Share News

భార్యను చంపిన యూఎస్ మాజీ లెఫ్టెనెంట్ గవర్నర్.. ఆపై ఆత్మహత్య

ABN , Publish Date - Apr 17 , 2026 | 09:25 AM

వర్జీనియా రాష్ట్ర (అమెరికా) మాజీ లెఫ్టెనెంట్ గవర్నర్ జస్టిన్ ఫెయిర్‌ఫాక్స్ తన భార్యను చంపి ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్నారు. భార్యాభర్తల మధ్య డైవర్స్ కేసు నడుస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

భార్యను చంపిన యూఎస్ మాజీ లెఫ్టెనెంట్ గవర్నర్.. ఆపై ఆత్మహత్య
Justin Fairfax

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో తాజాగా షాకింగ్ ఉదంతం వెలుగు చూసింది. వర్జీనియా మాజీ లెఫ్టెనెంట్ గవర్నర్, డెమాక్రటిక్ పార్టీ నేత జస్టిన్ ఫెయిర్‌ఫాక్స్ (47) తన భార్యను (49) కాల్చి చంపి ఆపై తానూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. భార్యాభర్తల మధ్య డైవర్స్ కేసు నడుస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో వారి సంతానం ఇంట్లోనే ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

స్థానిక మీడియా కథనాల ప్రకారం, కొంతకాలంగా జస్టిన్ తన కెరీర్‌లో తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నారు. 2017లో ఆయన రాష్ట్ర లెఫ్టెనెంట్ గవర్నర్ అయ్యారు. గవర్నర్ కూడా అవుతారని అంతా భావించారు. ఆ తరువాత జస్టిన్‌పై లైంగిక ఆరోపణలు వచ్చాయి. తాము పరస్పర అంగీకారంతోనే దగ్గరయ్యామమని ఫెయిర్‌ఫాక్స్ స్పష్టం చేసినా కెరీర్‌పై తీవ్ర ప్రభావం పడింది. పార్టీలో ప్రతికూలత కారణంగా 2021 గవర్నర్ పోటీ నుంచి ఆదిలోనే తప్పుకోవాల్సి వచ్చింది.


అప్పటికే తమ మధ్య విభేదాలు మొదలయ్యాయని ఆయన భార్య సెరీనా ఫెయిర్‌ఫాక్స్ పేర్కొన్నారు. ఒకే ఇంట్లో ఉంటున్నా విడిగా ఉండేవారమని కోర్టుకు తెలిపారు. జస్టిన్ నిత్యం మద్యం సేవిస్తూ ఉంటారని భార్య పేర్కొన్నారు. ఈ క్రమంలో కోర్టు జస్టిన్‌ను ఇంటిని వీడాలని ఆదేశించింది. ఏప్రిల్ నెలాఖరు వరకూ గడువు ఇచ్చింది. అయితే, జస్టిన్ గురువారం రాత్రి తమ ఇంటి బేస్‌మెంట్‌లో భార్యపై కాల్పులు జరపడంతో ఆమె కన్నుమూశారు. ఆ తరువాత తన బెడ్‌ రూమ్‌లోకి వెళ్లి తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు.


ఈ వార్తలనూ చదవండి:

అందుకు ఇరాన్ ఒప్పుకుంది.. త్వరలో మా మధ్య డీల్: ట్రంప్

ఇజ్రాయెల్‌-లెబనాన్‌ మధ్య కాల్పుల విరమణ

Updated Date - Apr 17 , 2026 | 10:04 AM