ఇరాన్‌పై యుద్ధం త్వరలోముగుస్తుంది
ABN , Publish Date - Mar 12 , 2026 | 04:42 AM
ఇరాన్‌పై యుద్ధం త్వరలోనే ముగుస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్‌లో లక్ష్యంగా చేసుకోవడానికి ఇక ఏమీ మిగల్లేదని చెప్పారు.
ఆ దేశంలో టార్గెట్ చేయడానికి ఇక ఏం లేదు
ఆరు వారాలనుకుంటే.. రెండు వారాల్లోపే సాధించాం.. మిగిలిన పని గంటలో ముగించగలం
నేను ఎప్పుడు అనుకుంటే.. అప్పుడు యుద్ధం ఆగిపోతుంది: అమెరికా అధ్యక్షుడు ట్రంప్
వ్యూహాత్మక యుద్ధానికి సిద్ధమైన ఇరాన్.. హోర్ముజ్ జలసంధిలో సముద్రపు మందుపాతరలు
గల్ఫ్‌లోని అమెరికా బ్యాంకులు, ఆర్థిక సేవల సంస్థల కార్యాలయాలే టార్గెట్‌గా చర్యలు
దుబాయ్ ఫైనాన్షియల్ సెంటర్‌లోని సిబ్బందిని ఖాళీ చేసిన సిటీగ్రూపు, మరో 2 సంస్థలు
దుబాయ్ ఎయిర్‌పోర్టు వద్ద ఇరాన్ డ్రోన్ దాడి.. ఓ భారతీయుడు సహా నలుగురికి గాయాలు
దుబాయ్ నుంచి భారత్‌కు వస్తున్న థాయ్ నౌకలో పేలుళ్లు.. ముగ్గురు భారత సిబ్బంది మృతి
వాణిజ్య నౌకలపై దాడులు ఆందోళనకరం: భారత్
దుబాయ్/వాషింగ్టన్/న్యూఢిల్లీ, మార్చి 11: ఇరాన్‌పై యుద్ధం త్వరలోనే ముగుస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్‌లో లక్ష్యంగా చేసుకోవడానికి ఇక ఏమీ మిగల్లేదని చెప్పారు. అమెరికాకు చెందిన యాక్సియోస్‌కు ఇచ్చిన ఫోన్ ఇంటర్వ్యూలో, వైట్‌హౌజ్ వద్ద మీడియాతో మాట్లాడుతూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై యుద్ధం బాగా సాగుతోందని, ఇరాన్ సైనిక సామర్థ్యానికి భారీ నష్టం కలిగిందని తెలిపారు. ‘‘నిజానికి యుద్ధం మేం అంచనా వేసుకున్నదానికంటే వేగంగా ముందుకు సాగుతోంది. ఆరు నెలలు పడుతుందనుకున్న అంచనాలను రెండు వారాల్లోపే సాధించాం. ఇరాన్ నౌకాదళం, గగనతల రక్షణ వ్యవస్థలు, క్షిపణులు, రాడార్లను నాశనం చేశాం. చాలా వరకు నాయకత్వం తుడిచిపెట్టుకుపోయింది. ఇంకా నాశనం చేయగలం. కానీ టార్గెట్ చేయడానికి ఇరాన్‌లో మిగిలినదేమీ లేదు. నేను ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఈ యుద్ధం ముగిసిపోతుంది’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇక చమురు సంస్థలు హోర్ముజ్ జలసంధిని ఉపయోగించుకోవచ్చని.. ఇరాన్ మైన్‌షి్‌పలన్నీ ధ్వంసం చేశామని పేర్కొన్నారు. తాము కొన్ని మౌలిక సదుపాయాలు, ఇతర లక్ష్యాలను కావాలనే వదిలేశామని.. కావాలనుకుంటే వాటిని తాము కొన్ని గంటల్లోనే నాశనం చేయగలమని పేర్కొన్నారు. అదే జరిగితే వారు ఇరాన్‌ను ఎన్నటికీ పునర్నిర్మించుకోలేరని హెచ్చరించారు. చమురు ధరల పెరుగుదలతో అంతర్జాతీయంగా వ్యక్తమవుతున్న వ్యతిరేకతతోపాటు అమెరికాలో త్వరలో చట్టసభలకు ఎన్నికలు ఉండటం, ఇటీవలి సర్వేల్లో యుద్ధం పట్ల చాలా మంది వ్యతిరేకతతో ఉన్నట్టు తేలడం వంటి అంశాల నేపథ్యంలో ట్రంప్ కాస్త వెనక్కి తగ్గుతున్నట్టు కనిపిస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే యుద్ధాన్ని ముగించే దిశగా ట్రంప్ వ్యాఖ్యలు ఉన్నా.. దాడులు నిలిపివేసే, తగ్గించే దిశగా ఎలాంటి ఆదేశాలూ లేవని అమెరికా రక్షణ వర్గాలు వెల్లడించాయి.

