కాల్పుల విరమణ.. యూఎస్ ప్రతిపాదనలను తిరస్కరించిన ఇరాన్
ABN , Publish Date - Apr 06 , 2026 | 09:50 PM
కాల్పుల విరమణకు ఇరాన్ నో చెప్పింది. ఈ విషయాన్ని ఇరాన్ ప్రభుత్వ మీడియా ఓ కథనంలో తెలిపింది. శాశ్వత పరిష్కారం వైపే ఇరాన్ మొగ్గు చూపుతున్నట్టు పేర్కొంది.
ఇంటర్నటె డెస్క్: కాల్పుల విరమణకు సంబంధించి అమెరికా ప్రతిపాదనలను తమ ప్రభుత్వం తిరస్కరించిందని ఇరాన్ అధికారిక వార్తా సంస్థ తాజాగా ఓ కథనాన్ని ప్రచురించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన డెడ్‌లైన్ మరికొన్ని గంటల్లో ముగియనున్న నేపథ్యంలో ఈ కథనం కలకలం రేపుతోంది. ఈ నిర్ణయాన్ని ఇరాన్ ప్రభుత్వం పాక్ ద్వారా అమెరికాకు తెలియజేసిందని సమాచారం. ఈ అంశంలో తాత్కాలిక కాల్పుల విరమణకు బదులు శాశ్వతంగా యుద్ధానికి తెరదించే పరిష్కారం కావాలని ఇరాన్ పేర్కొన్నట్టు తెలిసింది.
గల్ఫ్‌లో శాంతిస్థాపన కోసం పలు దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ దిశగా ఇరు వర్గాలు 45 రోజుల పాటు కాల్పుల విరమణ పాటించాలని సూచించాయి. ఈ విషయమై కైరోలోని ఇరాన్ దౌత్యవేత్త మోజ్తాబా ఫిర్దౌసీ కూడా స్పందించారు. ‘కేవలం కాల్పుల విరమణను అంగీకరించబోము. ఈ యుద్ధం ముగిసిపోవాలి. మళ్లీ దాడులు ఉండబోవన్న గ్యారెంటీ కావాలి’ అని ఆయన తమ ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేశారు.
డెడ్‌లైన్ ముగిశాక తాము మరిన్ని దాడులకు దిగుతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. పవర్ ప్లాంట్‌లు, బ్రిడ్జీలు వంటి వసతులపై దాడులు మొదలవుతాయని హెచ్చరించారు. హోర్ముజ్‌ను తెరవకపోయినా, తమతో డీల్ కుదుర్చుకోకపోయినా ఇరాన్‌లో నరకం కనిపిస్తుందని హెచ్చరించారు.
మరోవైపు, ఇజ్రాయెల్ తాజాగా ఇరాన్‌లోని కీలక పెట్రోకెమికల్ ప్లాంట్‌ను టార్గెట్ చేసింది. ఈ దాడిలో ఇరాన్ పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్స్ దళానికి చెందిన ఇద్దరు కమాండర్లు మృతి చెందారు. ఇరాన్‌కు ఆదాయ మార్గాలను మూసివేసే దిశగా ఈ దాడి చేశామని ఇజ్రాయెల్ చెప్పుకొచ్చింది.
ఈ వార్తలూ చదవండి:
ఆర్టెమిస్-2 మిషన్.. సరికొత్త రికార్డు దిశగా వ్యోమగాములు
కాల్పుల విరమణ ప్రతిపాదనలను పరిశీలిస్తున్న ఇరాన్, యూఎస్ఏ