స్టార్‌లింక్ సాయంతో అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు!
ABN , Publish Date - Nov 29 , 2026 | 10:13 AM
టెక్ ఆంత్రప్రెన్యూర్ ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలను ఇరాన్ వినియోగించినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: టెక్ ఆంత్రప్రెన్యూర్ ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలను ఇరాన్ వినియోగించినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. యుద్ధం ప్రారంభమైన తొలిరోజుల్లో అమెరికాపై దాడుల సమయంలో స్టార్‌లింక్ సాయం తీసుకున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. రెండు సందర్భాల్లో డ్రోన్‌ల నియంత్రణ కోసం స్టార్‌లింక్ ఇంటర్నెట్‌ను ఇరాన్ వినియోగించినట్టు సమాచారం. ఇందుకు సంబంధించిన నివేదిక కూడా అమెరికా రక్షణ శాఖ మంత్రికి చేరినట్టు తెలిసింది. అయితే, ఇలాంటిదేమీ తమ దృష్టికి రాలేదని అమెరికా రక్షణ శాఖ కార్యాలయం పేర్కొంది. కువైట్‌లోని అమెరికా స్థావరాలపై జరిపిన దాడుల కోసం స్టార్‌లింక్ వాడారా అన్న దానిపై స్పష్టత లేదు. ఆ దాడిలో ఆరుగురు అమెరికా సైనికులు మరణించారు.
మస్క్ ఆగ్రహం..
స్పేస్‌ఎక్స్ సారథ్యంలో పౌర అవసరాల కోసం స్టార్‌లింక్, అమెరికా సైన్యం అవసరాల కోసం స్టార్‌షీల్డ్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులో ఉన్నాయి. అయితే, క్షేత్రస్థాయి ఆపరేషన్లలోనే ఈ శాటిలైట్ సేవలను సైన్యం వినియోగించాలనేది స్పేస్ఎక్స్ పెట్టిన షరతుల్లో ఒకటని సమాచారం. కానీ స్టార్‌షిల్డ్‌ను అమెరికా డ్రోన్ ఆపరేషన్స్‌కు కూడా వినియోగించినట్టు సమాచారం. అటు అమెరికా, ఇటు ఇరాన్ ఇలా ఇష్టారీతిన తమ శాటిలైట్ సేవలను వాడటంపై మస్క్ ఆగ్రహంతో ఉన్నట్టు కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఆ తరువాత కాలంలో ఇద్దరు స్పేస్ఎక్స్ ఉన్నతాధికారులు జాబ్ కోల్పోయినట్టు కూడా తెలిసింది.
స్టార్‌లింక్ సేవలకు ఇరాన్‌లో అనుమతులు లేవని మస్క్ ఎప్పటి నుంచో చెబుతున్నారు. అయితే, తమ సేవలు అక్కడ క్రియాశీలకంగానే ఉన్నాయని చెప్పారు. ఇంటర్నెట్ సేవలపై అక్కడి ప్రభుత్వ ఆంక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో శాటిలైట్ ఇంటర్నెట్‌ను ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు ఎలాన్ మస్క్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు అంతర్జాతీయ మీడియా చెబుతోంది. ఇరాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు పతాకస్థాయిలో ఉన్న సమయంలో వేల కొద్దీ స్టార్‌లింక్ టర్మినల్స్‌ను అమెరికా ఇరాన్‌లోకి అక్రమంగా తరలించినట్టు సమాచారం. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సందర్భంగా కూడా స్టార్‌లింక్ అంశం తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే.
ఈ వార్తలనూ చదవండి:
దక్షిణ కరోలినాలో భూకంపం.. స్వల్పంగా దెబ్బతిన్న ఎయిర్‌పోర్టు
డీలిమిటేషన్‌తో ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు పెరుగుతాయో తెలుసా?