తుది పోరుకు సిద్ధం: ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి
ABN , Publish Date - Sep 28 , 2026 | 09:28 AM
అమెరికాతో తుదిపోరుకు తాము సిద్ధమేనని ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అరాగ్చీ స్పష్టం చేశారు. తాము మళ్లీ దాడులు మొదలు పెట్టవచ్చన్న అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ మంత్రి ఈ మేరకు స్పందించారు.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాతో తుది పోరుకు తాము సిద్ధమేనని ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తెలిపారు. అయితే, చర్చల ద్వారా పరిష్కారం లభించాలని ఆశిస్తున్నట్టు అంతర్జాతీయ మీడియాకు ఆదివారం ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. మిడ్ టర్మ్ ఎన్నికల తరువాత దాడులు మొదలయ్యే ఛాన్స్ ఉందని అధ్యక్షుడు ట్రంప్ తన సన్నిహితుల వద్ద ప్రస్తావించిన విషయాన్ని ఓ అమెరికా పత్రిక ప్రచురించింది. ఈ వార్తలపై స్పందిస్తూ తాము తుదిపోరుకు సిద్ధమేనని అరాగ్చీ తేల్చి చెప్పారు.
‘మళ్లీ యుద్ధం చేయడానికి మేము పూర్తి సన్నద్ధతతో ఉన్నాము. ఎలాంటి దాడులనైనా తిప్పి కొట్టేందుకు సిద్ధంగా ఉన్నాము. అది తుది పోరు అయినా మేము వెనకడుగు వేయము. కాబట్టి, తదుపరి ఏం చేయాలనేది తేల్చుకోవాల్సింది అమెరికా అధ్యక్షుడే’ అని ఆయన స్పష్టం చేశారు.
హోర్ముజ్ తెరిచేందుకు పలు షరతులతో కూడిన ప్రతిపాదనలను ఇటీవల ఇరాన్ అమెరికా ముందుంచింది. ఖతారీ మధ్యవర్తుల ద్వారా ఈ ప్రతిపాదనలు పంపించింది. వీటిపై అధ్యక్షుడు ట్రంప్ స్పందిస్తూ వాటిని తిరస్కరించానని తెలిపారు. ఓటమి అంచున ఉన్న వారు డీల్ కోసం తహతహలాడుతున్నారని వ్యాఖ్యానించారు.
అయితే, డీల్‌ను తిరస్కరించిన విషయాన్ని అమెరికా తమకు మధ్యవర్తుల ద్వారా ఇంకా తెలియజేయలేదని తాజాగా మంత్రి అరాగ్చీ అన్నారు. తమ షరతుల్లో కొత్తవేమీ లేవని, గతంలో వీటిని అమెరికా అంగీకరించిందని గుర్తు చేశారు. ‘విదేశాల్లో అక్రమంగా సీజ్ చేసిన మా డబ్బు, ఆస్తులు మాకు కావాలి. ముడి చమురును స్వేచ్ఛగా విక్రయించుకునే అవకాశం మాకు ఉండాలి. ఇవేమీ కొత్త షరతులు కావు’ అని అన్నారు. గతంలో అమెరికాతో కుదిరిన అవగాహన ఒప్పందంలో ఈ అంశాలు ఉన్నాయని గుర్తు చేశారు.
ఈ యుద్ధం అతి త్వరలో ముగుస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం తెలిపారు. ఆ తరువాత ముడి చమురు ధరలు కూడా దిగొస్తాయని అన్నారు. ఆర్థికంగా ఒత్తిడి పెంచడంతో పాటు మిలిటరీ చర్యలతో ఇరాన్‌పై విజయం సాధిస్తున్నామని చెప్పారు.
ఈ వార్తలనూ చదవండి:
నేపాల్‌లో బేస్ క్యాంప్ మీద కుప్పకూలిన అవలాంచ్.. ఇద్దరి మృతి
మూడు ఆస్పత్రులకు తీసుకెళ్తే.. మూడింటిపైనా బాంబులేశారు!