ఇజ్రాయెల్ ఒత్తిడితో.. ట్రంప్‌తప్పుదారి పట్టారు
ABN , Publish Date - Mar 18 , 2026 | 04:13 AM
ఇరాన్‌తో అమెరికాకు ఎలాంటి తక్షణ ముప్పు లేదని.. ఇజ్రాయెల్‌తోపాటు అమెరికాలోని ఆ దేశ లాబీ ఒత్తిడితోనే యుద్ధాన్ని ప్రారంభించినట్టు స్పష్టంగా అర్థమవుతోందని అమెరికా జాతీయ ఉగ్రవాద నిరోధక కేంద్రం.....
ఇరాన్‌తో అమెరికాకు తక్షణ ముప్పేమీ లేదు
ఇజ్రాయెల్, అమెరికాలోని లాబీ ముప్పు ఉన్నట్లు మిమ్మల్ని నమ్మించింది
ఇంతకుముందు ఇరాక్‌పై యుద్ధానికి అమెరికాను ఇలాగే లాగారు
మనం మళ్లీ ఆ తప్పు చేయొద్దు.. మీరు తగిన నిర్ణయం తీసుకోవాలి
ఇరాన్‌పై యుద్ధానికి మనస్సాక్షి ఒప్పుకోవడం లేదు.. రాజీనామా చేస్తున్నా
ట్రంప్‌కు అమెరికా ఉగ్రవాద నిరోధక కేంద్రం డైరెక్టర్ జో కెంట్ లేఖ
కెంట్ బలహీనుడు.. నా ప్రభుత్వం నుంచి వెళ్లిపోవడం మంచిదే
మాకు ఎవరి సాయం అవసరం లేదు.. ఒంటరిగానే ముందుకెళ్తాం
హోర్ముజ్ జలసంధి అంశంలో నాటో దేశాల వైఖరిపై ట్రంప్ వ్యాఖ్యలు
వాషింగ్టన్, మార్చి 17: ఇరాన్‌తో అమెరికాకు ఎలాంటి తక్షణ ముప్పు లేదని.. ఇజ్రాయెల్‌తోపాటు అమెరికాలోని ఆ దేశ లాబీ ఒత్తిడితోనే యుద్ధాన్ని ప్రారంభించినట్టు స్పష్టంగా అర్థమవుతోందని అమెరికా జాతీయ ఉగ్రవాద నిరోధక కేంద్రం (ఎన్‌సీటీసీ) డైరెక్టర్ జో కెంట్ పేర్కొన్నారు. ఇరాన్‌పై యుద్ధానికి మద్దతివ్వడానికి తన మనస్సాక్షి అంగీకరించడం లేదని, బాగా ఆలోచించిన తర్వాత తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. ఈ మేరకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మంగళవారం జో కెంట్ లేఖ రాశారు. దీనికి సంబంధించి ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు. ‘‘2016, 2020, 2024 అధ్యక్ష ఎన్నికల సమయంలో మీరు ప్రచారం చేసిన విలువలు, విదేశాంగ విధానాలకు నేను మద్దతు ఇచ్చాను. మీ మొదటి టర్మ్‌లో వాటన్నింటినీ అమలు చేశారు. పశ్చిమాసియాలో యుద్ధాలు అమెరికా ప్రజల విలువైన ప్రాణాలకు, ఖజానాకు, జాతీయ సమగ్రతకు గండికొడతాయని గుర్తించారు. అమెరికా సైనిక శక్తిని మెరుగ్గా, నిర్ణయాత్మకంగా ఎలా ఉపయోగించాలో, అంతంలేని యుద్ధాల్లోకి అమెరికాను లాగకుండా ఎలా వ్యవహరించాలనే దానిపై ఇంతకుముందటి అధ్యక్షులకన్నా మెరుగ్గా వ్యవహరించారు. ఐసి్‌సను ఓడించి, సోలమానిని చంపి ఈ విధానం సరైనదని నిరూపించారు. కానీ 2025 జూన్ తర్వాత పరిస్థితి మారిపోయింది. ఇజ్రాయెల్ అత్యున్నత అధికారులు, అమెరికా మీడియాలోని ప్రభావశీల వ్యక్తులు కలిసి అధ్యక్షుడిని తప్పుదారి పట్టించే ప్రచారం నడిపారు. ‘అమెరికా ఫస్ట్’ అనే మీ విధానాన్ని పూర్తిగా దెబ్బతీసి.. ఇరాన్‌పై యుద్ధానికి వెళ్లేలా సెంటిమెంట్లను నాటారు. ఇరాన్‌తో అమెరికాకు తక్షణ ముప్పు ఉందని, వెంటనే దాడికి దిగితే వేగంగా విజయం సాధించవచ్చని ఈ ఎకో చాంబర్ ద్వారా మిమ్మల్ని నమ్మించారు. గతంలో వేలాది మంది మన ప్రజలను కోల్పోయిన దారుణ ఇరాక్ యుద్ధం నాటి తరహాలో ఇప్పుడు కూడా అమెరికాను యుద్ధంలోకి లాగడానికి ఇజ్రాయెల్ పన్నిన వ్యూహం అది.
