Share News

యూఎస్‌తో చర్చలకు నో.. ఇరాన్ సంచలన నిర్ణయం!

ABN , Publish Date - Apr 20 , 2026 | 07:39 AM

యూఎస్‌తో శాంతి చర్చల్లో ఇరాన్ పాల్గొనదని అక్కడి ప్రభుత్వ మీడియా తాజాగా పేర్కొంది. యూఎస్ వైఖరే ఇందుకు కారణమని నిందించింది.

యూఎస్‌తో చర్చలకు నో.. ఇరాన్ సంచలన నిర్ణయం!
Iran Rejects Talks With US

ఇంటర్నెట్ డెస్క్: మరో రెండు రోజుల్లో కాల్పుల విరమణ ఒప్పందం గడువు ముగియనున్న నేపథ్యంలో ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. పాక్ వేదికగా యూఎస్‌తో చర్చల్లో పాల్గొనవద్దని ఇరాన్ నిర్ణయించుకున్నట్టు ప్రభుత్వ మీడియాలో కథనం వెలువడింది. ఇస్లామాబాద్‌లో ఇరాన్ టీమ్‌తో తమ బృందం సమావేశం అవుతుందని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కాసేపటికే ఈ కథనం వెలువడటం పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను మరింత పెంచింది. ఇస్లామాబాద్‌లో రెండో దశ చర్చలపై వస్తున్న వార్తలు అవాస్తవం అని ఇరాన్ ప్రభుత్వ మీడియా ఎక్స్ వేదికగా కూడా స్పష్టం చేసింది.


అమెరికా తీరువల్లే చర్చల్లో పురోగతి లేదని ఇరాన్ ప్రభుత్వ మీడియా పేర్కొంది. నిర్హేతుకమైన, ఆచరణ సాధ్యం కాని డిమాండ్స్, చర్చల లక్ష్యాల్లో తరచూ మార్పులు, పరస్పర విరుద్ధ ప్రకటనలు, ఇరాన్‌ను దిగ్బంధించడం, బెదిరింపులకు దిగడం వంటివన్నీ అంతర్జాతీయ కాల్పుల విరమణ ఒప్పందానికి వ్యతిరేకమని పేర్కొంది. ఈ పరిస్థితుల్లో చర్చలకు అవకాశాలు తక్కువ అని తేల్చి చెప్పింది. తప్పులను అమెరికా తమపైకి నెట్టే ప్రయత్నం చేస్తోందని కూడా ఇరాన్ ఆరోపిస్తోంది. తమపై ఒత్తిడిని పెంచేలా రెండో రౌండ్ చర్చల ప్రస్తావన తెచ్చిందని పేర్కొంది.


తమ పోర్టుల నుంచి నౌకల రాకపోకలు జరగకుండా యూఎస్ దిగ్బంధించడంపై ఇరాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. దీనికి తోడు యూఎస్ తాజాగా ఇరాన్‌కు చెందిన ఒక నౌకను స్వాధీనం చేసుకోవడం పరిస్థితులను మరింత ఉద్రిక్తంగా మార్చింది. ఇందుకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ తాజాగా హెచ్చరించింది.

ఈ వార్తలనూ చదవండి;

అమెరికాలో కాల్పులు.. 8 మంది పిల్లల మృతి

ఆ టైమ్ వచ్చింది.. ఇరాన్‌కు ట్రంప్ మరో హెచ్చరిక

Updated Date - Apr 20 , 2026 | 08:01 AM