Share News

కాగ్నిజెంట్‌కు షాకిచ్చిన యూఎస్.. పీఈఆర్ఎమ్ దరఖాస్తుల నిలిపివేత

ABN , Publish Date - Sep 09 , 2026 | 08:24 AM

ప్రముఖ టెక్ సంస్థ కాగ్నిజెంట్‌కు అమెరికా షాకిచ్చింది. నూతన పీఈఆర్‌ఎమ్ దరఖాస్తులను సమర్పించేందుకు కంపెనీకి అనుమతి నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

కాగ్నిజెంట్‌కు షాకిచ్చిన యూఎస్.. పీఈఆర్ఎమ్ దరఖాస్తుల నిలిపివేత
Cognizant PERM Filings Suspended

ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ టెక్ సంస్థ కాగ్నిజెంట్‌కు (Cognizant) అమెరికా షాకిచ్చింది. నూతన పీఈఆర్‌ఎమ్ (PERM) దరఖాస్తులను సమర్పించేందుకు కంపెనీకి అనుమతి నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కార్మికశాఖ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆంథొనీ డీఎస్పోసీతో ఈ విషయాన్ని ప్రకటించారు. కోల్డెరా అనే మరో సంస్థకు అనుమతిని కూడా నిలిపివేశామని చెప్పారు. ఉద్యోగ ఆధారిత వీసాలకు సంబంధించి ఇప్పటికే విస్తృత దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

ఈ విషయంలో తమ శాఖ అధికారులు శ్వేత సౌధం టాస్క్ ఫోర్స్‌తో కలిసి పనిచేస్తున్నట్టు చెప్పారు. వీసా నిబంధనల దుర్వినియోగంతో అమెరికా వర్కర్లకు ముప్పు ఎదురవుతుంటే సహించబోమని ఆంథొనీ డీఎస్పోసీతో స్పష్టం చేశారు. తప్పు చేసిన వారికి బేడీలు తప్పవని కూడా ఎక్స్ వేదికగా ఆయన పోస్టు పెట్టారు. తమ ఉద్యోగులకు అమెరికాలో గ్రీన్ కార్డు కోసం ప్రయత్నించే సంస్థలు ముందుగా కార్మిక శాఖ అనుమతి కోసం పీఈఆర్ఎమ్ సర్టిఫికేషన్‌కు దరఖాస్తు చేస్తాయన్న విషయం తెలిసిందే.


కార్మికశాఖ తాజా ఆదేశాల నేపథ్యంలో కాగ్నిజెంట్‌కు కొత్త పీఈఆర్ఎమ్ దరఖాస్తులను సమర్పించేందుకు అనుమతి ఉండదు. అయితే, ఇప్పటికే సమర్పించిన దరఖాస్తులపై తాజా ఆదేశాలు ప్రభావం ఉండబోదని కూడా తెలుస్తోంది. హెచ్-1బీ వీసా, పీఈఆర్ఎమ్ సర్టిఫికేషన్లు దుర్వినియోగం అవుతున్నాయన్న ఆరోపణలపై కార్మిక శాఖ ఇటీవల దర్యాప్తు ప్రారంభించింది. వీసా దరఖాస్తుల్లో మోసాలు, జీతాల విషయంలో మోసాలు, విదేశీ వర్కర్ల శ్రమ దోపీడీ తదితర ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నామని కార్మిక శాఖ గతంలో పేర్కొంది.

పీఈఆర్ఎమ్‌ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే..

ఉద్యోగ ఆధారిత వలస విధానాల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేస్తున్నామంటూ యూఎస్ ఇటీవల పలు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా విదేశీ ఉద్యోగులకు యూఎస్ గ్రీన్ కార్డులు స్పాన్సర్ చేసే సంస్థలపై కూడా దృష్టిసారించింది. గ్రీన్ కార్డు ప్రక్రియకు సంబంధించి పీఈఆర్ఎమ్ దరఖాస్తులు కీలక తొలి దశ. వీటిని అడ్డుకుంటే కంపెనీలకు గ్రీన్ కార్డులను స్పాన్సర్ చేసే అవకాశమే ఉండదు.


ఉద్యోగానికి తగిన నిపుణులు స్థానికంగా అందుబాటులో లేరని రుజువు చేసేందుకు కంపెనీలు విదేశీ ఉద్యోగుల తరఫున పీఈఆర్ఎమ్ దరఖాస్తును సమర్పిస్తాయి. ఈ దరఖాస్తును అక్కడి కార్మిక శాఖ ఆమోదిస్తే గ్రీన్ కార్డుకు సంబంధించి తదుపరి ప్రక్రియ మొదలవుతుంది. కంపెనీలు ఆ తరువాత ఉద్యోగుల తరఫున ఐ-140ని ఫార్మ్‌ను సమర్పిస్తాయి. ఐ-140 దరఖాస్తుకు కూడా ఆమోదం లభిస్తే అమెరికాలో స్థిరపడేందుకు విదేశీయులకు మార్గం కొంత సుగమమైనట్టే. మరోవైపు, పీఈఆర్ఎమ్ దరఖాస్తు పరిశీలన ఏడాదికి పైగా పెండింగ్‌లో ఉంటే హెచ్-1బీ వీసాను ఏడాది పాటు పొడిగించుకునే అవకాశం ఉంటుంది. ఇక ఐ-140 అప్రూవల్ ఉన్న హెచ్-1బీ వీసాదారులు గ్రీన్ కార్డు వచ్చేలోపే తమ వీసాగడువును అవసరాల మేరకు పొడిగించుకోవచ్చు. యూఎస్ హెడ్‌క్వార్టర్స్‌గా కార్యకలాపాలు సాగిస్తున్న కాగ్నిజెంట్ ఉద్యోగ ఆధారిత వీసా ప్రోగ్రామ్స్‌ను ఎక్కువగా వినియోగిస్తున్న కంపెనీల జాబితాలో ఉంది.


ఈ వార్తలనూ చదవండి:

బ్రిటన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌లో సమస్య.. 1000 విమానాలు రద్దు..

టిబెట్‌లో భూకంపం.. నేపాల్‌లో కంపించిన భూమి..

Updated Date - Sep 09 , 2026 | 09:06 AM