Share News

యూఎస్‌తో నేరుగా చర్చలు ఉండవు: ఇరాన్

ABN , Publish Date - Apr 25 , 2026 | 09:11 AM

గల్ఫ్‌లో ఉద్రిక్తతలకు చెక్ పెట్టేలా నేడు పాక్‌లో మలివిడత చర్చలు ప్రారంభం కానున్నాయి. ఈ చర్చల కోసం ఇప్పటికే ఇరాన్ బృందం ఇస్లామాబాద్‌కు చేరుకుంది. అయితే, యూఎస్‌తో నేరుగా చర్చించేది లేదని ఇరాన్ స్పష్టం చేసింది.

యూఎస్‌తో నేరుగా చర్చలు ఉండవు: ఇరాన్
Islamabad negotiations

ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమాసియా ఉద్రిక్తతలకు చెక్ పెట్టే దిశగా నేడు పాక్‌లో మలివిడత చర్చలు ప్రారంభం కానున్నాయి. ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగ్జీ సారథ్యంలోని బృందం ఇప్పటికే ఇస్లామాబాద్‌కు చేరుకుంది. అమెరికా బృందం కూడా పాక్‌కు చేరుకోనుంది. అయితే, యూఎస్‌తో నేరుగా ఎలాంటి చర్చలు ఉండవని ఇరాన్ అధికారులు స్పష్టం చేశారు. పాక్ ద్వారానే చర్చలు జరుగుతాయని పేర్కొన్నారు.

తాము ఇరాన్ బృందానికి శుక్రవారం ఎయిర్‌పోర్టులో స్వాగతం పలుకుతున్న దృశ్యాలను పాక్ విదేశాంగ శాఖ మంత్రి ఇషాక్ దార్ నెట్టింట షేర్ చేశారు. ఆయనతో పాటు పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహిసీన్ నఖ్వీ కూడా ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రికి సాదర స్వాగతం పలికారు.

మలిదశ సమావేశాల్లో ఇరాన్ మంత్రి బాగ్జీ పాక్ ప్రధానితో పాటు ఆర్మీ చీఫ్‌తో కూడా సమావేశం కానున్నారు. అమెరికా ప్రారంభించిన యుద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టి, గల్ఫ్‌లో శాంతిని నెలకొల్పేలా మంత్రి అరాగ్చీ చర్చలు జరుపుతారని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి తెలిపారు.


యూఎస్ ప్రత్యేక ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, జేరెడ్ కుష్నర్ కూడా త్వరలో ఇస్లామాబాద్‌కు రానున్నారు. అయితే, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మాత్రం శాంతి చర్చలను వాషింగ్టన్ నుంచి పర్యవేక్షిస్తారు. ఈ విషయాన్ని శ్వేత సౌధం సెక్రటరీ కెరొలైన్ లెవిట్ వెల్లడించారు. ఇదిలా ఉంటే, తమ డిమాండ్స్‌కు అంగీకరించేందుకు ఇరాన్ సిద్ధమవుతోందని ట్రంప్ శుక్రవారం తెలిపారు. ‘వాళ్లు ఒక ఆఫర్ ఇచ్చారు.. తదుపరి ఏం జరుగుతుందో చూడాలి’ అని అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన అన్నారు. హోర్ముజ్ జలసంధి మూసివేత, అణు కార్యక్రమాల కొనసాగింపు విషయంలో ఇరాన్‌, యూఎస్ మధ్య పొసగని విషయం తెలిసిందే.


ఈ వార్తలనూ చదవండి:

అణు విద్యుదుత్పత్తి కోసం చైనాలో ఒకేసారి 50అణు రియాక్టర్ల నిర్మాణం!

ట్రంప్ వ్యాఖ్యలపై మండిపడిన ఇరాన్.. ఎక్స్ వేదికగా పోస్ట్

Updated Date - Apr 25 , 2026 | 09:29 AM