Share News

బ్రిటన్‌ ప్రధాని పదవికి స్టార్మర్‌ రాజీనామా

ABN , Publish Date - Jun 23 , 2026 | 02:28 AM

బ్రిటన్‌ ప్రధాన మంత్రి, లేబర్‌ పార్టీ అధినేత కీర్‌ స్టార్మర్‌ తన పదవికి రాజీనామా చేశారు. సంచలనం సృష్టించిన ఎప్‌స్టీన్‌ లైంగిక నేరాల కుంభకోణం చివరకు స్టార్మర్‌ కుర్చీని లాగేసింది.

బ్రిటన్‌ ప్రధాని పదవికి స్టార్మర్‌ రాజీనామా

  • సొంత పార్టీ ఎంపీల తిరుగుబాటుతో గద్దె దిగిన కీర్‌ స్టార్మర్‌

  • పార్టీ నాయకత్వానికి గుడ్‌బై.. రెండేళ్లకే కుప్పకూలిన సర్కార్‌

  • బ్రిటన్‌ రాజకీయాలను కుదిపేసిన ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌ కుంభకోణం

  • ప్రధాని రేసులోకి ఆండీ బర్న్‌హమ్‌

లండన్‌, జూన్‌ 22: బ్రిటన్‌ ప్రధాన మంత్రి, లేబర్‌ పార్టీ అధినేత కీర్‌ స్టార్మర్‌ తన పదవికి రాజీనామా చేశారు. సంచలనం సృష్టించిన ఎప్‌స్టీన్‌ లైంగిక నేరాల కుంభకోణం చివరకు స్టార్మర్‌ కుర్చీని లాగేసింది. సొంతపార్టీ నేతల నుంచి వస్తున్న ఒత్తిడి, అంతర్గత తిరుగుబాటుకు తలొగ్గి సోమవారం ఆయన తన పదవికి రాజీనామా ప్రకటించారు. ప్రధాని పదవితో పాటు లేబర్‌ పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు స్పష్టం చేశారు. లండన్‌లోని 10 డౌనింగ్‌ స్ట్రీట్‌ వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. దేశ ప్రయోజనాల కోసమే తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. తన భార్య విక్టోరియాతో కలిసి వచ్చి స్టార్మర్‌.. కన్నీటి పర్యంతమవుతూ రాజీనామా ప్రకటన చేశారు. 2024లో జరిగిన ఎన్నికల్లో లేబర్‌ పార్టీని భారీ మెజార్టీతో అధికారంలోకి తెచ్చిన ఆయన.. రెండేళ్లు తిరక్కుండానే తీవ్ర ప్రజావ్యతిరేకతతో పదవి నుంచి తప్పుకోవాల్సి రావడం గమనార్హం. తన రాజీనామా నిర్ణయాన్ని బ్రిటన్‌ రాజు చార్లెస్‌కు ఇప్పటికే తెలియజేశానని, తదుపరి ప్రధాని ఎన్నికయ్యే వరకు ఆ పదవిలో కొనసాగుతానని చెప్పారు. గత రెండేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి, ద్రవ్యోల్బణాన్ని అధిగమించి వేతనాలు పెంచామని తన ప్రసంగంలో చెప్పుకొచ్చారు. ఈయూ నుంచి విడిపోవాలనే 2016 బ్రెగ్జిట్‌ ప్రజాభిప్రాయ సేకరణ జరిగిన తర్వాత దశాబ్ద కాలంలో బ్రిటన్‌ ప్రధాని పదవిని వదిలి పెట్టిన ఆరో నేతగా స్టార్మర్‌ నిలిచారు. కాగా, కొత్త నేత ఎంపిక ప్రక్రియ జూలై 9న ప్రారంభం కానుండగా, సెప్టెంబర్‌ కల్లా బ్రిటన్‌కు ఏడో కొత్త ప్రధాని రానున్నారు.


మండెల్సన్‌ నియామకమే శాపమా ?

