హెచ్-1బీ ప్రోగ్రామ్‌ను పూర్తిగా రద్దు చేయాలి: జేడీ వాన్స్
ABN , Publish Date - Oct 02 , 2026 | 10:08 AM
హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్ పూర్తిగా పాడైపోయిందని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తాజాగా చెప్పారు. ఈ ప్రోగ్రామ్ రద్దుకు తాను పూర్తి మద్దతు ఇస్తానని అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్ పూర్తిగా పాడైపోయిందని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తాజాగా చెప్పారు. ఈ ప్రోగ్రామ్ రద్దుకు తాను పూర్తి మద్దతు ఇస్తానని అన్నారు. అమెరికన్ వర్కర్లకు దక్కాల్సిన ఉద్యోగాలను హెచ్-1బీ వీసాల సాయంతో తక్కువేతనం తీసుకునే విదేశీయులతో భర్తీ చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
హెచ్-1బీ ప్రోగ్రామ్‌ను టెక్నాలజీ కంపెనీలతో పాటూ అకౌంటింగ్ సంస్థలు కూడా దుర్వినియోగపరుస్తున్నాయని అన్నారు. నిపుణులైన విదేశీ వర్కర్లను నియమించుకోవడం, అమెరికన్లను కాదని తక్కువ జీతంతో ఫారినర్లకు జాబ్ ఇవ్వడం మధ్య ఎంతో అంతరం ఉందని అన్నారు. ‘60 వేల డాలర్ల శాలరీ తీసుకునే అమెరికన్ వర్కర్‌ను తొలగించి అతడి స్థానంలో 45 వేల డాలర్ల వార్షిక శాలరీతో విదేశీయులను తీసుకుంటే అది విదేశీ నిపుణులకు జాబ్ ఇచ్చినట్టు కాదు. అది అమెరికన్ జనాలను మోసగించడం, అమెరికన్లకు జాబ్స్ దక్కకుండా చేయడం’ అని అన్నారు.
కొన్ని రకాల హెచ్-1బీ పిటిషన్లకు లక్ష డాలర్ల ఫీజును ఖరారు చేయడాన్ని కూడా వాన్స్ సమర్థించుకున్నారు. 2025లో ప్రవేశపెట్టిన ఈ ఫీజును ఈ ఏడాది సెప్టెంబర్‌లో ప్రభుత్వం మరోసారి పొడిగించింది. తక్కువ జీతానికి వచ్చే విదేశీయులకు జాబ్స్ దక్కకుండా అడ్డుకునేందుకు ఈ ఫీజు విధించామని వాన్స్ స్పష్టం చేశారు. ‘మీరు తక్కువ జీతంతో విదేశీయులకు జాబ్ ఇస్తామంటే లక్ష డాలర్ల ఫీజు చెల్లించాల్సిందే’ అని తేల్చి చెప్పారు.
ఈ వార్తలనూ చదవండి:
నా వల్లే ఆ రెండు దేశాలు ఇంకా మిగిలున్నాయి: డొనాల్డ్ ట్రంప్
అతను నన్ను చాలా సార్లు పొడిచాడు: పైలట్ స్మిత్ మచ్చార్