పాకిస్థాన్, ఖతార్‌లపై విరుచుకుపడిన అమెరికా సెనేటర్లు..
ABN , Publish Date - Jun 23 , 2026 | 11:53 AM
పాకిస్థాన్‌పై ప్రేమను వ్యక్తం చేస్తూ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇటీవల వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్థాన్, ఖతార్ దేశాలపై అమెరికాకు చెందిన ఇద్దరు రిపబ్లికన్ సెనేటర్లు రిక్ స్కాట్, టిమ్ షీహీ ఘాటుగా స్పందించారు.
ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్‌పై ప్రేమను వ్యక్తం చేస్తూ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇటీవల వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్థాన్, ఖతార్ దేశాలపై అమెరికాకు చెందిన ఇద్దరు రిపబ్లికన్ సెనేటర్లు రిక్ స్కాట్, టిమ్ షీహీ ఘాటుగా స్పందించారు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన చరిత్ర ఆ దేశాలకు ఉందంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాగా, అమెరికా- ఇరాన్ శాంతి ఒప్పందానికి సంబంధించిన సాంకేతిక వివరాలపై స్విట్జర్లాండ్‌లో ఇటీవల చర్చలు జరిగాయి. ఈ సమావేశానికి పాకిస్థాన్, ఖతార్ నాయకులతో వాన్స్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా 'మేము పాకిస్తాన్‌ను ప్రేమిస్తున్నాం' అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.
అయితే, ఈ చర్చల్లో పాకిస్థాన్, ఖతార్‌లను నిష్పక్షపాత మధ్యవర్తులుగా చూడకూడదని సెనేటర్ రిక్ స్కాట్ తేల్చి చెప్పారు. మధ్యప్రాచ్యంలో యూఏఈ, ఇజ్రాయెల్, సౌదీ అరేబియాలే వాషింగ్టన్‌కు నిజమైన మిత్రదేశాలని పేర్కొన్నారు. ఆ దేశాలనూ అమెరికా చర్చల్లో చేర్చుకోవాలని స్కాట్ సూచించారు. 'మన నిజమైన స్నేహితులు ఎవరో ఇప్పటికే అందరికీ స్పష్టంగా తెలిసి ఉండాలి. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన సుదీర్ఘ చరిత్ర ఖతార్, పాకిస్థాన్‌లకు ఉంది. ప్రస్తుతం వారు అర్థవంతమైన శాంతిని సాధించడం కంటే ఇరాన్ దశాబ్దాల నాటి ఉగ్రవాద ప్రచారాన్ని ప్రోత్సహించడానికే మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది. అందరికీ ప్రయోజనం చేకూర్చే ఆచరణీయమైన ఒప్పందానికి ఇంకా ఆస్కారం ఉంది' అని ఆయన చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా మోంటానా సెనేటర్ టిమ్ షీహీ కూడా పాకిస్థాన్‌ను విమర్శించారు. 'పాకిస్థాన్ ఒక దశాబ్దం పాటు బిన్ లాడెన్‌కు ఆశ్రయం ఇచ్చిందనే విషయాన్ని మనం మరిచిపోకూడదు. పాకిస్థానీలు ఐఎస్ఐ ద్వారా మాపై పోరాడే వారికి నిధులు సమకూర్చారు. ముఖ్యంగా అయతుల్లాకు నిధులు అందించారు. ఖతార్ కూడా దశాబ్దాలుగా ఉగ్రవాద సంస్థలకు మనీలాండరింగ్ ద్వారా డబ్బును అందిస్తోంది. ఇరాన్, అమెరికా- ఇజ్రాయెల్ శాంతి ఒప్పందంలో పాకిస్థాన్, ఖతార్‌లు పాల్గొంటే.. ఆ చర్చల్లో యూఏఈ, ఇజ్రాయెల్, సౌదీ అరేబియాలనూ చేర్చుకోవాలి. మధ్యప్రాచ్యంలో ఆ మూడు దేశాలే అమెరికాకు నిజమైన మిత్రదేశాలు' అని పేర్కొన్నారు. కాగా, వీరి వ్యాఖ్యలు ఇప్పటికే ఉన్న వివాదానికి మరింత ఆజ్యం పోసినట్లు అయ్యింది.
ఈ వార్తలు కూడా చదవండి
బ్రిటన్ ప్రధాని పదవికి స్టార్మర్ రాజీనామా
ఒప్పందం ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: డొనాల్డ్ ట్రంప్