వ్యూహాత్మక యుద్ధం.. ఇరాన్ సిద్ధం!
తమపై యుద్ధానికి దిగిన అమెరికా, ఇజ్రాయెల్‌లను ముప్పుతిప్పలు పెట్టేలా వ్యూహాత్మక యుద్ధానికి ఇరాన్ సిద్ధమైంది. ఇప్పటికే చవకైన షహీద్ డ్రోన్లను ప్రయోగిస్తూ అమెరికా, ఇజ్రాయెల్, అరబ్ గల్ఫ్ దేశాలతో ఖరీదైన పేట్రియాట్, థాడ్ క్షిపణులను ఖర్చుచేయిస్తోంది. హోర్ముజ్ జలసంధిని మూసివేసి చమురు మంటలకు కారణమై ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఇకపై మరింత దూకుడుగా వ్యవహరించేందుకు సిద్ధమైంది. తన పాత ఆయుధమైన ‘సీమైన్స్ (సముద్రపు మందు పాతరలు)’ను హోర్ముజ్ జలసంధిలో అమర్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఆ ప్రాంతాలను దాటడానికి ప్రయత్నిస్తే సీమైన్స్ పేలి నౌకలు ధ్వంసమైపోతాయని హెచ్చరిస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్‌లకు చెందిన బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, టెక్ కంపెనీల డేటా సెంటర్లు, క్లౌడ్ ఆధారిత కార్యాలయాలపైనా దాడులకు సిద్ధమవుతోంది. ఇరాన్‌లో భూతల దాడులు చేసే ప్రతిపాదన ఉందన్న అమెరికా, ఇజ్రాయెల్‌ల ప్రకటన నేపథ్యంలో.. ఆ దేశాల సైన్యాలకు చుక్కలు చూపించేలా గెరిల్లా దాడులకు ఐఆర్‌జీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ‘ప్లాన్ సి’గా పేర్కొంటున్న ఈ వ్యూహం ప్రకారం.. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోని దళాలకు మెషీన్ గన్‌లు, అసాల్ట్ రైఫిల్స్, రాకెట్ లాంచర్లు, ఇతర ఆయుధాలను అందజేసినట్టు ఐఆర్‌జీసీ వర్గాలు వెల్లడించాయి. గెరిల్లా దాడులు, ఆత్మాహుతి బాంబర్లు వంటివి చేపట్టనున్నట్టు పేర్కొన్నాయి. అధ్యక్షుడు పెజెష్కియాన్, సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి అలీ లరిజని దీనిని సమన్వయం చేస్తున్నారని తెలిపాయి.
చమురు నిల్వల విడుదలకు జర్మనీ సిద్ధం
హోర్ముజ్ జలసంధి స్తంభించిపోవడంతో పెరిగిపోయిన ముడి చమురు ధరలను స్థిరీకరించేందుకు, చమురు ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు వీలుగా అత్యవసర నిల్వలను విడుదల చేసేందుకు జర్మనీ, జపాన్, ఆస్ట్రియా సిద్ధమయ్యాయి. మొత్తంగా 400 మిలియన్ బ్యారెళ్ల చమురును మార్కెట్లోకి విడుదల చేయాలని తమ సభ్య దేశాలకు అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ) చేసిన విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయా దేశాల ప్రతినిధులు వెల్లడించారు.
పర్షియన్ గల్ఫ్‌లో 28 భారత నౌకలు
హోర్ముజ్ జలసంధి మూసివేతతో పర్షియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్ ప్రాంతాల్లో 28 భారత నౌకలు చిక్కుకుపోయాయని కేంద్ర నౌకా, జలరవాణా శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్‌కుమార్ సిన్హా బుధవారం వెల్లడించారు. వాటిలో 778 మంది సిబ్బంది ఉన్నారని తెలిపారు. పర్షియన్ గల్ఫ్‌లో చిక్కుకున్న 24 నౌకల్లో 677 మంది సిబ్బంది, గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో నిలిచిపోయిన 4 నౌకల్లో 101 మంది ఉన్నారని.. వారి భద్రతపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని వివరించారు.
