ‘గల్ఫ్ (గల్ఫ్ ఆఫ్ మెక్సికో) పేరును మార్చాం. సరస్సు (ఓంటారియో) పేరును కూడా మార్చుకున్నాము. ఏదైనా నదికి కూడా అమెరికా పేరు పెట్టాలని ఎవరో సూచించారు. దాంతో పాటు సముద్రం పేరు మార్చాలని కూడా అన్నారు. ట్రంప్ సముద్రమని పిలిస్తే బాగుంటుందని నాకు అనిపించింది’ అంటూ సరదాగా వ్యాఖ్యానించారు.
ఇటీవలే గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును ట్రంప్ గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చిన విషయం తెలిసిందే. కెనడాతో సరిహద్దుగా ఉన్న ఓంటారియో సరస్సును కూడా అమెరికా సరస్సుగా మార్చేశారు. ట్రంప్ ఆదేశాల మేరకు గూగుల్ మ్యాప్స్‌లో లేక్ ఓంటారియో పేరు లేక్ అమెరికాగా మారింది.
అయితే, ఈ మార్పు కేవలం అమెరికన్ గూగుల్ మ్యాప్స్‌లో మాత్రమే కనిపిస్తుందని చెప్పింది. కెనడా వాసులకు మాత్రం లేక్ ఓంటారియోగానే ఉంటుందని పేర్కొంది. ఇతర దేశాల వారికి మాత్రం ఓంటారియో పేరు పక్కన లేక్ అమెరికా పేరు బ్రాకెట్స్‌లో కనిపిస్తుందని గూగుల్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ వార్తలనూ చదవండి:
అవి మూర్ఖపు వ్యాఖ్యలు.. ట్రంప్‌పై ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ఆగ్రహం..
లాడెన్‌ను గుర్తించిన పాకిస్థాన్‌లోనే దావూద్ ఇబ్రహీం కూడా ఉన్నాడు: ఐరాసలో భారత్