మార్పు నినాదంతో అధికారంలోకి వచ్చిన కీర్‌ స్టార్మర్‌ ప్రభుత్వానికి మొదటి వంద రోజుల్లోనే కష్టాలు మొద లయ్యాయి. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టలేకపోవడం, ద్రవ్యోల్బణం వంటి కారణాలతో పాటు ప్రధానితో పాటు ఆయన కేబినెట్‌ మంత్రులు వేల పౌండ్ల విలువైన ఫుట్‌బాల్‌ టికెట్లు, విలాసవంతమైన బహుమతులు ఉచితంగా స్వీకరించారనే ఆరోపణలు రావడంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. స్టార్మర్‌ ఆ ఖర్చులను తిరిగి చెల్లించినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీనికి తోడు సంక్షేమ పథకాల్లో కోతలు, పన్నుల భారంతో.. బాధ్యతలు చేపట్టిన ఏడాదిలోనే ప్రజల్లో ప్రధాని మీద వ్యతిరేకత 73 శాతానికి చేరింది. బ్రిటన్‌ అంతర్గత వలసలు (ఇమ్మిగ్రేషన్‌), ఇంధన విధానాలపై ప్రభుత్వం తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలు ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని మిగిల్చాయి. ముఖ్యంగా ఎప్‌స్టీన్‌ లైంగిక కుంభకోణంతో సంబంధం ఉన్న లేబర్‌ పార్టీ సీనియర్‌ నేత పీటర్‌ మండెల్సన్‌ను అమెరికా రాయబారిగా నియమించడం తీవ్ర వివాదాస్పదమైంది. బ్రిటన్‌ ప్రభుత్వ రహస్యాలు ఎప్‌స్టీన్‌కు లీక్‌ చేశారన్న ఆరోపణలపై లండన్‌ పోలీసులు మండెల్సన్‌ను అరెస్ట్‌ చేశారు. దీంతో వచ్చే 2029 సార్వత్రిక ఎన్నికల్లో స్టార్మర్‌ నేతృత్వంలో వెళ్తే పార్టీ మునిగిపోవడం ఖాయమని తేలడంతో, దాదాపు 100మంది లేబర్‌ పార్టీ ఎంపీలు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. కాగా, ఇటీవల ముగిసిన స్థానిక సంస్థల ఎన్నికల్లో లేబర్‌ పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఇదే సమయంలో గ్రేటర్‌ మాంచెస్టర్‌ మాజీ మేయర్‌ ఆండీ బర్న్‌హమ్‌ మేకర్‌ఫీల్డ్‌ పార్లమెంటరీ ఉప ఎన్నికలో ఘనవిజయం సాధించడం స్టార్మర్‌ నిష్క్రమణను మరింత వేగవంతం చేసింది.


ప్రధాని రేసులో ‘కింగ్‌ ఆఫ్‌ ది నార్త్‌’ ఆండీ బర్న్‌హామ్‌

ప్రధానిగా కీర్‌ స్టార్మర్‌ వైదొలగడంతో, లేబర్‌ పార్టీ నుంచి ‘కింగ్‌ ఆఫ్‌ ది నార్త్‌’గా పేరొందిన ఆండీ బర్న్‌హమ్‌ తదుపరి ప్రధాని రేసులో ముందున్నారు. ఇంగ్లాండ్‌లోని మెర్సిడైస్‌లో జన్మించిన ఈ 56 ఏళ్ల నేత.. 2001లో లేబర్‌ పార్టీ తరపున తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. మాజీ ప్రధానులు టోనీబ్లెయిర్‌, గోర్డాన్‌ బ్రౌన్‌ ప్రభుత్వాల్లో కీలక మంత్రి పదవులు నిర్వహించారు. అయితే జాతీయ రాజకీయాలకంటే బ్రిటన్‌ ఉత్తరాది ప్రజల ప్రయోజనాల కోసం లండన్‌ పాలకులతో నిరంతరం పోరాడే వ్యక్తిగా ఆయన కు పేరుంది. 2010, 2015లలో లేబర్‌ పార్టీ అధ్యక్ష పదవికి పోటీ పడి ఓడిపోయిన అనంతరం.. 2017లో లండన్‌ రాజకీయాలను వదిలి గ్రేటర్‌ మాంచెస్టర్‌ తొలి మేయర్‌గా బాధ్యతలు స్వీకరించి సరికొత్త రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. మేయర్‌గా ఆండీ సాధించిన విజయాలు ఆయనను బ్రిటన్‌ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా నిలబెట్టాయి. ముఖ్యంగా కొవిడ్‌ సమయంలో ఉత్తరాది ప్రజలకు ఆర్థిక సాయం అందించే విషయంలో అప్పటి ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ప్రభుత్వంతో నేరుగా తలపడ్డారు. ఇటీవల జరిగిన మేకర్‌ఫీల్డ్‌ పార్లమెంటరీ స్థానం ఉప ఎన్నికలో అఖండ మెజార్టీతో గెలిచి పార్లమెంట్‌లోకి అడుగుపెట్టారు. ఈ గెలుపే స్టార్మర్‌ నాయకత్వానికి చరమగీతం పాడింది. స్టార్మర్‌ వైఫల్యాలు, ఎప్‌స్టీన్‌ కుంభకోణంతో లేబర్‌ పార్టీ కుదేలైన వేళ.. ఆండీ మాత్రమే పార్టీని కాపాడగలరని మెజార్టీ ఎంపీలు నమ్ముతున్నారు. స్టార్మర్‌ రాజీనామా చేసిన కొన్ని గంటల్లోనే తాను ప్రధాని రేసులో ఉన్నానని, బర్మ్‌హమ్‌ అధికారికంగా ప్రకటించారు.

Updated Date - Jun 23 , 2026 | 02:28 AM