దుబాయ్‌లో ఆర్థిక సంస్థల మూత!
అమెరికా, ఇజ్రాయెల్‌లపై ఒత్తిడి పెంచే క్రమంలో గల్ఫ్ దేశాల్లోని అమెరికా, ఇజ్రాయెల్‌ల టెక్ సంస్థలు, డేటా సెంటర్లు, బ్యాంకులు, ఆర్థిక సంస్థల కార్యాలయాలపై దాడులు చేస్తామని ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్స్ హెచ్చరించింది. ఇరాన్‌పై అమెరికా దాడికి సంబంధించి ఆయా సంస్థలకు కూడా పరోక్షంగా పాత్ర ఉందని పేర్కొంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలపై దాడులు చేస్తామన్న ఇరాన్ హెచ్చరికల నేపథ్యంలో దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్‌లో కార్యకలాపాలను సిటీగ్రూప్, మరో రెండు ఆర్థిక సేవల సంస్థలు బుధవారం నిలిపివేశాయి. ఆ సంస్థలు ముందు జాగ్రత్తగా తమ కార్యాలయాల్లోని సిబ్బందిని ఖాళీ చేయించినట్టు ఏఎ్‌ఫపీ వార్తాసంస్థ వెల్లడించింది.
దాడులపై వెనక్కి తగ్గని ఇరాన్..
ఇజ్రాయెల్‌పైకి ఇరాన్ బుధవారం మరో దఫా క్షిపణుల వర్షం కురిపించింది. కొన్ని క్షిపణులు ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలను దాటుకుని టెల్‌అవీవ్, జెరుసలేం, సెంట్రల్ ఇజ్రాయెల్ ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించాయి. ఇరాన్ క్షిపణులతో క్లస్టర్ బాంబులను ప్రయోగిస్తోందని, లక్ష్యాన్ని ఛేదించే ముందు అవి చిన్న బాంబులుగా విడిపోయి పౌర ఆవాసాలపై పడి, నష్టం కలిగిస్తున్నాయని ఇజ్రాయెల్ రక్షణ శాఖ పేర్కొంది. ఇజ్రాయెల్‌పైకి ఇరాన్ ప్రయోగించిన 300కుపైగా క్షిపణుల్లో సగానికిపైగా క్లస్టర్ బాంబు వార్‌హెడ్‌లు ఉన్నవేనని తెలిపింది.
దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో రెండు ఇరాన్ డ్రోన్లు పడి పేలుళ్లు సృష్టించాయి. ఈ ఘటనల్లో ఇద్దరు ఘనా జాతీయులు, ఒక బంగ్లాదేశీ, ఒక భారతీయుడు గాయపడ్డారని దుబాయ్ మీడియా ఆఫీసు తెలిపింది.
ఒమన్‌లోని సలాలాహ్ పోర్టులో చమురు నిల్వ ట్యాంకులపై ఇరాన్ డ్రోన్ దాడులు చేసింది. దీంతో పోర్టులో కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్టు ఒమాన్ ప్రకటించింది.
ఇరాన్‌తో జరుగుతున్న ఘర్షణల్లో మంగళవారం నాటికి 140 మంది తమ సైనికులు గాయపడ్డారని అమెరికా రక్షణ శాఖ వెల్లడించింది. కాగా, ఇరాన్ తమ దేశంలోని ప్రాంతాలపై దాడులు చేస్తున్న ప్రస్తుత తరుణంలో యుద్ధాన్ని ఆపేలా పశ్చిమ దేశాలతో మధ్యవర్తిత్వం వహించలేమని ఖతార్ ప్రకటించింది.
