మా లెక్కలు వేరు.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్
ABN , Publish Date - Apr 27 , 2026 | 05:06 PM
అమెరికా హెచ్చరికలపై ఇరాన్ ఘాటుగా స్పందించింది. తమ మౌలికవసతులపై దాడులు చేస్తే అంతకు నాలుగు రెట్ల నష్టం ప్రత్యర్థులకు జరుగుతుందని ఇరాన్ ఉపాధ్యక్షుడు ఇస్మాయిల్ సాహెబ్ ఇస్ఫహానీ హెచ్చరించారు.
ఇంటర్నెట్ డెస్క్: మూడు రోజుల్లో తమతో ఒప్పందం కుదుర్చుకోకపోతే చమురు పైప్‌లైన్లను పేల్చేస్తామంటూ హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ఇరాన్ గట్టి వార్నింగ్ ఇచ్చింది. అమెరికాకు మద్దతిస్తున్న గల్ఫ్ దేశాలకు కూడా కీలక హెచ్చరిక చేసింది. తమ మౌలికవసతులను టార్గెట్ చేస్తే తాము అంతకు నాలుగురెట్ల తీవ్రతతో విరుచుకుపడతామని ఇరాన్ ఉపాధ్యక్షుడు ఇస్మాయిల్ సాహెబ్ ఇస్ఫహానీ హెచ్చరించారు.
‘ఇలాంటి దాడులను తాము యుద్ధ చర్యలుగా పరిగణిస్తాము. అమెరికా దిగ్బంధనం కారణంగా మా చమురు బావులు సహా ఏ మౌలికవసతులు దెబ్బతిన్నా అమెరికాకు మద్దతిస్తున్న దేశాల్లో అంతకు నాలుగు రెట్ల నష్టం జరుగుతుంది. మా లెక్కలు వేరేగా ఉంటాయి. ఒక్క చమురు బావి నాలుగింటితో సమానం’ అంటూ తాము ఏం చేస్తామో స్పష్టంగా చెప్పేశారు. ఇదిలా ఉంటే, ఇరాన్‌పై నిరంతర ఒత్తిడితో దారికి తెచ్చుకునేలా ట్రంప్ ముందుకు సాగుతున్నారు. ముడి చమురు ఎగుమతులకు అడ్డంకులు సృష్టిస్తే ఇరాన్ దారికి వస్తుందని ఇప్పటికే తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో పలుమార్లు చెప్పారు.
ఈ వార్తలనూ చదవండి:
ట్రంప్ లాంటి ద్రోహిని, నేరస్థుడిని వదలకూడదు.. కాల్పులకు ముందు నిందితుడు ఏం రాశాడంటే..
కాల్పుల విరమణ, హోర్ముజ్, అణు కార్యక్రమం.. అమెరికాకు ఇరాన్ మూడు దశల ప్రతిపాదన..