ఇరాన్ చేతిలో యూఎస్ అండర్ వాటర్ డ్రోన్!
ABN , Publish Date - Sep 09 , 2026 | 10:13 AM
ఇరాన్ నావికాదళం తాజాగా సంచలన ప్రకటన చేసింది. యూఎస్‌కు చెందిన డైవ్-ఎల్‌డీ అనే మానవరహిత సబ్‌మెరైన్‌ను హోర్ముజ్ జలసంధిలో స్వాధీనం చేసుకున్నట్టు ప్రకటించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్ నావికాదళం తాజాగా సంచలన ప్రకటన చేసింది. యూఎస్‌కు చెందిన డైవ్-ఎల్‌డీ అనే మానవరహిత సబ్‌మెరైన్‌ను హోర్ముజ్ జలసంధిలో స్వాధీనం చేసుకున్నట్టు ప్రకటించింది. ఇది ఒక స్వల్ప శ్రేణి సబ్‌మెరైన్ అని, నిఘా కార్యకలాపాల కోసం వినియోగిస్తారని చెప్పుకొచ్చింది. ఈ విషయాలు ఇరాన్ సైన్యానికి చెందిన పత్రిక సెపాహ్ న్యూస్‌లో తాజాగా ప్రచురితమయ్యాయి. అత్యాధునిక సాంకేతికతలు ఉన్న ఈ సబ్‌మెరైన్ తమ చేతికి చిక్కిందని ఇరాన్ ఘనంగా ప్రకటించింది.
ఈ వార్తలపై అమెరికా ఆచితూచి స్పందించింది. సముద్ర జలాల్లో నిఘా కార్యకలాపాల కోసం ఉద్దేశించిన అండర్ వాటర్ డ్రోన్‌లో నిన్న సాంకేతిక లోపం తలెత్తినట్టు పేర్కొంది. కానీ సాంకేతికలోపం తలెత్తిన అండర్ వాటర్ డ్రోన్ ఇరాన్‌కు చిక్కిందా? అన్న విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అయితే, ఆ డ్రోన్ పాతదని, అందులో అత్యాధునిక సాంకేతికతలు ఏవీ లేవని కూడా అమెరికా రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్ ప్రతినిధి పేర్కొన్నారు.
హోర్ముజ్ జలసంధిలో కార్యకలాపాల కోసం అమెరికా ఇటీవల కాలంలో మానవరహిత డ్రోన్లు, బోట్లపై ఎక్కువగా ఆధారపడుతోంది. తక్కువ ఖర్చుతో యుద్ధ చర్యలు చేపట్టడంతో పాటు తమ సైనికులకు ముప్పు తగ్గించేందుకు ఈ వ్యూహాన్ని అమలు చేస్తోంది.
అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, డైవ్-ఎల్‌డీ పది రోజుల పాటు నిర్విరామంగా తన కార్యకలాపాలు నిర్వహించగలదు. నీటిలో గరిష్ఠంగా 19,700 అడుగుల లోతున సంచరిస్తూ నిఘా కార్యకలాపాలు చేపట్టగలదు. ఒక సబ్‌మెరైన్ ధర 2.5 మిలియన్ డాలర్లని సమాచారం.
ఈ వార్తలనూ చదవండి:
కాగ్నిజెంట్‌కు షాకిచ్చిన యూఎస్.. పీఈఆర్ఎమ్ దరఖాస్తుల నిలిపివేత
ఇరాన్ నౌకలపై విరుచుకుపడ్డ అమెరికా.. ఐదు ఆయిల్ ట్యాంకర్లు ధ్వంసం..