వాణిజ్య నౌకపై దాడి.. ముగ్గురు భారతీయులు మృతి
హోర్ముజ్ జలసంధి మీదుగా ప్రయాణిస్తున్న మూడు వాణిజ్య నౌకలపై ఇరాన్ బుధవారం దాడి చేసింది. మూడు నౌకల్లోనూ పేలుళ్లు జరిగి, మంటలు అంటుకున్నాయి. అందులో దుబాయ్ నుంచి భారత్‌లోని కాండ్లా పోర్టుకు వస్తున్న థాయిలాండ్ నౌక మయూరీ నారీపై జరిగిన దాడిలో ముగ్గురు భారతీయ సిబ్బంది మరణించారు. నౌకలో ఇంజన్ ప్రాంతంలో క్షిపణి దాడి జరగడంతో భారీ పేలుడు జరిగి, మంటలు అంటుకున్నాయి. ఇంజన్ గదిలో పనిచేస్తున్న ముగ్గురు చనిపోగా, మిగతా 20 మంది లైఫ్‌బోట్లతో బయటపడ్డారు. వారిని ఒమన్ నౌకాదళం రక్షించింది. ఇక హోర్ముజ్ జలసంధి మీదుగా ప్రయాణిస్తున్న బ్రిటన్ రవాణా నౌకలోనూ డ్రోన్ దాడితో పేలుడు జరిగి, మంటలు చెలరేగాయి. అందులోని సిబ్బందిని రక్షించామని యూకే మ్యారీటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ వెల్లడించింది. ఇక యూఏఈలోని రస్ అల్ ఖైమాకు సమీపంలో బ్రిటిష్ రవాణా నౌకపైనా దాడి జరిగిందని వెల్లడించింది. కాగా, మయూరీ నారీ నౌకపై జరిగిన దాడిని భారత్ ఖండించింది. వాణిజ్య నౌకలపై దాడులు ఆందోళనకరమంటూ విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. వాణిజ్య నౌకలపై సైనిక దాడులు దురదృష్టకరమని పేర్కొంది. వాణిజ్య నౌకలపై దాడులు, అమాయక సిబ్బంది ప్రాణాలను బలితీసుకోవడం సరికాదని వ్యాఖ్యానించింది. కాగా, మయూరీ నారీ నౌకపై దాడిలో ఇద్దరు భారతీయులు మృతిచెందారని, మరొకరి ఆచూకీ లభించలేదని, అతను మరణించి ఉండవచ్చని విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ తెలిపారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల్లో గాయపడిన భారతీయులకు తగిన వైద్యం అందేలా చూస్తున్నామని, వారితో ఆయా దేశాల్లో భారతీయ దౌత్యకార్యాలయాలు టచ్‌లో ఉన్నాయని వెల్లడించారు.
హోర్ముజ్ జలసంధిలో ‘సీ మైన్స్’
హోర్ముజ్ జలసంధిలో నౌకలు ప్రయాణిస్తే పేలిపోయేలా సీమైన్స్ (సముద్రపు మందుపాతరలు)ను ఇరాన్ ఏర్పాటు చేస్తోంది. హోర్ముజ్‌లో ప్రయాణించే వాణిజ్య నౌకలకు రక్షణ కల్పిస్తామని అమెరికా ప్రకటించిన నేపథ్యంలో.. వాటిని నియంత్రించేందుకు సీమైన్స్‌ను ఏర్పాటు చేస్తోందని అమెరికా నిఘా వర్గాలను ఉటంకిస్తూ సీఎన్‌ఎన్ కథనం ప్రచురించింది. ఇప్పటివరకు పదుల సంఖ్యలోనే ఏర్పాటు చేసిందని పేర్కొంది. ఇరాన్ నౌకల్లో చాలా వాటిని అమెరికా పేల్చివేసినా.. సీమైన్స్‌ను పెట్టగల చిన్న బోట్లు వందల సంఖ్యలో ఇరాన్ వద్ద ఉన్నాయని వెల్లడించింది. ఈ అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ.. హోర్ముజ్‌లో ఇరాన్ సీమైన్స్‌ను ఏర్పాటు చేసి ఉంటే వెంటనే తొలగించాలని, లేకుంటే ఎన్నడూ లేనంత స్థాయిలో దాడులను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. సీమైన్లను ఏర్పాటు చేసే బోట్లను నిర్దాక్షిణ్యంగా పేల్చివేస్తామని చెప్పారు. ట్రంప్ వ్యాఖ్యలను అనుగుణంగా రంగంలోకి దిగిన అమెరికా సెంట్రల్ కమాండ్.. బుధవారం దాడులు చేసి, 16 మైన్‌లేయర్ (సీమైన్లను అమర్చే) బోట్లను నాశనం చేసినట్టు ప్రకటించింది.