మనం ఆ తప్పు మళ్లీ చేయొద్దు. ఈ యుద్ధం అమెరికాకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చదు. మీరు మార్గం మార్చాలి. దేశానికి కొత్త దారి చూపాలి. నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది’’ అని ట్రంప్‌ను జో కెంట్ అభ్యర్థించారు. విదేశాల్లో రహస్యంగా ప్రత్యేక ఆపరేషన్లు చేసే ‘గ్రీన్ బ్యారెట్’ స్పెషల్ ఫోర్స్‌లో, ఆ తర్వాత అమెరికా నిఘా సంస్థ ‘సీఐఏ’లో పనిచేశారు. పశ్చిమాసియాలో జరిగిన ఆపరేషన్లలో 11 సార్లు పాల్గొన్నారు. సిరియాపై జరిగిన సైనిక చర్య సమయంలో తన భార్యను కోల్పోయారు. అయితే జో కెంట్ తొలి నుంచీ ట్రంప్‌కు గట్టి మద్దతుదారు.. గత ఏడాది జూలైలోనే ఎన్‌సీటీసీ డైరెక్టర్‌గా జో కెంట్‌ను ట్రంప్ నామినేట్ చేశారు.
జో కెంట్ బలహీనుడు: ట్రంప్
ఉగ్రవాద నిరోధక కేంద్రం డైరెక్టర్ పదవి జో కెంట్ జాతీయ భద్రత విషయంలో బలహీనుడని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విమర్శించారు. ‘‘ఆయన రాజీనామా లేఖను చూసినప్పుడు.. ఆయన బయటికి వెళ్లిపోవడం మంచిదేనని అనిపించింది. ఎందుకంటే ఇరాన్ నుంచి ముప్పు లేదని ఆయన పేర్కొన్నారు. అది తప్పు. ఇరాన్‌తో ఎంత ముప్పు ఉందని అన్ని దేశాలు గుర్తించాయి. ఆ ముప్పుపై చర్య తీసుకోవాలా వద్దా అన్నదే ఇక్కడ అసలు విషయం’’ అని ట్రంప్ పేర్కొన్నారు.
ట్రంప్‌కు మద్దతు కరువు!
ఇరాన్‌పై దాడులు, హోర్ముజ్ జలసంధి మూసివేత, దాన్ని తెరిచేందుకు ప్రపంచ దేశాలు యుద్ధ నౌకలను పంపాలన్న విజ్ఞప్తులు తదితర అంశాల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై వ్యతిరేకత పెరుగుతోంది. హోర్ముజ్ జలసంధిలో తమ ప్రజల ప్రాణాలను పణంగా పెట్టడానికి ఎవరూ సిద్ధంగా లేరని యూరోపియన్ యూనియన్ విదేశాంగ విభాగం చీఫ్ కాజా కల్లాస్ మంగళవారం స్పష్టం చేశారు. హోర్ముజ్ జలసంధిని తెరిచే ఎలాంటి ఆపరేషన్లలో ఫ్రాన్స్ భాగస్వామ్యం కాదని ఆ దేశ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మేక్రాన్ పేర్కొన్నారు. ఇరాన్‌పై దాడికి సంబంధించి అమెరికా, ఇజ్రాయెల్ తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని.. ఇప్పుడు ఆ ప్రాంతంలో మిలిటరీ చర్యలో తాము చేరే ఉద్దేశమేదీ లేదని కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్ పేర్కొన్నారు.